Andhra: ఇదేంటో మీకు తెలుసా..? అసలు ఎప్పుడైనా చూశారా..?
పార్వతీపురం మన్యం జిల్లా గొర్లివలస అటవీ ప్రాంతంలో అరుదైన దుంప జాతికి చెందిన “ఎలిఫెంట్ ఫుట్ యామ్” మొక్క కనిపించడం ఆసక్తికరంగా మారింది. ఘాటైన వాసన వెదజల్లే ఈ ప్రత్యేక పుష్పాన్ని చూసేందుకు స్థానికులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ప్రకృతి వైవిధ్యానికి ప్రతీకగా నిలిచే ఈ మొక్కను సంరక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం టీకే జమ్ము సమీపంలోని గొర్లివలస అటవీ ప్రాంతంలో అరుదైన వృక్ష జాతికి చెందిన మొక్క కనిపించడం స్థానికంగా ఆసక్తికరంగా మారింది. సాధారణ పుష్పాల మాదిరిగా కాకుండా గుబురు ఆకృతిలో విస్తరించి కనిపిస్తున్న ఈ అరుదైన మొక్కను చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
ఈ మొక్క శాస్త్రీయ నామం అమెర్పో ఫాలస్ పయోనిఫోలియస్. దీనిని సాధారణంగా “అడవి కంద” లేదా “ఎలిఫెంట్ ఫుట్ యామ్” అని పిలుస్తారు. ప్రధానంగా అడవులు, కొండ ప్రాంతాలు, తేమ అధికంగా ఉండే నేలల్లో ఈ జాతి మొక్కలు పెరుగుతాయి.
ఈ మొక్కకు నేల అడుగున భారీ దుంప ఉండటం ప్రత్యేక లక్షణం. అలాగే పుష్పం నుంచి వెలువడే ఘాటైన వాసన ఈగలు, ఇతర పురుగులను ఆకర్షించి పరాగసంపర్కానికి దోహదపడుతుంది. చూడటానికి విభిన్నంగా ఉండటంతో పాటు, ప్రకృతి వైవిధ్యానికి ప్రతీకగా నిలిచే ఈ మొక్క పర్యావరణ సమతుల్యతలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ అరుదైన దుంప జాతి మొక్కను సేకరించి స్థానిక రాస్తా కుటుంబాయి కృషి విజ్ఞాన కేంద్రంలో సంరక్షించి అభివృద్ధి చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రత్యేక జాగ్రత్తలతో దీనిని పెంచి భావితరాలకు అందుబాటులో ఉంచుతామని కృషి విజ్ఞాన కేంద్రం అధికారి శ్రీనివాసరాజు తెలిపారు.
అటవీ ప్రాంతాల్లో కనిపించే ఇటువంటి అరుదైన వృక్ష సంపదను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన సూచించారు. ఎవరికైనా అరుదైన మొక్కలు, పుష్పాలు లేదా దుంప జాతులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
