తల్లి త్యాగానికి కరిగిన మంత్రి! టీవి9 వెబ్ కథనానికి స్పందన.. వెంటనే న్యాయం చేయాలని ఆదేశం
Jupally Krishna Rao: ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలో జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో బాలికల కోసం మరుగుదొడ్ల నిర్మాణానికి ఒక మహిళ తన పుస్తెల తాడును తాకట్టు పెట్టి 8.40 లక్షలతో పనులు పూర్తి చేసింది. అయితే రెండేళ్లుగా బిల్లులు రాకపోవడంతో ఆమె అధికారులను వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. టీవీ9 కథనానికి స్పందించిన ప్రభుత్వం ఇప్పుడు తక్షణ న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకుంది.

టీవీ9 తెలుగు వెబ్ కథనానికి ప్రభుత్వం నుంచి స్పందన లభించింది. ఓ తల్లి త్యాగానికి ఎట్టకేలకు న్యాయం లభించింది. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం కేంద్రంలోని జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో బాలికల కోసం ఎనిమిదిగి మరుగుదొడ్లు నిర్మించేందుకు పుస్తెల తాడును సైతం తాకట్టు పెట్టి 8.40 లక్షలతో మరుగు దొడ్లను నిర్మించింది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్ పర్సన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న నవనీత అనే మహిళ ఈ పనులను రెండేళ్ల క్రితం పూర్తి చేసింది. కానీ, రెండేళ్లయిన బిల్లులు రాలేదు. అధికారులకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్న ఫలితం లేకుండా పోయింది.
చివరకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ఎదుట కన్నీళ్లు పెట్టుకుని న్యాయం చేయాలని వేడుకుంది. రెండేళ్లు దాటినా బిల్లులు రావడం లేదని ఆ మహిళ బోరుమంది. ఈ కన్నీటి కథనాన్ని టీవీ9 తెలుగు ప్రసారం చేసింది. ఎవరూ చేయని త్యాగం అయినా దక్కని న్యాయం అంటూ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనానికి స్పందించిన ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు వెంటనే సదరు మహిళకు న్యాయం చేయాలని.. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను వెంటనే అందించాలని ఆదేశాలు జారీ చేశారు.
వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ జిల్లా బజార్‌హథ్నూర్ మండల కేంద్రంలోని జెడ్పీఎస్ఎస్ అమ్మ ఆదర్శ పాఠశాలలో నిర్మించిన ఎనిమిది మరుగుదొడ్ల నిర్మాణానికి అయిన బకాయిలను వెంటనే చెల్లించాలని.. నవనీతకు న్యాయం చేయాలని టోకెన్ నంబర్లను ప్రస్తావిస్తూ ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియాకు లేఖ రాశారు ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు. రెండేళ్ల క్రితం బాలికల బాధను చూడలేక ఎనిమిది మరుగు దొడ్లను మూడు నెలల్లో కట్టించారని… ఇందుకోసం పుస్తెల తాడును సైతం తాకట్టుపెట్టి అప్పులపాలైనట్టు నా దృష్టికి వచ్చిందని.. ఆ తల్లికి బిల్లుల రూపేణా రావాల్సిన రూ.8.40 లక్షల బకాయిలను త్వరితగతిన చెల్లించేలా చర్యలు చేపట్టాలని అదికారులను ఆదేశించారు మంత్రి.
గత సోమవారం ప్రజావాణి విభాగానికి వచ్చిన తను.. కలెక్టర్ రాజర్షిషా ఎదుట కన్నీరుమున్నీరుగా విలపించి తనకు న్యాయం చేయాలని విన్నవించిన తీరు తనను కదిలించిందని మంత్రి జూపల్లి తెలిపారు. అమ్మ ఏడుస్తుంటే వెంట వచ్చిన కొడుకు సైతం గుక్కపెట్టి ఏడవడం కదిలించింది అన్నారు జూపల్లి. ఎస్ఎఫ్ కింద పెండింగ్లో ఉన్న రెండు బిల్లుల మొత్తం రూ.3,10,058 వెంటనే చెల్లించాలని ఆర్ధిక శాఖకు లేఖ రాశానన్నారు జూపల్లి. మిగిలిన డబ్బులు కేంద్రప్రభుత్వ పరిధి లోని ఉపాధి హామీ నిధుల కింద రావాల్సి ఉందని.. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్రం దృష్టికి తీసుకెళ్లి నిధులు విడుదలయ్యేలా ఆ తల్లికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు.
టీవీ9 తెలుగు వెబ్‌లో ప్రచురించిన కథనం.. ఎవరూ చేయని త్యాగం.. కలెక్టర్ ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న ‘ఆదర్శ’ తల్లి.. కారణం ఏమిటో తెలుసా?
