AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahabubnagar: ఇదే కదా ప్రజా పాలన అంటే.. అభాగ్యులకు అండగా.. అధికారిని వినూత్న ఆలోచన!

ప్రజలకు సేవ చేయాలన్న మనసుండాలే కానీ ఆలోచనలు ఎలాగోలా ఆచరణలోకి వచ్చేస్తాయి. పొందిన జ్ఞానం, చేస్తున్న ఉద్యోగం సంతృప్తినిచ్చేది సైతం అప్పుడే. అభాగ్యులకు ఆసరా గా నిలిచేందుకు ఆ అధికారిని ఓ సరికొత్త కార్యక్రమానికి నాంది పలికింది. ఇంతకు ఆధికారిని ఎవరూ, ఆమె తలపెట్టిన కార్యక్రమం ఏంటో తెలుసుకుందాం పదండి.

Mahabubnagar: ఇదే కదా ప్రజా పాలన అంటే.. అభాగ్యులకు అండగా.. అధికారిని వినూత్న ఆలోచన!
Mbnr
Boorugu Shiva Kumar
| Edited By: |

Updated on: Jun 13, 2025 | 9:02 PM

Share

మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అభాగ్యులకు ఆసరాగా ఉండేందుకు, వారి సమస్యలు ప్రత్యేకంగా పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాధారణంగా ప్రతీ సోమవారం జిల్లా కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతోంది. దీంతో జిల్లా నలుమూలల నుంచి వందల సంఖ్యలో ఫిర్యాదులు కలెక్టర్, అధికారుల వద్దకు వస్తుంటాయి. ఫిర్యాదు దారులతో పాటు వారి వెంట వచ్చే సహాయకులు, వందల సంఖ్యలో ఉంటున్నారు. అయితే ఫిర్యాదుదారుల్లో ఎక్కువ శాతం వృద్ధులు, దివ్వాంగులు ఉంటున్నారు. సాధారణ ఫిర్యాదుదారులతో పోల్చితే వారు సోమవారం జరిగే ప్రజావాణి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కో ఫిర్యాదుకు కొన్ని సార్లు గంటల సమయం సైతం పడుతోంది. దీంతో అలా గంటలు, గంటలు దివ్యాంగులు, వృద్ధులు వేచి ఉండాల్సి వస్తోంది.

నడవలేని స్థితిలో ఉన్న వారు ఎంతో కష్టపడి జిల్లా కలెక్టరేట్ వరకు రావడం… అక్కడ అతికష్టం మీద అధికారి వద్దకు చేరుకుంటున్న సమస్యను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి గమనించారు. ఇలాంటి వారికోసం ఏదైన ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని భావించారు. పలువురు అధికారులతో ఇదే అంశంపై చర్చించారు. దీంతో ప్రతీ సోమవారం సాధారణ ప్రజల ఫిర్యాదులు తీసుకోవడంతో పాటు వృద్ధులు, దివ్యాంగుల కోసం మరోరోజు కూడా కేటాయించాలన్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. అనుకున్నదే తడవుగా ఆచరణలో పెట్టాలని ప్రతినెల మొదటి బుధవారం దివ్యాంగులు, వృద్దుల కోసం ప్రత్యేక ప్రజావాణి నిర్వహించాలని నిర్ణయించారు.

జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న కలెక్టరేట్‌కు రావడం దివ్యాంగులు, వృద్ధులకు ఇబ్బందిగా మారింది. దీంతో వారికి అనువుగా ఉండే ప్రాంతం కావాలని బస్టాండ్‌కు సమీపంలోని మహబూబ్ నగర్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రత్యేక ప్రజావాణి కోసం ఎంచుకున్నారు. ప్రతి నెల మొదటి బుధవారం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నాం ఒంటిగంట వరకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. సాధారణ ప్రజావాణి మాదిరిగానే జిల్లా కలెక్టర్‌తో పాటు అన్ని శాఖల అధికారులు ఈ ప్రత్యేక ప్రజావాణికి హజరువుతారు.

రాష్ట్రంలోనే వినూత్న కార్యక్రమానికి కలెక్టర్ నాందిపలకడంతో మహబూబ్ నగర్ ప్రజల నుంచి హర్షాతీరేకాలు వ్యక్తం అవుతున్నాయి. తోపులాటలు, నిరీక్షణలు లేకుండా అధికార యంత్రాంగం అంత తమవద్దకే వచ్చిందని వృద్ధులు, దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక ప్రజావాణి ఏర్పాటు చేయడమే కాకుండా స్వయంగా కలెక్టర్ వచ్చి వినతులు స్వీకరించి… పరిష్కరించడం బాగుందని చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..