Hyderabad: భర్తకు బాలేదంటే.. ఆమె పసుపు కుంకుమ నిలబడాలని డబ్బులిచ్చారు.. కట్ చేస్తే..
ఈ రోజుల్లో మంచి చేయడమే శాపం అయిపోయింది. మనీ తీసుకునేటప్పుడు ఎంతో మంచివాళ్లలాగా నటిస్తారు.. మీకెందుకు మీ డబ్బు పువ్వుల్లో పెట్టి ఇస్తామని కబుర్లు చెబుతారు. కానీ అవసరం అయ్యి అడిగితే.. ఏదో కబుర్లు చెబుతూ కాలం నెట్టుకుపోతారు. ఆ తర్వాత ఇలా చడీ చప్పుడు లేకుండా బీషాణా ఎత్తేస్తారు. ఇలాంటివారి వల్ల నిజంగా అవసరం ఉన్నవారు డబ్బులు అడిగినా.. భయంతో ఇచ్చే పరిస్థితి ఉండటం లేదంటున్నారు జనాలు.
హైదరాబాద్, ఆగస్టు 5: వాళ్లంతా జీవనపాధి కోసం చిన్న, చిన్న పనులు చేసుకుంటూ డబ్బులను కూడాబెట్టుకున్నవాళ్లు.. అందులో కొందరు సొంత ఇంటి కలను నెరవేర్చుకునేందుకు దాచిపెట్టుకొనగా మరి కొంతమంది పిల్లల భవిష్యత్తు కోసం డబ్బులను దాచుకున్నారు. అయితే ఒక్కసారిగా ఆ కలలన్నీ చెదిరిపోయాయి. మానవత్వంతో ఓ మహిళకు చేసిన సాయమే వారికి శాపంగా మారింది. భర్తకు బాగోలేదని మాయ మాటలు చెప్పి ఏకంగా కోట్ల రూపాయలను తీసుకొని పత్తా లేకుండా పోయింది ఓ మహిళ… ఈ ఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మారుతి నగర్‌లో నివాసం ఉండే చంద్రకళ తన కుమారుడు అమెరికాలో ఉంటున్నాడని తన భర్తకు బాలేదని అప్పు కావాలంటూ కొందరు మహిళలను సహాయం అడిగింది. సదరు మహిళ కష్టాన్ని అర్థం చేసుకున్న మరి కొంతమంది మహిళలు ఆమెకు విడతల వారీగా డబ్బులు ఇచ్చారు. ఆమె పసుపు కుంకుమ నిలబడాలని కోరుకున్నారు. అయితే ఈ విషయాన్ని చంద్రకళ ఒకరికి తెలియకుండా మరొకరి దగ్గర నుంచి మాయమాటలు చెప్పి కోట్ల రూపాయలను దోచుకుంది. అడిగితే రేపిస్తాను.. మాపిస్తాను అంటూ ప్రతిరోజు ఏదో ఒక సాకు చెప్పుకుంటూ కాలాన్ని వెల్లదీసింది.
డబ్బులు ఇచ్చిన మహిళల వద్ద చంద్రకళ ఎంతో దుఃఖంతో పరిస్థితులు బాలేదని మనోవేదనకు గురైనట్లు నటించడం మొదలెట్టింది. డబ్బు ఇచ్చిన మహిళలకు చంద్రకళ మీద అనుమానం రావడంతో ఒక్కొక్కరిగా ఆమె ఇంటికి క్యూ కట్టారు. దీంతో చంద్రకళ అసలు గుట్టు బయటపడింది. పదుల సంఖ్యలో మహిళల వద్ద ఆమె డబ్బులు తీసుకుంది ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నట్లు అందరికీ అర్థం అయ్యింది. కేవలం డబ్బుతో మాత్రమే కాకుండా బంగారాన్ని సైతం తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చినటువంటి బాదిత మహిళలు కూడా ఎంతోమంది ఉన్నారు. దాచుకున్న డబ్బును కూడా వదలకుండా మహిళల నుంచి రాబట్టి అటు డబ్బు ఇటు బంగారాన్ని తీసుకుని చడీచప్పుడు కాకుండ తీసుకొని ఊడాయించింది. దీంతో బాధిత మహిళలు కంటతడితో అత్తాపూర్ పోలీసులను ఆశ్రయించారు. తమకు రావాల్సినటువంటి డబ్బులను ఇప్పించాలని కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు.
చూశారుగా ఈ రోజుల్లో మంచి చేయడమే శాపం అయిపోయింది. మనీ తీసుకునేటప్పుడు ఎంతో మంచివాళ్లలాగా నటిస్తారు.. మీకెందుకు మీ డబ్బు పువ్వుల్లో పెట్టి ఇస్తామని కబుర్లు చెబుతారు. కానీ అవసరం అయ్యి అడిగితే.. ఏదో కబుర్లు చెబుతూ కాలం నెట్టుకుపోతారు. ఆ తర్వాత ఇలా చడీ చప్పుడు లేకుండా బీషాణా ఎత్తేస్తారు. ఇలాంటివారి వల్ల నిజంగా అవసరం ఉన్నవారు డబ్బులు అడిగినా.. భయంతో ఇచ్చే పరిస్థితి ఉండటం లేదంటున్నారు జనాలు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..