Revanth Reddy: బీఆర్ఎస్ నేతలు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు.. మంత్రి కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. బీఆర్‌ఎస్ నేతలు విపక్షాలు ఎత్తిచూపిన సమస్యలకు సమాధానాలు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ఇటీవల తాను అమెరికాలో విద్యుత్ గురించి మాట్లాడిన విషయాన్ని బీఆర్ఎస్ నేతలు వక్రీకరించారని అన్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు వివిరిస్తుంటే బీఆర్ఎస్ మంత్రులు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. బీఆర్‌ఎస్ నేతలు విపక్షాలు ఎత్తిచూపిన సమస్యలకు సమాధానాలు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ఇటీవల తాను అమెరికాలో విద్యుత్ గురించి మాట్లాడిన విషయాన్ని బీఆర్ఎస్ నేతలు వక్రీకరించారని అన్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు వివిరిస్తుంటే బీఆర్ఎస్ మంత్రులు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన సభలో వాస్తవాలు చెప్పే అవకాశం ఇవ్వకపోయిన ప్రజలకు వాస్తవాలు తెలియకుండా ఉంటాయా అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇటీవల భారీ వర్షాలతో రాష్ట్రాన్ని వరదలు కుదిపేశాయని.. వరద బాధితులను ఆదుకొని ఉంటే సీతక్క లాంటి ఎమ్మెల్యేలు కన్నీళ్లు పెట్టాల్సిన అవసరం ఉండేది కాదని అన్నారు. వాస్తవానికి వరద బాధితుల ప్రాంతాల్లో తిరగాల్సిన బీఆర్ఎస్ నేతలు రౌడీల్లా వీధుల్లో తిరుగుతున్నారని అన్నారు.
వరద బాధితులకు నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేదని.. ప్రభుత్వాన్ని ఎవరైనా అడ్డుకున్నారా అని ప్రశ్నలు వేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా.. మున్సిపల్ మంత్రి వరదల్లో కొట్టుకుపోయారా.. అసలు రాష్ట్రంలో మంత్రులు ఉన్నారా లేరా అని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లిలోని దాసరి మనోహర్ రెడ్డి చివరికి దేవుని మాన్యాలను కూడా వదలడం లేదని అన్నారు. ఈసారి మనోహర్ రెడ్డిని ఆ దేవుడు కూడా కాపాడలేడని పేర్కొన్నారు. ప్రజల్లో ఉండి తాము ప్రజల కోసం కొట్లాడుతున్నామని.. మీ కోసం మేముంటామని.. తమకోసం ఉండాలని ప్రజలను రేవంత్ కోరారు. కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలను పార్టీ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుందని అన్నారు. హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం దాదాపు 10 వేల వరకు ఎకరాలు కబ్జా చేసిందని ఆరోపించారు. అలాగే లక్ష కోట్లు వెనకేసుకున్నారని.. ఎన్నో త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని అన్నారు.




ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణతో రుణం తీరిపోయిందని.. రాష్ట్రం పట్ల కేసీఆర్‌కు మోజు తీరిందన్నారు రేవంత్ రెడ్డి. అందుకే ఇటీవల భారీ వర్షాల వల్ల వచ్చిన వరదలు రాష్ట్రాన్ని కుదిపేయగా.. వరద ప్రాంతాల్లో పర్యటించే ప్రజల సమస్యలు తెలుసుకోకుండా.. మహారాష్ట్ర వెళ్లారని మండిపడ్డారు. మహారాష్ట్రలో పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ అసలు తెలంగాణ రైతులపైనే లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల క్షేమం గురించి ఆలోచించని ముఖ్యమంత్రి కేసీఆర్ మనకు అవసరమా అని సవాల్ చేశారు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేసి ఉన్నట్లైతే.. రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పుడు ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇవ్వాలని అన్నారు. గజ్వేల్ నుంచే సీఎం కేసీఆర్ పోటీ చేయాలని అన్నారు. రాక్షసులందరిని పుట్టించిన బ్రహ్మరాక్షసుడు ముఖ్యంత్రి కేసీఆర్ అని అన్నారు. అలాంటి రాక్షసునికి బొంద పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ధర్మయుద్ధం చేయాల్సిన సమయం ఇప్పుడు వచ్చేసిందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ను గెలిపించాల్సిన బాధ్యత ప్రతికార్యకర్త తీసుకోవాలని పిలుపునిచ్చారు.