హైదరాబాద్‌లోని బస్టాండ్‌లపై లాక్‌డౌన్ ఎఫెక్ట్.. సొంత ఊరికి పయనమవుతున్న కష్టజీవులు
Lockdown effect: తెలంగాణలో బుధవారం నుంచి 10 రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో ప్రజలు స్వస్థలాల బాట పట్టారు. దీంతో హైదరాబాద్‌లోని బస్టాండ్లు రద్దీగా మారాయి...
తెలంగాణలో బుధవారం నుంచి 10 రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో ప్రజలు స్వస్థలాల బాట పట్టారు. దీంతో హైదరాబాద్‌లోని బస్టాండ్లు రద్దీగా మారాయి. ప్రధాన బస్టాండ్లు ఎంజీబీఎస్, జేబీఎస్‌లతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. దొరికిన బస్సుతో సొంత ఊరుకు వెలేందకు పిల్లా పాపలతో పరుగులు పెడుతూ కనిపించారు. పాఠశాలలకు సెలవులు కూాడా కావడంతో జనం ఇంటి మఖం పడుతున్నారు.
రోజు రోజుకు పెరుగుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో బుధవారం నుంచి ఈ నెల 21 వరకు లాక్‌డౌన్ విధించాలని సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు కార్యకలాపాలకు అనుమతిచ్చారు. నిత్యావసరాలు, ఇతర వస్తువుల కొనుగోలుకు ఈ సమయంలో వెసులుబాటు కల్పించారు.
ఆ తర్వాత దాదాపు అన్ని కార్యకలాపాలూ నిలిచిపోనున్నాయి. అత్యవసర సేవలను మాత్రమే అనుమతించనున్నారు. ప్రతిరోజూ 20 గంటలపాటు లాక్‌డౌన్ అమల్లో ఉండనుంది. లాక్‌డౌన్ సమయంలో నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.