Chilkur Balaji Temple: వెంకన్న జోలికి వస్తే.. మట్టి కొట్టుకుపోతావ్ ఎరిక్..
అమెరికా వెళ్లాలి, H-1B వీసా రావాలి, సిలికాన్ వ్యాలీలో ఉద్యోగం సంపాదించాలి, ఇది లక్షలాది భారతీయ యువత కల… ఆ కలకు సాక్ష్యంగా నిలిచిన హైదరాబాద్ చిలుకూరు బాలాజీ ఆలయం… ఇప్పుడు అమెరికా రాజకీయాల్లోనే హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకూ మన చిరుకూరు బాలాజీపై అమెరికన్ల కన్ను ఎందుకు పడింది.? మన టెంపుల్‌పై ఎందుకంత టెన్షన్ పడుతున్నారు ?

“వీసా కార్టెల్…” ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్న వర్డ్. “అమెరికన్ ఉద్యోగాలను వీసా కార్టెల్ ద్వారా భారతీయులు లాగేసుకుంటున్నారంటూ ఒక అమెరికా సెనేటర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. హైదరాబాద్ చిలుకూరు బాలాజీ ఆలయాన్ని నేరుగా టార్గెట్ చేస్తూ… H-1B వీసా వ్యవస్థపై ఘాటు విమర్శలు చేశారు అమెరికా రిపబ్లికన్ సెనేటర్ ఎరిక్ ష్మిట్. అమెరికా ఉద్యోగాలను విదేశీయులు చౌకగా కొట్టేస్తున్నారంటూ భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్‌పై అక్కసు వెళ్లగక్కుతూ దానికి కారణం చిలుకూరి బాలాజీ టెంపులేనన్న అర్థం వచ్చేలా తన ఎక్స్ ఖాతాలో ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టాడు ఎరిక్ ష్మిట్ . ఇప్పుడాయన పోస్టు..నెట్టింట్లో తీవ్ర దుమారం రేపుతోంది.
హైదరాబాద్‌లోని చిలుకూరు బాలాజీ టెంపుల్ అంటే దేశవ్యాప్తంగా వీసా టెంపుల్‌గా పేరుంది. అమెరికా వీసా కోసం వెళ్లే వేలాది మంది విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు చిలుకూరు బాలాజీని దర్శించుకుంటే చాలు, వీసా వస్తుందని ఒక నమ్మకం. 1990లలో ఐటీ బూమ్ మొదలైన తర్వాత ఈ ఆలయానికి వీసా సెంటర్‌గా పేరొచ్చింది. అలాంటి టెంపుల్‌పై అమెరికా సెనేటర్ ప్రస్తావించడం సంచలనంగా మారింది. “వీసా కార్టెల్‌కు హైదరాబాద్‌లో సొంత వీసా టెంపుల్ ఉంది…” అంటూ విమర్శించారు. “వేలాది మంది భారతీయులు ఆలయాల చుట్టూ తిరుగుతూ.. పాస్‌పోర్ట్‌లకు దేవుడి ఆశీశ్సులు తీసుకుంటారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు భారతీయుల్లో తీవ్ర ఆగ్రహం రేపుతున్నాయి.
“వీసా కార్టెల్” అంటే.. ఒక వ్యవస్థలా కలిసి పనిచేస్తూ వీసాలు, ఉద్యోగాలు, రిక్రూట్‌మెంట్ ప్రక్రియను తమ ఆధీనంలో ఉంచుకునే నెట్‌వర్క్ అని విమర్శించేందుకు అమెరికన్లు వాడే పదం వీసా కార్టెల్. ఆ నెట్‌వర్క్ కారణంగా అమెరికన్లకు రావాల్సిన ఉద్యోగాలు భారతీయులు కొట్టేస్తున్నారన్నది ఎరిక్ ష్మిట్ ఆరోపణ.
ప్రత్యేకంగా ఎన్నికల సమయంలో “అమెరికన్ ఉద్యోగాలు అమెరికన్లకే…” అనే నినాదం బలంగా వినిపిస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో భారతీయ ఐటీ ఉద్యోగులే అక్కడి రాజకీయ నాయకులకు టార్గెట్ అవుతారు. ఎందుకంటే H-1B వీసాల్లో అత్యధిక లబ్ధిదారులు భారతీయులే. ప్రతి సంవత్సరం అమెరికా జారీ చేసే H-1B వీసాల్లో దాదాపు 70 నుంచి 80 శాతం వరకు భారతీయులే దక్కించుకుంటారు. ఇది మన విద్యార్ధుల ప్రతిభకు గుర్తింపు. అయితే చిలుకూరు బాలాజీ ఆలయాన్ని టార్గెట్ చేయడం మాత్రం భారతీయులను తీవ్రంగా బాధిస్తోంది.
అమెరికా H-1B వీసా వ్యవస్థపై విమర్శలు చేయొచ్చు… ఉద్యోగాలపై రాజకీయ చర్చ జరగొచ్చు… అమెరికన్ యువతకు అవకాశాలు తగ్గుతున్నాయన్న ఆందోళన వ్యక్తం చేయొచ్చు… కానీ ఒక ఆలయాన్ని…ఒక భక్తి విశ్వాసాన్ని… ఒక ఆధ్యాత్మిక నమ్మకాన్ని ఈ వివాదంలోకి లాగడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్న ఇప్పుడు భారతీయుల్లో బలంగా వినిపిస్తోంది. ఎరిక్ షిట్మ్ చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయ విమర్శలుగా మాత్రమే కనిపించడం లేదు. భారతీయుల భక్తి, విశ్వాసాలను అవమానించేలా ఆయన మాటలున్నాయని చాలామంది భావిస్తున్నారు. ఎందుకంటే H-1B వీసా వ్యవస్థ పూర్తిగా అమెరికా నియంత్రణలో ఉంటుంది.ఎవరికి వీసా ఇవ్వాలి…ఎవరిని తిరస్కరించాలి… ఎన్ని వీసాలు జారీ చేయాలి…ఏ కంపెనీకి అనుమతి ఇవ్వాలి…అన్నీ అమెరికా చట్టాల ప్రకారమే జరుగుతాయి. ఇందులో భారతీయుల పాత్ర ఏమీ ఉండదు. అమెరికా ఎంబసీ ఇంటర్వ్యూ తీసుకుంటుంది. అమెరికా ఇమ్మిగ్రేషన్ శాఖ పరిశీలిస్తుంది. అమెరికా కంపెనీలు ఉద్యోగాలు ఇస్తాయి. అమెరికా కోర్టులు నిబంధనలు అమలు చేస్తాయి. అలాంటి వ్యవస్థను పక్కనబెట్టి… ఒక ఆలయాన్ని టార్గెట్ చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏంటన్న ప్రశ్న వినిపిస్తోంది.
అంతేకాదు చిలుకూరు బాలాజీ ఆలయం వీసాలు మంజూరు చేసే కేంద్రం కాదు. బాలాజీ అంటే ఒక భక్తిభావం, ఒక నమ్మకం, ఒక భావోద్వేగం. ఎవరైనా పరీక్షకు వెళ్లే ముందు దేవుడిని ప్రార్థిస్తారు.ఉద్యోగ ఇంటర్వ్యూకు వెళ్లే ముందు ఆశీర్వాదం తీసుకుంటారు. అలాగే అమెరికా వీసా ఇంటర్వ్యూకు వెళ్లే ముందు చాలామంది ఆలయానికి వెళ్తారు. అలాంటి ఆద్యాత్మిక కేంద్రాన్ని వీసా కార్టెల్‌గా విమర్శించడం ఎంతవరకు సబబమని భారతీయులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు అమెరికాలోని టెక్ దిగ్గజ కంపెనీల్లో పనిచేస్తున్న భారతీయులంతా అక్రమమార్గాల్లో వెళ్లలేదు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన టెక్నికల్ పరీక్షలు రాసి… అర్హతలు సంపాదించి…అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించారు.
సిలికాన్ వ్యాలీలో ఇండియన్ల డామినేషన్ ఒక్కరోజుల్లో వచ్చింది కాదు. దాని వెనుక దశాబ్దాల కష్టం ఉంది.కృషి ఉంది. నైపుణ్యం ఉంది. ప్రపంచ స్థాయి పోటీ ఉంది. అమెరికా కంపెనీలు భారతీయులను తీసుకుంటున్నాయంటే.. వాళ్లలో నైపుణ్యం ఉందని అర్థం.ఈమాత్రం తెలియకుండా చిలుకూరు బాలాజీ టెంపుల్‌పై నోరుపారేసుకోవడం ఏంటని ఎరిక్ ష్మిట్‌ను నెటిజన్లు విమర్శలతో ఉతికేస్తున్నారు.గూగుల్ నుంచి మైక్రోసాఫ్ట్ వరకూ.. ప్రపంచ దిగ్గజ కంపెనీలకు భారతీయ మూలాలున్న నాయకత్వం ఉంది. అది భారతీయ ప్రతిభకు గుర్తింపు.ఇప్పుడు అదే భారతీయులను “వీసా కార్టెల్”గా చూపించడం బాధాకరమని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
