AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddi Movie: 'ఎంత తొక్కాలని చూస్తే అంత ఎత్తుకు ఎదుగుతాడు'

Peddi Movie: ‘ఎంత తొక్కాలని చూస్తే అంత ఎత్తుకు ఎదుగుతాడు’

Basha Shek
|

Updated on: Jun 06, 2026 | 10:16 PM

Share

ఒక్క చిరు తనయుడు అన్న మాట తప్ప చరణ్‌కు విజయం అంత ఈజీగా ఏం దక్కలేదు. తన కారణంగా తన తండ్రికి మచ్చ రానీయకుండా తెగ కష్టపడ్డాడు. డ్యాన్సుల్లో బెస్ట్ అనిపించుకున్నాడు. యాక్టింగ్‌లో సినిమా.. సినిమాకి రాటుదేలుతున్నాడు. వ్యక్తిత్వంలో ఏకంగా తండ్రినే మించిపోయాడనే మాట అనిపించుకుంటున్నాడు.

ఎంత తొక్కాలని చూస్తే అంత ఎత్తుకు ఎదుగుతాడు. ఎంత అణచాలని చూస్తే అంత విస్పోటనం అవుతాడు. గురిపెట్టిన లక్ష్యం వైపు ఎంతో ఓపికగా అడుగులు వేస్తాడు. ఎత్తు పల్లాలు ఎదురైనా..తన కష్టంతో ముందుకెళతాడు. చుట్టూ ఉన్న వాళ్లు నోటికొచ్చినట్టు వాగినా పట్టించుకోడు. విమర్శలతో దాడి చేస్తే తన గెలుపుతో తిప్పికొడతాడు. గేలి మాటలతో ఎగతాళి చేస్తే తన విజయంతో సమాధానమిస్తాడు. చివరికి అనుకున్నది సాధించి.. అందరి చేత చప్పట్లు కొట్టించుకుంటాడు. పెద్ది సినిమాలో పెద్దిగాడి తీరిది. సర్‌ప్రైజింగ్‌లీ ఇదే తీరు.. రియల్‌ లైఫ్‌లో మెగా పవర్‌ స్టార్ చరణ్‌ది కూడా..!

ఉప్పెన సినిమా తప్పించి మరే సినిమా చేయని బుచ్చిబాబుకు అవకాశం ఇచ్చాడు రామ్ చరణ్. అతన్ని .. అతని సబ్జెక్ట్ ను నమ్మి పెద్ది సినిమాను మొదలెట్టాడు. పెద్ది ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా…! ఇందులో హీరో క్రాసోవర్ అథ్లెట్‌! అటు క్రికెటర్‌గా.. ఇటు పహిల్వాన్‌గా కనిపించాలి. అంటే హీరో తన బాడీలో వేరియేషన్ చూపించాలి. క్రికెటర్‌ గా లీన్ లుక్‌లో కనిపించాలి… ఆ తర్వాత పహిల్వాన్‌ సీన్స్ కోసం బల్కీ బాడీలోకి ట్రాన్స్‌ఫాం అవ్వాలి. దీన్ని ఛాలెంజింగ్‌గా తీసుకున్న చరణ్.. స్వామి మాలలో ఉన్నా కూడా… శాఖాహార భోజనంతో బుచ్చి విజన్‌ను మ్యాచ్ చేశాడు. తన పెద్ది ఎలా ఉండాలని బుచ్చి థింక్ చేశాడో అచ్చం అలాగే తన బాడీని మలుచుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియోలతో తెలుగు వాళ్లనే కాదు.. పాన్ ఇండియా రేంజ్‌లో అందర్నీ అవాక్కయ్యేలా చేశాడు పెద్ది. ఇలా పెద్ది కోసం చరణ్‌ దాదాపు రెండున్నరేళ్లు కష్టపడ్డాడు.

టీజర్లు.. ట్రైలర్లు.. పెద్ది గురించి వార్తలు.. ! మొత్తంగా పెద్దిపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ అంచనాల మధ్యలో, రెండు సార్లు రిలీజ్ పోస్ట్ పోన్ అయిన తర్వాత.. పెద్ది మూవీ జూన్ 4న రిలీజ్ అయింది. అంతకు ముందు రోజే ప్రీమియర్స్ దెబ్బకి పెద్ది గాడి ‘దెబ్బ పవర్’ ఏంటో అందరికీ తెలిసిపోయింది. దీంతో రిలీజ్ డే థియేటర్ల దగ్గర విపరీతమైన సందడి. అప్పటి దాకా థియేటర్లు ఖాళీగా ఉన్నాయని గగ్గోలు పెట్టిన థియేటర్ ఓనర్లు.. పెద్దిగాడి దెబ్బతో… థియేటర్ల దగ్గర జనాలను మేనేజ్ చేసుకోడానికి ప్రత్యేక సిబ్బందిని పెట్టుకోవాల్సిన పరిస్థితి.

