MLA Lasya Nanditha Death: ఎమ్మెల్యే లాస్య నందిత మృతి కేసులో కొనసాగుతున్న దర్యాప్తు.. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు డ్రైవర్ రక్త నమూనాలు
బీఆర్‌ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సైంటిఫిక్ ఎవిడెన్స్ సేకరణ కోసం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా కారు నడిపిన పీఏ ఆకాశ్‌కు ఇప్పటికే బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో ఆయన మద్యం సేవించలేదని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. తాజాగా ఆకాశ్ రక్త నమూనాలను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌తోపాటు..
సంగారెడ్డి, ఫిబ్రవరి 25: బీఆర్‌ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సైంటిఫిక్ ఎవిడెన్స్ సేకరణ కోసం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా కారు నడిపిన పీఏ ఆకాశ్‌కు ఇప్పటికే బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో ఆయన మద్యం సేవించలేదని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. తాజాగా ఆకాశ్ రక్త నమూనాలను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌తోపాటు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌కు పంపినట్లు సమాచారం. అలాగే ఆకాశ్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొని కాల్ డేటాను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో కళ్లు బైర్లు కమ్ముకున్నాయని, ఏం జరిగిందో తెలిసేలోపే ప్రమాదం జరిగిందని ఆకాశ్ చెప్పినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఆకాశ్ స్టేట్‌మెంట్‌ను మేజిస్ట్రేట్ సమక్షంలో రికార్డు చేసినట్లు తెలిపారు. కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు నిద్ర మత్తు ఆవహించిందా? లేదా ఇంకేదైనా కారణం వలంల ప్రమాదం జరిగిందా అనే దానిపై క్లారిటీ రావాలంటే ల్యాబ్ రిపోర్టులు రావాల్సిందే. ఈ మేరకు ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాద కేసుకు సంబంధించిన వివరాల సేకరణలో అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు పటాన్‌చెరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి సికింద్రాబాద్‌లోని ఆమె నివాసానికి వెళ్లి తల్లి, అక్కతోపాటు ఆమె కూతురు నుంచి స్టేట్‌మెంట్లు తీసుకున్నారు. స్టేట్‌మెంట్ ‘నేను, నా కూతురు లాస్యనందిత, మనవరాలుతో కలిసి గురువారం రాత్రి కారులో సదాశిపేట మండలం ఆరూర్ సమీపంలోని మిస్కన్‌షాబాబా దర్గాకు వెళ్లామని లాస్య తల్లి చెప్పారు. దర్గాలో ప్రార్థనల అనంతరం ఆరూర్ నుంచి బయలుదేరి శుక్రవారం వేకువజామున 3.30 నుంచి 4 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్‌లోని తమ ఇంటికి చేరుకున్నట్లు తెలిపారు. ఇంటికి చేరుకున్నాక బ్రేక్ ఫాస్ట్ కోసం కారులో డ్రైవర్ ఆకాశ్‌తో కలిసి సంగారెడ్డి వైపు వెళ్లినట్లు తెలిపారు. ఇంతలొరు ఓఆర్‌ఆర్‌పై ప్రమాదం జరిగి లాస్య దుర్మరణం చెందిందని ఆమె తెలిపారు. మియాపూర్‌లోని దవాఖానలో చికిత్స పొందుతున్న డ్రైవర్ కమ్ పీఏ ఆకాశ్ కూడా లాస్య నందిత కుటుంబసభ్యులు చెప్పినట్టుగానే స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు సమాచారం.
ప్రమాదానికి గురైనప్పుడు వాహనం గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. కారు విడిభాగాలు సుమారు 100 మీటర్ల దూరం వరకు పడిపోవడాన్ని బట్టి చూస్తే ప్రమాద తీవ్రత ఏ మేరకు ఉండిందో చెప్పవచ్చు. అసలు అంతకంటే ఎక్కువ వేగంతోనే వాహనం ప్రయాణించి ఉంటుందనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగిన చోట ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయా అని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పటాన్‌చెరు పోలీసులు పరిశీలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.