Indian Railways: ప్రయాణికులకు రైల్వేశాఖ సూపర్ న్యూస్.. దేశవ్యాప్తంగా అమలు.. త్వరలోనే సిద్దంగా ఉండండి..
రైల్వేశాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది. త్వరలోనే ఎక్స్‌ప్రెస్, మెయిల్ ట్రైన్ల స్పీడ్‌ను మరింత పెంచనుంది. ప్రస్తుతం రైళ్లు గంటకు 110 కిలోమీటర్ల వేగంతో వెళుతుండగా.. 130కు పెంచేందుకు రైల్వేశాఖ సన్నద్దమవుతోంది. దీని వల్ల ప్రయాణికులు మరింత త్వరగా తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు.

రైళ్లల్లో రోజూ లక్షలాది మంది ప్రయాణిస్తూ ఉంటారు. వీరికి మెరుగైన, సౌకర్యవంతమైన, వేగవంతమైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించేందుకు రైల్వేశాఖ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ప్రయాణికులకు మరో శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా వందలాది మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల గరిష్ట వేగాన్ని మరింతగా పెంచాలని రైల్వేశాఖ భావిస్తోంది. ప్రస్తుతం గంటకు 110 కిలోమీటర్ల వేగంతో పలు దూర ప్రాంతపు రైళ్లు ప్రయాణిస్తుండగా.. వీటిని గంటకు 130 కిలోమీటర్లక పెంచనుంది. ఈ నిర్ణయానికి ప్రాథమిక అనుమతి ఇచ్చినట్లు ఇప్పటికే రైల్వే బోర్డు ప్రకటించింది. రైల్వే బోర్డు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో త్వరలోనే రైల్వేశాఖ వేగం పెంపుపై అధికారిక ప్రకటన చేయనుంది.
వందే భారత్ రైళ్ల తరహాలో..
సాధారణ మెయిల్, ఎక్స్‌ప్రెస్ సర్వీసులను కూడా రాజధాని, శతాబ్ది, వందే భారత్ తరహాలోనే వేగవంతమైన రైళ్ల స్థాయికి తీసుకురావాలని చూస్తోంది. అందులో భాగంగా వేగాన్ని పెంచేందుకు సిద్దమయ్యారు. దేశవ్యాప్తంగా 350 నుంచి 400 కిలోమీటర్ల వరకు దూర ప్రయాణాలు చేసే ఎక్స్‌ప్రెస్, మెయిల్, సూపర్ ఫాస్ట్ రైళ్ల వేగం పెంచనున్నారు. జర్మన్ టెక్నాలజీ ఆధారంగా రూపొందించిన LHB కోచ్‌లు గంటలకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉన్నాయి. దీంతో వేగం పెంచడం వల్ల దూరపు ప్రయాణాలు చేసేవారికి మేలు జరగనుంది. ప్రస్తుతం రాజధాని ఎక్స్‌ప్రెస్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్, దురంతో ఎక్స్‌ప్రెస్, వందే భారత్ రైళ్ల గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి. ఈ ప్రతిపాదనను అమలు చేస్తే అనేక సాధారణ మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా అదే వేగంతో ప్రయాణిస్తాయి. పెద్ద నగరాలు, రాష్ట్రాల మధ్య ప్రయాణించే ప్రయాణికులకు ప్రయాణ సమయం తగ్గుతుంది. సగటు వేగంలో కొద్దిపాటి పెరుగుదల కూడా కొన్ని సుదూర ప్రయాణాలలో చాలా గంటల సమయాన్ని ఆదా చేస్తుంది. ప్రతి సంవత్సరం 40 నుండి 45 కోట్ల మంది ప్రజలు నేరుగా వేగం పెంపు వల్ల ప్రయోజనం పొందవచ్చని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు.