ఇక పెద్ది సినిమా ఎలా ఉందనే దాని గురించి క్లుప్తంగా చెప్పాలంటే.. 1980ల నాటి ఆంధ్రప్రదేశ్ నేపథ్యంతో తెరకెక్కిన పెద్ది సినిమా ఆత్మగౌరవ పోరాటం, స్పోర్ట్స్ ద్వారా ఒక యువకుడు తన ప్రజలను ఎలా ఏకం చేశాడన్న కథ చుట్టూ తిరుగుతుంది. కొండ కింద యువకుడు.. తన ఊరి గౌరవం కోసం, శక్తివంతమైన ప్రత్యర్థులకు ఎదురు నిలబడే ప్రయాణమే సినిమా మెయిన్ ప్లాట్‌. స్పోర్ట్స్‌ను కేవలం ఆటగా కాకుండా, ఆత్మగౌరవానికి ప్రతీకగా పెద్దిలో బుచ్చిబాబు చూపించాడు. ఎమోషన్స్, మాస్ మూమెంట్స్, గ్రామీణ వాతావరణం పెద్దికి ప్రధాన బలం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పవర్ఫుల్ టైటిల్ తో మొదలైన ఫస్ట్ పార్ట్.. ఎక్కడా బోర్ కొట్టకుండా సాగుతుంది. సినిమాలో వచ్చే పాటలు, ఫన్ ఎలిమెంట్స్, క్రికెట్ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయి.

జాన్వీ కపూర్ తన గ్లామర్ తో యూత్‌ను కట్టిపడేస్తుంది. అయితే జాన్వీ ట్రాక్, కొన్ని రొమాంటిక్ సీన్లు ఫిల్లర్‌లా అనిపించవచ్చు. ఇక పోతే ఫస్టాఫ్‌లో ప్రీ-ఇంటర్వెల్, ఇంటర్వెల్ బ్లాక్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఇవే సినిమాను.. సినిమాలోని పెద్ది క్యారెక్టర్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళతాయి. ఇక సెకండ్ హాఫ్‌ ఆంధ్ర నుంచి ఢిల్లీకి చేరుకుంటుంది. ఈ క్రమంలోనే ఎమోషన్స్, స్పోర్ట్స్ డ్రామా ప్రధానంగా సాగుతుంది. ఊరి గౌరవం కోసం జరిగే పోరాటం, పెద్ది ప్రయాణం ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది. కొన్ని సన్నివేశాలు ఊహించదగ్గ విధంగా ఉన్నా, భావోద్వేగాలు వర్కౌట్ అవుతాయి. క్లైమాక్స్ అదిరిపోతుంది. ఇంకా చెప్పాలంటే చివరి 30 నిమిషాలు రేస్ ఎపిసోడ్స్ ఉంటాయి. అవి మాత్రం ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెడతాయి. సినిమాకు ఈ ఎపిసోడ్ పెద్ద అసెట్. ఇక చరణ్ పెర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పెద్దిని రామ్ చరణ్ తన భుజాలపై ఎత్తుకుని మోసాడనే చెప్పాలి. ఆయన బాడీ లాంగ్వేజ్, గ్రామీణ యాస, ఎమోషనల్ సన్నివేశాల్లో నటన చాలా బాగుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు, క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాల్లో చరణ్ పెర్ఫార్మెన్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళుతుంది. అండ్ చరణ్ పహిల్వాన్‌ పాత్ర కోసం నాలుగు నెలలకు పైగా రెజ్లింగ్ ట్రైనింగ్ తీసుకున్నాడు కదా.. అది తెరపై కొట్టిచ్చినట్టు.. సూపర్భ్‌గా కనిపిస్తుంది. అప్పల సూరిగా జగపతి బాబు పెద్దికి మార్గనిర్దేశం చేస్తే.. గౌర్నాయుడిగా శివరాజ్‌ కుమార్..పెద్దికి కుస్తీ అనే ఆయుధాన్ని ఇస్తాడు. అచ్చియమ్మగా జాన్వీ కపూర్ చూడముచ్చటగా చేసింది. అయితే ఈమె క్యారెక్టర్ కాస్త పరిమితంగానే ఉంటుందని చెప్పాలి. ఇక టెక్నికల్ విషయాలకొస్తే.. ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు పెద్ద ప్లస్. రెహ్మాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాస్ సీన్లను ఎలివేట్ చేసింది. ఇక పెద్దికి మరో ప్లస్ పాయింట్ రత్నవేలు సినిమాటోగ్రఫీ. బుచ్చి, చరణ్ చెప్పినట్టే ప్రతీ ఫ్రేమ్‌లో రత్నవేలు కెమెరాపనితనం కనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పెద్ది పూర్తిగా రామ్ చరణ్ షో. మాస్, ఎమోషన్స్, స్పోర్ట్స్ డ్రామా కలయిక. ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా కనెక్ట్ అయ్యే ఎమోషనల్ సీన్లు ఉన్నాయి.

