ఆ ప్రాంతాల్లో వానర వనాలుగా మారిన ఊర్లు.. జనాభా కంటే కోతులే ఎక్కువయ్యాయి.. జనాల్ని టార్చెర్ చేస్తున్నాయి
కోతులు... పల్లెలు, పట్టణాలను వణికిస్తున్నాయి. అవి చేసే కిష్కింధ కాండ భరించలేకపోతున్నారు జనం. ఒకప్పుడు అడవులు, శివార్లకు పరిమితమైన కోతులు ప్రస్తుతం
కోతులు… పల్లెలు, పట్టణాలను వణికిస్తున్నాయి. అవి చేసే కిష్కింధ కాండ భరించలేకపోతున్నారు జనం. ఒకప్పుడు అడవులు, శివార్లకు పరిమితమైన కోతులు ప్రస్తుతం గ్రామాలోకి, పట్టణాల్లోకి ప్రవేశించి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇళ్లల్లో చొరబడి ఏది దొరికితే అది పట్టుకొని పరుగులు తీస్తున్నాయి. ఇళ్లలో సామాగ్రిని చిందరవందర చేస్తున్నాయి. కోతుల బెడదతో అన్నదాతలు అల్లాడిపోతున్నారు.. విత్తనం నాటిన నాటినుంచి పంట చేతికి వచ్చే వరకు కోతుల బారి నుంచి పంటను కాపాడుకోవడానికి రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. కొందరు రైతులు పొలాల చుట్టూ చీరలు ఏర్పాటు చేసుకుంటే మరికొందరు రైతులు పంటకు కాపాడుకునేందుకు వలలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కోతుల బారి నుంచి పంటను కాపాడుకోవడానికి కొండముచ్చులు తెచ్చి వాటిని తరిమేందుకు ప్రయత్నిస్తున్నారు కొందరు. మొక్కజొన్న, ఇతర పండ్ల తోటలు వేయడం, వేసినా వాటిని కోతుల బారి నుంచి కాపాడడం రైతులకు కత్తిమీద సాములా మారింది..
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పాలేరు, వైరా, ఇల్లందు, కొత్తగూడెం, భద్రాచలం, మధిర, అశ్వారావుపేట నియోజకవర్గాలలో కోతుల బెడద అధికంగా వుంది. గ్రామాల్లో కోతుల బెడదతో ప్రజలు, రైతులు అల్లాడిపోతున్నారు.. అడవిలో ఉండాల్సిన కోతులు గ్రామాల్లోకి వచ్చి ఇళ్లల్లోకి చొరబడి ఇళ్లలోని సామగ్రిని చిందరవందర చేసి దొరికినవాటిని ఎత్తుకొని పారిపోతున్నాయి. ఇళ్లల్లో మహిళలు, చిన్నారులపై దాడులు చేస్తున్నాయి. కోతుల దాడుల్లో చాలామంది గాయపడ్డారు కూడా. కోతుల బెడదతో ఇళ్లలో సామాగ్రిని కాపాడుకోవడానికి మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఆహారం కోసం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. పండ్లు ఇతర ఆహార వస్తువులు కొనుక్కొని వెహికల్ మీద వెళ్లే వ్యక్తులపై దాడి చేసి ప్రమాదానికి గురి చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఇల్లందులో కోతులు దాడి చేయడంతో ఓ వ్యక్తి సైకిల్ పైనుంచి పడి కాలు, చేయి విరిగిన సంఘటన కూడా జరిగింది. ప్రభుత్వ హాస్టల్స్, రెసిడెన్సియల్ స్కూల్స్, పాఠశాలల్లో పిల్లలు కోతుల వలన ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. మధ్యాహ్నం అన్నం తినే సమయంలో ఒకేసారి కోతుల గుంపు వస్తుండటంతో ఇబ్బందిగా మారిందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. కోతులకు భయపడి కొందరు విద్యార్థులు పాఠశాలలకు కూడా రావడం లేదని అంటున్నారు.
పాలేరు, వైరా, ఇల్లెందు ప్రాంతాల్లో పంట పొలాల్లో పంటలు వేసుకున్నా కూడా అవి చేతికి అందే పరిస్థితి లేకుండా పోయింది. గుంపులు గుంపులుగా కోతులు సంచరిస్తూ భయానక వాతావరణం సృష్టిస్తున్నాయి. ఇంటి తలుపులు తెరిచి ఉంచితే చాలు అక్కడ కోతులు ప్రత్యక్షమవుతున్నాయి. ఇంటిల్లిపాదిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. వీధుల్లో తిరగటమే మరీ కష్టంగా మారింది. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా పట్టించుకునే వారే కరువయ్యారని స్థానికులు చెబుతున్నారు. రైతులు విత్తనాలు వేసిన నాటి నుంచి పంట చేతికొచ్చే వరకు కోతుల నుంచి పంటను కాపాడుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. కోతుల నుంచి పంటను కాపాడుకోవడానికి రైతులు కొంత వ్యయం వెచ్చించాల్సి వస్తుంది. కోతుల కోసం ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయకపోవడంతో అడవుల్లో ఉండాల్సిన కోతులు సైతం గ్రామాల్లోకి ప్రవేశించి బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు కోతుల కోసం ప్రత్యేకంగా ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేసి వాటి బెడద నుంచి ప్రజలను కాపాడాలని వేడుకుంటున్నారు.
Also Read:
AP Corona: ఏపీలో మళ్లీ కరోనా కల్లోలం.. ముఖ్యంగా ఆ జిల్లాలో.. మళ్లీ రెడ్ జోన్లు ప్రకటించిన అధికారులు
JR NTR Political Entry: నందమూరి చిన్నోడి పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు..? ఆయన సమాధానం ఇదే..