MLA Jagga Reddy: బీజేపీ ప్రభుత్వంలో సామాన్యుల జీవనం అస్థవ్యస్థం అవుతోంది.. కేంద్రంపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్..
MLA Jagga Reddy: అడ్డూ అదుపు లేకుండా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో..
MLA Jagga Reddy: అడ్డూ అదుపు లేకుండా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తోందని నిప్పులు చెరిగారు. కేంద్రం ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ సోమవారం నాడు నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఎద్దుల బండి లాగి నిరసన తెలిపారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఈ నిరసన కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్ శంకర్ నాయక్, మాజీ ఎమ్మెల్యే బాలు నాయక్, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన జగ్గారెడ్డి.. కేంద్రం తీరుపై విమర్శలు గుప్పించారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత.. సామాన్య ప్రజలు జీవనం సాగించలేని పరిస్థితి నెలకొందన్నారు. పెట్రోల్, డీజిల్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి పన్నులు పెంచుతూ పేద ప్రజలపై మోయలేని అదనపు భారాలు వేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ హయాంలో లీటర్ 60 రూపాయలు ఉన్న పెట్రోల్ ధర ఇప్పుడు ఏకంగా 104 రూపాయలకు చేరిందని పేర్కొన్నారు. ఎన్నడూ లేని విధంగా, అత్యంత హేయంగా మోడీ సర్కారు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతోందని దుమ్మెత్తిపోశారు. ఇంత దారుణంగా గతంలో ఏనాడూ పెరగలేదన్నారు.
పెట్రోల్ డీజిల్ ధరల పెంపు ప్రభావం.. ఇతరర నిత్యావసర వస్తువుల ధరలపై పడుతోందని, ఫలితంగా వాటి ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఎన్డీయే పాలనలో దేశ ప్రజలు ఏనాడూ లేనంత ఆర్థిక భారాన్ని మోస్తున్నారని జగ్గారెడ్డి అన్నారు. మోడీ సర్కారు కు కనీసం మానవత్వం లేదని విమర్శించారు. రెండు రోజులకోసారి రేట్లు పెంచి ప్రజల నడ్డీ విరుస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం తన విధానాలను మార్చుకోకపోతే.. భవిష్యత్ లో మరిన్ని ఉద్యమాలు చేస్తామన్నారు. కాంగ్రెస్ హాయాంలో ముడి చమురు ధరలు భారీగా పెరిగినా.. ప్రజలపై భారం మోపకుండా చమురు ధరలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూశారని చెప్పుకొచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో చమురు ధరలు నెలకు ఒక్కసారి పైసల్లో పెరిగితే.. ఇప్పుడు రూపాయల్లో పెంచుతున్నారని అన్నారు. మోడీ సర్కారు ఇప్పటికైనా కదలకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. కాంగ్రెస్ వస్తేనే ప్రజలపై భారాలు తగ్గుతాయని జగ్గారెడ్డి ఉద్ఘాటించారు.
Also read:
Viral Video: అందమైన ఆ ‘రోటీ అమ్మాయి’.. ఎవరో తెలిసిపోయింది.. పూర్తి వివరాలు మీకోసం…