ఇలా దాదాపు పాన్ ఇండియా రేంజ్‌లో పెద్ది సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావడం మాత్రమే కాదు.. కలెక్షన్స్‌లో కూడా పెద్ది పేరు మార్మోగిపోయింది. సరికొత్త రికార్డులను పెద్ది తన ఖాతాలో వేసుకుంది. పెద్ది సినిమా ప్రీమియర్ షోల ద్వారా ప్రపంచవ్యాప్తంగా సుమారుగా ₹21.87 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులను సృష్టించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం, భారతదేశంలో కేవలం ప్రీమియర్ షోస్ అండ్ ముందస్తు బుకింగ్స్ ద్వారానే ఈ రేంజ్‌ కలెక్షన్స్‌ రాబట్టడం.. ట్రేడ్ వర్గాలను కూడా షాకయ్యేలా చేసింది.కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలోనూ రామ్‌ చరణ్ క్రేజ్ మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. కర్ణాటక ప్రీమియర్‌ షోల కలెక్షన్లలో ‘పెద్ది’ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అక్కడ ప్రీమియర్ల ద్వారానే ఈ చిత్రం రూ. 3.2 కోట్ల గ్రాస్‌ వసూలు చేసి, కర్ణాటకలో అత్యధిక ప్రీమియర్ కలెక్షన్స్ సాధించిన నంబర్ వన్ టాలీవుడ్ సినిమాగా నిలిచింది. అంతకుముందు ఈ జాబితాలో టాప్‌లో ఉన్న ‘ఓజీ’ 2.72 కోట్లు కలెక్ట్ చేయగా.. , ‘రాజా సాబ్’ 2.61 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక ‘పుష్ప 2’ … 2.55 కోట్లు వసూలు చేయగా.. ఇప్పుడీ సినిమాల రికార్డులను ‘పెద్ది’ బ్రేక్ చేసింది.

తొలి రోజు ‘పెద్ది’ సినిమా బుకింగ్స్‌ రికార్డ్ స్థాయిలో జరిగింది. ఒకే ప్లాట్‌ఫామ్‌లో గంటకు 40 వేలకు పైగా టికెట్స్‌ బుక్ అవుతుండటంతో… అభిమానులు ఇది నయా ఇండస్ట్రీ రికార్డ్ అన్నారు. తమ హీరో సినిమా ఘనతను సెలబ్రేట్ చేసుకున్నారు. డే 1 ‘పెద్ది’ సినిమా కలెక్షన్ల మోత మోగించింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే 135.36 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్లు దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఓవర్సీస్, మిగతా భాషల కలెక్షన్లను కలుపుకుంటే రెండు రోజుల్లోనే ఈ చిత్రం 180 కోట్ల మార్కును అందుకుంది. పాన్ ఇండియాలోనూ కాదు.. యూఎస్ మార్కెట్‌లోనూ పెద్ది సంచలనం రేపుతుంది. అక్కడ ఇప్పటికే 1.90 మిలియన్ డాలర్స్ అందుకుని.. 2 మిలియన్ వైపు పరుగులు పెడుతోంది. నార్త్ అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాల్లో కూడా భారీ వసూళ్లు రాబడుతోంది. దీంతో ఓవర్సీస్‌లో చరణ్ కెరీర్లోనే అత్యుత్తమ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా పెద్ది రికార్డ్‌ కెక్కింది.

