Telangana: తెలంగాణలోని ప్రైవేటు పాఠశాలల బోధన, బోధనేతర సిబ్బందికి గుడ్ న్యూస్.. ఖాతాలలోకి నేరుగా డబ్బు జమ
తెలంగాణలో ప్రైవేటు పాఠశాలల బోధన, బోధనేతర సిబ్బందికి ప్రభుత్వం మే నెలకు సంబంధించిన ఆపత్కాల ఆర్థికసాయం విడుదల చేసింది. సిబ్బంది వ్యక్తిగత అకౌంట్లకు నగదు జమ చేసే కార్యక్రమాన్ని...
తెలంగాణలో ప్రైవేటు పాఠశాలల బోధన, బోధనేతర సిబ్బందికి ప్రభుత్వం మే నెలకు సంబంధించిన ఆపత్కాల ఆర్థికసాయం విడుదల చేసింది. సిబ్బంది వ్యక్తిగత అకౌంట్లకు నగదు జమ చేసే కార్యక్రమాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్రేవేట్ పాఠశాలల టీచర్లకు, ఇతర సిబ్బందికి నెలకు రూ. 2 వేలు నగదుతో పాటు 25 కిలోల చొప్పున రేషన్ బియ్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే నిర్ణయించారు. కరోనా కారణంగా ప్రైవేటు పాఠశాలలు మూతపడటంతో టీచర్లు, నాన్‌టీచింగ్ సిబ్బందికి వేతనాలు అందడం లేదు. దీంతో వారికి ప్రభుత్వ పరంగా సాయం చేయాలని సీఎం కేసీఆర్ భావించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మే నెలకు సంబంధించిన రూ. 40 కోట్ల 94 లక్షల 86 వేల నిధులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. 2 లక్షల 04 వేల 743 మంది బోధన, బోధనేతర సిబ్బంది అకౌంట్లకు నేరుగా నగదును బదలాయించారు. కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న టీచర్లు, నాన్‌టీచింగ్ సిబ్బంది ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో నిధులు కేటాయించారని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతగా బాగాలేకపోయినా.. దేశంలోనే తొలిసారిగా ప్రవేట్ విద్యాసంస్థల్లో పనిచేసే టీచర్లు, సిబ్బందికి విపత్కర సమయంలో ప్రభుత్వం అండగా నిలబడిందన్నారు సబితా. ఆర్థిక సాయంతో పాటు 25 కేజీల బియ్యం కూడా ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పారు. కాగా ఏప్రిల్ మాసంలో కూడా ప్రభుత్వం అర్హత ఉన్న ప్రేవేట్ టీచర్లకు, సిబ్బందికి ఆర్థిక సాయంతో పాటు రేషన్ బియ్యం అందజేసింది.
Also Read: రూ.10 ఫీజుతో కరోనా వైద్యం.. పీర్జాదిగూడలో వైద్యుడు విక్టర్ ఇమ్మాన్యుయెల్ ఔదార్యం