AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

N.V.S. Reddy: ఆ వార్తల్లో వాస్తవం లేదు.. పాతబస్తీలో మెట్రో విస్తరణపై మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి క్లారిటీ!

పాతబస్తీలో మెట్రో రైల్ పనులపై హైకోర్టు స్టే ఇచ్చిందంటూ వస్తున్న వార్తలను హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఖండించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తేల్చి చెప్పారు. మెట్రో పనులపై హైకోర్టు ఎటువంటి స్టే ఆర్డర్ ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు.

N.V.S. Reddy: ఆ వార్తల్లో వాస్తవం లేదు.. పాతబస్తీలో మెట్రో విస్తరణపై మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి క్లారిటీ!
Nvs Reddy
Anand T
|

Updated on: Jun 13, 2025 | 8:43 PM

Share

పాతబస్తీలో మెట్రో రైల్ పనులపై హైకోర్టు స్టే ఇచ్చిందంటూ గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఖండించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తేల్చి చెప్పారు. మెట్రో పనులపై హైకోర్టు ఎటువంటి స్టే ఆర్డర్ ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. యాక్ట్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ (APWF) దాఖలు చేసిన పిల్‌కు ప్రతిస్పందనగా హెచ్ఏఎంఎల్ హైకోర్టుకు గతంలో దాఖలు చేసిన కౌంటర్‌లో, పాతబస్తీలో ఏ వారసత్వ నిర్మాణాన్ని తాకడం లేదా కూల్చివేయడం జరగదని విన్నవించినట్టు ఆయన వెల్లడించారు. చార్మినార్, ఫలక్ నుమా చారిత్రాత్మక నిర్మాణాలు మెట్రో రైల్ అలైన్మెంట్‌కి దూరంగా ఉన్నాయని అఫిడివిట్ లో పేర్కొన్నట్టు ఆయన తెలిపారు. ఎటువంటి పురాతన కట్టడాలను, ప్రాంగణాలను తాకడం లేదా కూల్చివేయడం జరిగే ప్రసక్తే లేదని హెచ్ఏఎంఎల్ తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ శ్రీ ఇమ్రాన్ ఖాన్ న్యాయస్థానానికి హామీ ఇచ్చారని ఎండీ శ్రీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

ఆ తరువాత పిటిషనర్, హెచ్ఏఎంఎల్ అదనపు అఫిడవిట్లు, కౌంటర్ అఫిడవిట్లను దాఖలు చేశారన్నారు. కొన్ని రోజుల క్రితం పిటిషనర్ దాఖలు చేసిన తాజా అదనపు అఫిడవిట్లకు అదనపు అడ్వకేట్ జనరల్ హెచ్ఏఎంఎల్ తరఫున తన ప్రతిస్పందనను దాఖలు చేయడానికి కొంత సమయం కోరారని ఆయన చెప్పారు. హైకోర్టు సమగ్రమైన కౌంటర్ దాఖలు చేయడానికి 3 వారాల సమయం ఇచ్చిందని..మధ్యంతర ఉపశమనం ఏదైనా ఇదివరకు ఇచ్చి ఉంటే, తదుపరి విచారణ తేదీ వరకు అది అమలులో ఉంటుందని మాత్రమే హైకోర్టు తన ఉత్తర్వులలో పేర్కొందని ఆయన వివరించారు.

హైకోర్టు ఆదేశాలను వక్రీకరిస్తూ కొందరు సోషల్ మీడియా, మీడియాలో తప్పుడు సమాచారం అందిస్తున్నారని ఆయన అన్నారు. ప్రభావిత ఆస్తుల యజమానులకు ఇచ్చే కన్సెంట్ అవార్డుల ఆధారంగా సముచితమైన పరిహారం చెల్లించిన తర్వాతే ప్రైవేట్ భవనాల కూల్చివేత పనులు జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. పాతబస్తీలో నిర్మాణాల కూల్చివేతలో ఉన్న సవాళ్లను వివరిస్తూ, ఒకదానికొకటి అనుకోని ఉన్న భవనాలు, సంక్లిష్టంగా ముడిపడిన విద్యుత్, టెలికాం, ఇతర కేబుల్ వైర్లు ఉండటంతో, హెచ్ఏఎంఎల్ ఇంజినీర్లు, అధికారులు రాత్రిపూట ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం లేకుండా వారసత్వ కట్టడాలను మినహాయించి మిగిలిన ప్రభావిత ఆస్తులను జాగ్రత్తగా కూల్చివేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. మెట్రో విస్తరణ పనులు వేగవంతంగా పూర్తి చేయడానికి వారు రాత్రింబవళ్లు కృషి చేస్తున్నారన్నారు. కన్సెంట్ అవార్డులకు అంగీకరించేలా ప్రభావిత ఆస్తుల యజమానులను ఒప్పించడంలో హెచ్ఏఎంఎల్ అధికారులు, ముఖ్యంగా మహిళా అధికారులు చేస్తున్న కృషిని ఎండీ శ్రీ ఎన్వీఎస్ రెడ్డి అభినందించారు.

పాతబస్తీ వాసులు ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలన్న ఆకాంక్షతో ఉత్సాహంగా తమ సహకారాన్ని అందించడం పట్ల మెట్రో ఎండీ కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటివరకు నిర్లక్ష్యానికి గురైన పాతబస్తీలో, మెట్రో రైల్ ప్రాజెక్టు పనుల ప్రగతిపై వారంతా సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు. ఇప్పటివరకు దాదాపు 311 ఆస్తులను స్వాధీనం చేసుకున్నామని, సహాయ పునరావాస నష్టపరిహారం కింద వాటి యజమానులకు ఇప్పటి వరకు రు. 283 కోట్లు పంపిణీ చేశామని ఆయన తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..