ఆర్యసమాజ్ @ ప్రేమ పెళ్లిళ్లు.. 100 ఏళ్ల ఉత్సవాలకు ముస్తాబు.. ముఖ్యఅతిధి ఎవరంటే.?
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ.. అనేక సంఘ సంస్కరణలను అమలు చేస్తూ సాధారణ ప్రజల్లోనూ మూఢనమ్మకాలు, అసాంఘిక కట్టుబాట్లపై ఉద్యమించిన ఆర్యసమాజ్ నల్గొండలో వందేళ్లు పూర్తి చేసుకుంది. మార్చి 1, 2, 3 తేదీల్లో ఆర్య సమాజాన్ని ఏర్పాటు చేసిన..

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ.. అనేక సంఘ సంస్కరణలను అమలు చేస్తూ సాధారణ ప్రజల్లోనూ మూఢనమ్మకాలు, అసాంఘిక కట్టుబాట్లపై ఉద్యమించిన ఆర్యసమాజ్ నల్గొండలో వందేళ్లు పూర్తి చేసుకుంది. మార్చి 1, 2, 3 తేదీల్లో ఆర్య సమాజాన్ని ఏర్పాటు చేసిన మహర్షి దయానంద సరస్వతి ద్విశత జయంతి ఉత్సవాలను నల్లగొండ ఆర్య సమాజ్ శతాబ్ది ఉత్సవాలతో కలిపి నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో యోగా గురువు రామ్‌దేవ్ బాబా పాల్గొంటారు. వేద పండితులు 200 యజ్ఞ కుండల్లో మూడు రోజులు యజ్ఞం నిర్వహిస్తారు. దేశం నలుమూలల నుంచి వచ్చే వారితో పట్టణంలో నగరోత్సవ యాత్ర నిర్వహించనున్నారు.
బ్రిటీష్ పాలన నుంచి విముక్తి కోసం ప్రజలను ఏకం చేయడం, హిందూ ధర్మం పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆర్యసమాజాన్ని 10 ఏప్రిల్ 1875న ముంబాయిలో మహర్షి స్వామి దయానంద సరస్వతి స్థాపించారు. ప్రజలను మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా, వేదాలకు దగ్గరగా తీసుకెళ్ళడమే ఆర్యసమాజం ముఖ్య ఉద్దేశ్యం. ముంబాయిలో ప్రారంభమైన సుమారు 50 ఏళ్లకు ఆర్య సమాజ కార్యక్రమాలకు ఆకర్షితులైన కొంతమంది నల్గొండలో 1924లో ఆర్యసమాజాన్ని షేర్ బంగ్లాలో ప్రారంభించారు. నల్లగొండలో జరిగిన నిజాం విముక్తి పోరాటంలో ఆర్య సమాజ్ ముందు వరసలో నిలిచింది. నల్గొండ జిల్లాలో ఉచిత విద్యతోపాటు యోగా, ధ్యానం, కర్రసాము, సాంస్కృతిక కార్యక్రమాల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు ఉచితంగా వైద్య శిబిరాలను ఆర్య సమాజ్ నిర్వహిస్తోంది. ఆదర్శంగా వివాహాలు నిర్వహించే సంప్రదాయం ఉన్నా.. ఆర్య సమాజం ఇచ్చే ధ్రువీకరణకు చట్టబద్ధత లేదని కోర్టు ఇచ్చిన తీర్పుతో వివాహాల నిర్వహణకు బ్రేక్ పడింది.
రేపటి నుంచి మూడు రోజులపాటు శతాబ్ది ఉత్సవాలు..
ఆర్య సమాజాన్ని ఏర్పాటు చేసిన మహనీయుడు మహర్షి దయానంద సరస్వతి ద్విశతజయంతి ఉత్సవాలను శతాబ్ది ఉత్సవాలతో కలిపి నల్గొండలో మార్చి 1, 2, 3 తేదీల్లో నిర్వహించేందుకు ఆర్యసమాజ్ ఏర్పాట్లు పూర్తి చేసింది. నల్లగొండ ఆర్య సమాజ్ వందేళ్ల ఉత్సవాలకు యోగా గురువు రాందేవ్ బాబాతో సహా దేశం నలుమూలల నుంచి వందలాది మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. యోగా గురువు రామ్‌దేవ్ బాబా మార్చి 2న నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొని సందేశం ఇస్తారని ఆర్య సమాజం ప్రతినిధులు చెప్పారు. మహర్షి దయానంద సరస్వతి ద్విశత జయంతి సందర్భంగా వేద పండితులు 200 యజ్ఞ కుండల్లో మూడు రోజులు యజ్ఞం నిర్వహిస్తారని, దేశం నలుమూలల నుంచి వచ్చే వారితో పట్టణంలో నగరోత్సవ యాత్ర నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఉత్సవాల్లో మన ధర్మాలను కాపాడుకుంటూ ప్రకృతిని రక్షించుకునే విధంగా నిత్య యజ్ఞం నిర్వహిస్తున్నామని నల్లగొండ ఆర్య సమాజ్ అధ్యక్ష కార్యదర్శులు బోయపల్లి కృష్ణారెడ్డి, గోపాల్‌రెడ్డి తెలిపారు. నల్గొండలో ఆర్య సమాజం ఏర్పాటు చేసి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించే శతాబ్ది ఉత్సవాల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
