Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lok Sabha Election: తెలంగాణలో పోలింగ్ కోసం 73 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తుః డీజీపీ రవిగుప్తా

తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగనుంది. ఓ వైపు పోలింగ్ ఏర్పాట్లు, మరోవైపు భద్రత ఏర్పాట్లు. లోక్‌సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశామని తెలంగాణ డీజీపీ రవిగుప్తా తెలిపారు.

Lok Sabha Election: తెలంగాణలో పోలింగ్ కోసం 73 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తుః డీజీపీ రవిగుప్తా
Dgp Ravi Gupta
Follow us
Ranjith Muppidi

| Edited By: Balaraju Goud

Updated on: May 12, 2024 | 5:47 PM

తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగనుంది. ఓ వైపు పోలింగ్ ఏర్పాట్లు, మరోవైపు భద్రత ఏర్పాట్లు. లోక్‌సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశామని తెలంగాణ డీజీపీ రవిగుప్తా తెలిపారు. మే నెల 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా లోక్‌సభకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు భద్రతా ఏర్పాట్లపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలపై ఎలాంటి ఫోకస్ పెట్టారో.. టీవీ9కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు తెలంగాణ డీజీపీ రవి గుప్తా.

రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో జరగనున్న ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు విస్తృతమైన పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశామని డీజీపీ తెలిపారు. పోలింగ్‌ సమయంలో ఎలాంటి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల భద్రతకు 73, 414 సివిల్ పోలీసులు, 500 రాష్ట్ర స్పెషల్ పోలీసులు, 164 సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ బృందాలు రంగంలో దించినట్లు తెలిపారు. అలాగే, తమిళనాడుకు చెందిన మూడు స్పెష ల్ ఆర్మ్‌డ్ కంపెనీలు, 2,088 ఇతర శాఖల సిబ్బంది విధుల్లో ఉన్నట్లు తెలిపారు. 7,000 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన హోంగార్డులను వినియోగిస్తున్నామని తెలిపారు.

పోలింగ్ ఏర్పాట్లతోపాటు ఎన్నికల నియమావళి అమలులో భాగంగా రాష్ట్ర పోలీసులు భద్రతా తనిఖీ కేంద్రాల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందులో 482 ఫిక్స్‌డ్ స్టాటిక్ టీములు (ఎఫ్‌ఎస్‌టి),462 స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్‌లు (ఎస్‌ఎస్‌టి), 89 ఇంటర్ -స్టేట్ బోర్డర్ చెక్ పోస్టులు, 173 ఇంటర్-జిల్లా చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. డబ్బు, మద్యం, ఇతర అక్రమ పదార్థాల రవాణాను అడ్డుకునేందుకు మొబైల్ పోలీసు విభాగాలను ఏర్పాటు చేశామని అన్నారు.

ఇక 2024 మార్చి 16న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకటించినప్పటి నుంచి పోలీసులు రూ. 186.14 కోట్ల మద్యం, మాదక ద్రవ్యాలు, విలువైన వస్తువులను జప్తు చేశారన్నారు. రాష్ట్ర పోలీసులు ఎక్సైజ్ చట్టం, మాదకద్రవ్యాల చట్టం, ఇండియన్ పీనల్ కోడ్, ప్రజాప్రాతినిధ్య చట్టం కింద 8,863 కేసులు నమోదు చేశారని తెలిపారు. ఎన్నికల్లో నేరాలకు పాల్పడే వారిని గుర్తించి 34,526 మందిని బైండోవర్ చేశామని డీజీపీ వివరించారు. ఎన్నికల ప్రక్రియకు అవాంతరాలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ రవి గుప్తా హెచ్చరించారు. ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోవాలని కోరారు.

ఇక, తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు చేసిన తనిఖీల్లో రూ.93,94,43,358 నగదు సీజ్ చేశామని డిజిపి రవిగుప్తా తెలిపారు. మద్యం రూ. 10,07,49,567 కోట్లు, డ్రగ్స్ రూ.7,86,32,020, బంగారం 91.822 కిలోలు, వెండి 166.037 కిలోలు, రాజకీయ పార్టీలు ఓటర్లకు పంచేందుకు తీసుకుని వెళ్తున్న వస్తువులు రూ.11,48,88,459 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మొత్తం 186,14,90,884 విలువైన వాటిని సీజ్ చేశామని తెలిపారు.

ఎన్నికలను పర్యవేక్షించేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో పాటు డీజీపీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఇది మే 12వ తేదీ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైందన్నారు. చివరి ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌కు చేరే వరకు కంట్రోల్ రూం నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. పోలింగ్ సిబ్బంది కోసం కమ్యూనికేషన్ నెట్‌వర్క్ ఏర్పాటు చేశామని తెలిపారు.

మరో వైపు హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్‌పై ప్రత్యేక నిఘా పెట్టారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటున్న డీజీపీ రవి గుప్తా.. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందుకోసం ప్రత్యేక సైబర్ సెక్యూరిటీ వింగ్ ఏర్పాటు చేసినట్లు టీవీ9కు ఇచ్చిన ఇంటర్య్వూలో స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..