గంటల వ్యవధిలో కూతురు, తల్లి మృతి .. బిడ్డ మరణం తట్టుకోలేక
సంగారెడ్డి జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో ఆరేళ్ల కూతురు వైష్ణవి మరణించగా, ఆ దుఃఖాన్ని తట్టుకోలేక తల్లి లావణ్య గంటల వ్యవధిలోనే ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో ఎల్గోయి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కూతురిపై అపారమైన ప్రేమ చాటిన తల్లి బలవన్మరణం అందరినీ కలచివేసింది.

కూతురు అంటే ఆ తల్లికి ఎంతో ప్రేమో..అల్లారుముద్దుగా పెంచి, ఎంతో అప్యాయంగా చూసుకుంటున్న ఆ పాప ఆసుపత్రిలో మృతి చెందడంతో ఆ తల్లి గుండె తట్టుకోలేక పోయింది.. కూతురు లేని ఈ జీవితం తనకు వద్దు అని, ఆ తల్లి కూడా ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. ఈ విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది..వివరాల్లోకి వెళితే..
సంగారెడ్డి జిల్లా ఝరాసంఘం (మం) ఎల్గోయి గ్రామానికి చెందిన బోయిని వెంకట్, లావణ్య దంపతుల ఆరేళ్ల కూతురు వైష్ణవి. చిన్నారి వైష్ణవి కొద్ది రోజులుగా నిమోనియా బారిన పడింది. అయితే, పాపను మొదట జహీరాబాద్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స ఫలించకపోవడంతో మెరుగైన వైద్యం కోసం రెండు రోజుల క్రితం హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు నిమోనియాగా నిర్ధారించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ చిన్నారి వైష్ణవి శనివారం తెల్లవారుజామున మృతి చెందింది.
చిన్నారి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. కూతురు మరణాన్ని భరించలేక తల్లి లావణ్య తీవ్ర విషాదంలో మునిగిపోయింది. చివరకు ఆ దుఃఖాన్ని తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. ఒకేరోజు తల్లి–బిడ్డ మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు వర్ణించలేని రీతిలో విలపిస్తున్నారు. తల్లీ కూతుళ్ల మరణవార్తతో ఎల్గోయి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