చరణ్ పెర్ఫార్మెన్స్… క్రేజ్‌.. ఫాలోయింగ్ .. ఇలా థింగ్సే కాకుండా పెద్దికి మరికొందరు బిగ్గెస్ట్ ప్లస్‌గా మారారు. పెద్ది సిక్స్ కొట్టినా.. కుస్తీ పట్లతో పత్యర్థిని ఎత్తి కింద పడేసినా… బ్యాక్‌ గ్రౌండ్‌లో అంతకు మించి ఏఆర్ రెహ్మాన్ తన మ్యూజిక్‌తో వాయించేశాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్స్ ఇవ్వడంలో అనిరుధ్‌, తమన్ కన్నా తోప్ అనే కామెంట్‌ను రెహ్మాన్ పెద్ది తో నిజం చేశాడు. తన కొట్టుడుతో.. పెద్దిని పదింతలు ఎత్తుకు తీసుకెళ్లాడు. రెహ్మాన్ తర్వాత పెద్ది మూవీకి.. శివన్న క్రేజ్‌ ఇప్పుడు బిగ్గెస్ట్ ప్లస్ గా మారింది. శివన్న క్రేజ్ కారణంగా పెద్దికి కన్నడ నాట ఊహించని ఓపెనింగ్స్ వచ్చాయి. బుధవారం రాత్రి జరిగిన పెయిడ్ ప్రీమియర్ షోల ద్వారానే ఈ చిత్రం కర్ణాటకలో ఏకంగా 3.09 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక మొదటి రోజు ముగిసేసరికి కర్ణాటక వ్యాప్తంగా ‘పెద్ది’ చిత్రం మొత్తం 5.75 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సాలిడ్ ఓపెనింగ్స్ నమోదు చేసింది. కన్నడ వెర్షన్ థియేటర్లలో సుమారు 19% ఆక్యుపెన్సీతో ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతోంది.

దివ్యేందు, బొమన్ ఇరానీ.. ఈ సినిమాలో నటించడంతో.. బాలీవుడ్‌ మార్కెట్‌లో పెద్దికి కాస్త వెయిటేజ్ పెరిగింది. ఇక జాన్వీ కపూర్ క్రేజ్ ఇటు సౌత్‌తో పాటే నార్త్‌లోనూ కలిసొచ్చేదిగా మారింది. ఇలా పెద్ది సక్సెస్‌లో దాదాపు అందరూ భాగమయ్యారనే చెప్పాలి. పెద్ది ఆలోవర్ వరల్డ్ కలెక్షన్స్‌ను కుమ్మేస్తుండడంతో… చిరు పుత్రోత్సాహంతో పొంగిపోయారు. ‘పెద్ది’ టీమ్‌కు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం మెగా 158 షూటింగ్ కోసం పొల్లాచిలో ఉన్న చిరు తన మనసంతా ‘పెద్ది’ దగ్గరే ఉందంటూ ట్వీట్ చేశారు. రెండేళ్లుగా ఈ సినిమా కోసం చరణ్ పడుతున్న కష్టాన్ని దగ్గర నుంచి చూస్తున్నానని, ఈ రోజు ప్రేక్షకుల ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే ఒక తండ్రిగానే కాదు, నటుడిగానూ ఎంతో గర్వంగా ఉందన్నారు.

తండ్రి మాత్రమే కాదు.. చరణ్ వైఫ్ ఉపాసన కూడా.. పెద్ది వేడుకల్లో భాగమయ్యారు. బుధవారం రాత్రే పెద్ది సినిమా చూశారు. హైదరాబాద్‌ బాలానగర్‌లో ఉన్న విమల్ థియేటర్స్‌లో అభిమానుల మధ్య ఉపాసన తన స్నేహితులతో కలిసి సినిమాను వీక్షించారు. పెద్ది పాత్ర ఎంట్రీ కాగానే ఫ్యాన్స్‌తో కలిసి పేపర్లు ఎగరేస్తూ, ఆనందంతో గట్టిగా అరిచారు. అంతేకాదు ఇంటి దగ్గర మెగా అభిమానులతో కలిసి.. కేక్ కట్ చేసి.. పెద్ది సక్సెస్ సెలబ్రేషన్స్‌లోనూ భాగమయ్యారు ఉపాసన. మరో పక్క చరణ్‌ బాబాయ్‌ ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ కూడా.. పెద్ది సినిమా హిట్ అవుతుందంటూ ఎప్పుడో చెప్పారు. చరణ్ సినిమాకు ఏపీ ప్రభుత్వం నుంచి అన్ని విదాల సహాయ సహకారాలు అందించారు. సినిమా రిలీజ్ కు ముందు పెద్ది టీంను విష్ చేయడమే కాదు.. పెద్ది రిలీజ్ తర్వాత కూడా పెద్ది టీంకు కంగ్రాట్స్ చెప్పారు. చరణ్ పెర్ఫార్మెన్స్‌ ను మెచ్చుకున్నారు. అందులోనూ పహల్వాన్‌గా చరణ్‌ను చూసి పవన్ మురిసిపోయారు.

