Telangana: కేంద్రం నుంచి తీసుకున్నదాని కంటే రాష్ట్రం ఇచ్చిందే ఎక్కువ.. తప్పని నిరూపిస్తే రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్
అభివృద్ధి పనుల్లో పోటీ పడాలే గానీ.. మసీదులు తవ్వడం, మత విమర్శలు చేయడం వంటి అంశాల్లో కాదని బీజేపీకి తెలంగాణ మంత్రి కేటీఆర్(KTR) సూచించారు. కుల మతాల పేరుతో రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నించొద్దని హితవు పలికారు....
అభివృద్ధి పనుల్లో పోటీ పడాలే గానీ.. మసీదులు తవ్వడం, మత విమర్శలు చేయడం వంటి అంశాల్లో కాదని బీజేపీకి తెలంగాణ మంత్రి కేటీఆర్(KTR) సూచించారు. కుల మతాల పేరుతో రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నించొద్దని హితవు పలికారు. మహబూబ్‌నగర్ (Mahaboob Nagar) జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హాదా ఇస్తామని చెప్పి, 8 ఏళ్లలో ఒక్క పైసా ఇవ్వలేదని విమర్శించారు. వికారాబాద్ నుంచి కర్ణాటకకు, గద్వాల – మాచర్ల రైలు అడిగినా ఇవ్వలేదని మండిపడ్డారు. కేంద్రానికి రూ.3.65 లక్షల కోట్లు పన్నుల రూపంలో తెలంగాణ(Telangana) ఇస్తే.. రాష్ట్రానికి కేంద్రం రూ.1.68 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. తాను చెప్పింది తప్పని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. కేటీఆర్ తో పాటు రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, ప్రశాంత్‌రెడ్డి తదితరులు మహబూబ్ నగర్ పర్యటనలో పాల్గొన్నారు.
8 ఏళ్లుగా కృష్ణా జలాల్లో 575 టీఎంసీల నీటి వాటాను తెలంగాణ అడుగుతుంటే కేంద్రం నోరుమెదపడం లేదు. పైగా కేసీఆర్ పై అసత్య ప్రచారం చేస్తున్నారు. వికారాబాద్-కృష్ణా, గద్వాల-మాచర్ల రైల్వే లైన్లు మంజూరు చేయమంటే ఇవ్వలేదు. కొత్తకోట మున్సిపాలిటీకి త్వరలో రూ.4 కోట్లు మంజూరు చేస్తాం. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్‌పాలనలో ఎన్నో మంచి కార్యక్రమాలు మొదలుపెట్టాం. దేవరకద్రను పురపాలిక కేంద్రంగా ఏర్పాటు చేస్తాం. పురపాలిక కేంద్రం ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేస్తాం. నేను చెప్పింది తప్పైతే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా. లేదంటే అమిషా తప్పు అంగీకరించి ముక్కు నేలకు రాయాలి.
– కేటీఆర్, తెలంగాణ మంత్రి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి