ఔషధ మూలికలతో పారుతున్న జలపాతం.. క్యూ కడుతున్న జనం.. ఎక్కడంటే..?
ప్రకృతి అందాలకు నెలవు ఈ జలదృశ్యం. భారీ వర్షాలతో ఎత్తైన కొండల నుంచి వచ్చే నీటి నురగల జలపాతం దగ్గర సందడి చేస్తూ, ఎంజాయ్ చేస్తున్నారు టూరిస్టులు. వర్షాలకు గుట్టపై నుంచి నీరు వస్తుండటం ఆకట్టుకుంటుంది.
ప్రకృతి అందాలకు నెలవు ఈ జలదృశ్యం. భారీ వర్షాలతో ఎత్తైన కొండల నుంచి వచ్చే నీటి నురగల జలపాతం దగ్గర సందడి చేస్తూ, ఎంజాయ్ చేస్తున్నారు టూరిస్టులు. వర్షాలకు గుట్టపై నుంచి నీరు వస్తుండటం ఆకట్టుకుంటుంది. అంతేకాదు ఆ నీరు తాగితే సర్వరోగాలు నయమైపోతాయట, దీంతో ఆ నీటిని తాగేందుకు, ఆ నీటిలో స్నానం చేసేందుకు అడవి బాట పడుతున్నారు జనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు నిత్యం వందల సంఖ్యలో పర్యాటకులు జాలవారుతున్న జలపాతంలో స్నానం చేసి, ఆ నీటిని తాగి, బాటిల్స్ లో ఇంటికి తెచ్చుకుంటున్నారు. వీకెండ్‌లో భారీగా పర్యాటకులు తరలివస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లి, జాఫర్‌ఖాన్ పేట సరిహద్దుల్లో రామగిరి ఖిల్లాకు ఆనుకుని ఉన్న పాండవ లంకకు పర్యాటకుల తాకిడి పెరిగింది. కనువిందు చేస్తున్న పాండవుల లంక జలపాత దృశ్యాన్ని ఆస్వాదించేందుకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండే కాకుండా, పరిసర ప్రాంతాల నుండి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.
పాండవులు వనవాస సమయంలో ఈ లొంకలో కొన్ని రోజులు గడిపినట్లు గుట్టపైన పాండవుల చరిత్ర ఆనవాళ్లు ఉన్నాయి. అంతేకాదు వారు ఏర్పాటు చేసిన శివలింగం ఇప్పటికి ఇక్కడ దర్శనమిస్తోంది. శ్రీరాముడు కూడా తన వనవాస సమయంలో ఈ శివలింగాన్ని పూజించినట్లు స్థల పురాణం చెబుతోంది. వనవాస సమయంలో భీముడి గద గుట్టపై నుండి జలపాతం వద్ద కింద పడడంతో గదను పోలిన ఆనవాళ్లు ఉన్నాయి.
జలపాతంతో ఏర్పడ్డ ఆ గుండంలో స్నానం చేస్తే అంత మంచి జరుగుతుందని నమ్మకం. కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల అపార విశ్వాసం. అంతేకాదు వర్షాకాలంలో గుట్టపై నుండి వచ్చే నీటిలో స్నానం చేసి, ఆ నీటిని తాగితే సర్వరోగాలు నయమవుతాయని, రామగిరి ఖిల్లా గుట్ట నుండి పాండవుల లంక వరకు ఈ గుట్టపై సంజీవనితోపాటు అనేక ఔషధ గుణాలున్న చెట్లు ఉన్నాయి. ఈ నీటిని తాగితే సర్వరోగలు నయమవుతాయని ఈ ప్రాంతానికి క్యూ కడుతున్నారు టూరిస్టులు.
అయితే ఈ ప్రాంతానికి వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ జలపాతం వద్దకు రోడ్డు సౌకర్యాన్ని కల్పించాలని పర్యాటకులు కోరుతున్నారు. అయితే..ఈ కొండపై వివిధ రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. ఆయుర్వేద ఆకులన్నీ నీటిలో కలిసి ఔషధంగా మారుతోంది. దీంతో అన్ని రకాల రోగాల నుంచి విముక్తి లభిస్తుందని స్థానికులు నమ్ముతున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..