ఇదంతా నాణానికి ఒక వైపు.. మరో వైపు ఇంకో పని కూడ జరుగుతోంది. పెద్దిగాడిని కిందికి లాగేందుకు ప్రయత్నమూ సోషల్ మీడియాలో కనిపిస్తోంది. రీసెంట్‌ డేస్‌లో ఓ సినిమా పెద్ద హీరో సినిమా రిలీజ్ అయితే చాలు.. పని గట్టుకుని కావాలని నెగెటివ్ ప్రచారం చేసే బ్యాచ్ ఒకటి తెరమీదికి వస్తోంది. లాజిక్‌కు దూరంగా సినిమా అనేది మరిచి.. పిచ్చి పిచ్చి రివ్యూలతో సినిమాను చంపే ప్రయత్నం కనిపిస్తోంది. దీనిపై ఫిల్మ్ మేకర్స్ అందరూ ఇప్పటికే గట్టిగా రియాక్టవుతున్నారు. అయినా కానీ ఈ పెయిడ్ నెగెటివిటీని అడ్డుకోలేకపోతున్నారు. పెద్ది సినిమా విషయంలో కూడా పెయిడ్ నెగెటివిటీ ఎక్కువవుతోంది. ఈ సినిమా పై రిలీజ్ ముందు నుంచే కొన్ని తప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి. సినిమాలోని చిన్న చిన్న లోపాలు సహజం. వాటిని భూతద్దంలో చూపిస్తున్నారు కొందరు. పెద్దిని ట్రోల్ చేస్తున్నారు. ఓ మంచి సినిమాకు వెళ్లకుండా దృష్టిని మరులుస్తున్నారు.

ఈ మూవీ మేకర్స్ పై పైరసీ పిడుగు పడింది. పెద్ది మూవీ హెచ్‌డీ ప్రింట్ ఆన్‌లైన్లో ప్రత్యక్షం అయింది. దీంతో అలెర్ట్ అయిన పెద్ది టీం… ఆన్‌లైన్ నుంచి పెద్ది ప్రింట్ తొలగించే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. రీసెంట్ సక్సెస్ ప్రెస్ మీట్లోనూ.. పెద్ది పైరసీ ప్రింట్ ఎవరూ చూడొద్దని.. థియేటర్లలోనే పెద్దిగాడిని విట్‌నెస్ చేయాలంటూ.. రిక్వెస్ట్ చేసింది.

ఫైనల్ గా చెప్పాలంటే… ఓ హీరో రెండేళ్ల కష్టం. ఓ దర్శకుడి ఐదేళ్ల విజన్. కొందరు కళాకారుల ప్రతిభ.! 350 కోట్ల బడ్జెట్, అంతకు మించి ఈ సినిమా కారణంగా ఇన్నాళ్లూ వేతనం పొందిన శ్రామికులు.. లాభపడ్డ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు.! ఇదంతా మరిచి… ఓ సినిమాను కొందరు కావాలని టార్గెట్ చేస్తూ నెగెటివ్ ప్రచారం చేయడం ఎంత వరకు కరెక్ట్. సినిమా బా లేకపోతే.. ఎవ్వరూ చేసేదేం లేదు. ప్రేక్షకులే తిరస్కరిస్తారు. కానీ బాగున్న సినిమాపై కూడా తప్పుడు ప్రచారాలు చేయడం ఏంటి? జనాలను మంచి సినిమాకు దూరం చేయడాన్ని ఎవ్వరూ సమర్థించరు. పైగా ఇదంతా తెలిసిన రోజు… ప్రేక్షకులే బుద్ది చెబుతారు. పెద్ది విషయంలో ఇదే చేస్తున్నారు. రివ్యూలను, నెగెటివ్ కామెంట్స్ ను పట్టించుకోవకుండా పెద్దిని చూస్తున్నారు. పెద్దిని గెలిపిస్తున్నారు.

 

Published on: Jun 06, 2026 10:15 PM
Follow Us