Warangal: సీనియర్ వేధింపులతోనే..! వైద్య విద్యార్థిని ప్రీతి పరిస్థితి విషమం.. నిమ్స్‌లో చికిత్స..
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ (KMC) లో ప్రీతి ఆత్మహత్యాయత్నానికి సీనియర్ మెడికో వేధింపులే కారణమని ఆమె తండ్రి ఆరోపిస్తున్నారు.
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ (KMC) లో ప్రీతి ఆత్మహత్యాయత్నానికి సీనియర్ మెడికో వేధింపులే కారణమని ఆమె తండ్రి ఆరోపిస్తున్నారు. అనస్థీషియా కోర్స్‌లో పీజీ చేస్తున్న ప్రీతి.. మత్తుమందు హైడోస్ తీసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించింది. అపస్మరక స్థితిలోకి వెళ్లిన ప్రీతికి వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు. అయితే, పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. ఉదయం ప్రీతి హెల్త్ కండిషన్ గమనించిన సహా విద్యార్థులు వెంటనే MGMకు తరలించినా అంతకంతకూ విషమంగా మారుతుండడంతో చివరకు హైదరాబాద్ నిమ్స్‌కు తీసుకువచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. విద్యార్థిని మల్టీ ఆర్గాన్స్ దెబ్బతిన్నట్లు తెలుస్తోందని శ్వాస తీసకోవడంతో బాధితురాలు ఇబ్బంది పడుతోందని ఎంజీఎం సూపరింటెండెంట్ తెలిపారు.
MBBS పూర్తి చేసిన ప్రీతి ఐదు నెలల క్రితం వరంగల్ KMCలో PGలో చేరింది. ఆమె తండ్రి నరేందర్ రైల్వే డిపార్ట్‌మెంట్‌లో ASIగా పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. డ్యూటీ విషయంలో తనకు ఎదురవుతున్న వేధింపులు, పలు విషయాలను ప్రీతి డిసెంబర్‌లోనే తండ్రికి చెప్పినట్టు తెలుస్తోంది. తాను కుమార్తెకు ధైర్యం చెప్పి విషయం స్థానిక పోలీసులకు చెప్పానంటున్నారు. ఇది యూనివర్సిటీ అధికారులకు తెలిసి కంప్లైంట్ ఎందుకు ఇచ్చారంటూ అమ్మాయిని మందలించారని పేర్కొంటున్నారు. ఈ ర్యాగింగ్‌కి కారకులైన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నరేందర్.
కాగా, సీనియర్ విద్యార్థి వేధింపుల వల్లే.. విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, ర్యాగింగ్ జరిగిందా లేదా అన్నది నిర్ధారణ కావాల్సి ఉందని పోలీసులు తెలిపారు. వేధింపులపై విచారణకు కమిటీ వేస్తున్నామని.. మూడు కమిటీలతో విచారణ జరిపిస్తున్నామని కేఎంసీ అధికారులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..