TG TET 2026 Application Last Date: టెట్‌కు దరఖాస్తు చేశారా? మరో 3 రోజులే ఛాన్స్.. రాత పరీక్ష తేదీలివే
Telangana TET 2026 online Application last date: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశలల్లో 1 నుంచి 8 తరగతుల ఉపాధ్యాయులుగా పని చేసేందుకు నిర్వహించే డీఎస్సీ పరీక్ష రాసేందుకు టెట్ అర్హత తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో సర్వీస్‌లో ఉన్న టీచర్లు అంటే 2011కి ముందు టీచర్లుగా నియామకమైన వారంతా..

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET January 2026) నిర్వహించడానికి రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. టెట్ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 15వ తేదీ నుంచి ప్రారంభమైనాయి. నవంబర్ 29వ తేదీతో దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది. టెట్ పరీక్ష మొత్తం రెండు పేపర్లకు జరుగుతుంది. పేపర్ 1 పరీక్ష దరఖాస్తు చేసుకునే వారు ఇంటర్మీడియట్‌లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్ధులు 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందినా సరిపోతుంది. అలాగే D.El.Ed, B.El.Ed, D.Ed లేదా డీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. పేపర్ 2 పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులు పొంది ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/దివ్యాంగులు 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందినా అర్హత పొందుతారు. అలాగే బీఎడ్, బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ లేదా B.A.Ed / B.Sc.Ed ఉత్తీర్ణత పొంది ఉండాలి. భాషా పండిట్ పోస్టులకు సంబంధిత లాంగ్వేజ్‌లో డిగ్రీతోపాటు పండిట్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉండాలి. చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు కూడా టెట్ పరీక్ష రాయవచ్చు.
కాగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశలల్లో 1 నుంచి 8 తరగతుల ఉపాధ్యాయులుగా పని చేసేందుకు నిర్వహించే డీఎస్సీ పరీక్ష రాసేందుకు టెట్ అర్హత తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో సర్వీస్‌లో ఉన్న టీచర్లు అంటే 2011కి ముందు టీచర్లుగా నియామకమైన వారంతా టెట్‌లో అర్హత సాధించవల్సి ఉంటుంది. కాబట్టి ఈసారి టెట్ పరీక్షకు నిరుద్యోగులతోపాటు ప్రభుత్వ టీచర్లు కూడా పోటీ పడనుండటంతో ఆసక్తి నెలకొంది. ఇక తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. జనవరి 2026 నెలాఖరు నుంచి అంటే 31 తేదీ నుంచి ఆన్‌లైన్ విధానంలో జరుగుతాయి. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లు డిసెంబర్ 27, 2025 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ టెట్ పరీక్ష ఫలితాలు ఫిబ్రవరి 10 నుంచి 16వ తేదీలోపు విడుదలవుతాయి. ఒక్కసారి టెట్‌లో అర్హత సాధిస్తే లైఫ్‌టైమ్ వాలిడిటీ ఉంటుందన్న సంగతి తెలిసిందే.
టెట్ పరీక్ష విధానం ఇలా..
పేపర్ 1 పరీక్ష ప్రాథమిక పాఠశాలలలో ఒకటి నుంచి 5 తరగతులకు ఉపాధ్యాయులుగా పనిచేయాలనుకునే వారు రాయవల్సి ఉంటుంది. పేపర్ 2 పరీక్ష ఉన్నత ప్రాథమిక పాఠశాలలలో ఆరో తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉపాధ్యాయులుగా పనిచేయాలనుకునే వారికి నిర్వహిస్తారు. ప్రతి పేపర్ 150 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు 150 మార్కులకు ఉంటుంది. నెగటివ్ మార్కింగ్ లేదు. పేపర్ 1 పరీక్షలో చైల్డ్ డెవెలపింగ్, లాంగ్వెజెస్, మ్యాథమెటిక్స్ అండ్ ఈవీఎస్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి. పేపర్ 2 పరీక్షలో చైల్డ్ డెవెలపింగ్, లాంగ్వెజెస్, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ లేదా సోషల్ స్టడీస్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. కేటగిరీల వారీగా అర్హత మార్కులు.. ఓసీ/ఈడబ్ల్యూఎస్‌లకు 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు 40 శాతంగా నిర్ణయించారు.
తెలంగాణ టెట్ 2026 నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




