Lagacharla Incident: కారప్పొడి, రాళ్లు ముందే సిద్ధం చేశారా..? లగచర్ల లడాయిపై ఐజీ సంచలన వ్యాఖ్యలు..

లగచర్ల లడాయితో ఫార్మా కంపెనీల ఏర్పాటు అంశంపై మళ్లీ చర్చ మొదలైంది. దీన్ని స్థానికులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ? అసలు ఈ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన ఏంటి ? ఈ మొత్తం వ్యవహారంపై అనేక వాదనలు వినిపిస్తున్నాయి.

Lagacharla Incident: కారప్పొడి, రాళ్లు ముందే సిద్ధం చేశారా..? లగచర్ల లడాయిపై ఐజీ సంచలన వ్యాఖ్యలు..
Lagacharla Incident
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 12, 2024 | 9:20 PM

లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం భూ సేకరణపై అభిప్రాయ సేకరణకు వెళ్లిన అధికారులపై దాడి జరిగింది. ఈ దాడి రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. దీంతో ఈ వ్యవహారంపై చర్చ మొదలైంది. గత జనవరిలో జరిగిన బయో ఏసియా అంతర్జాతీయ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం ఫార్మా క్లస్టర్ల ప్రణాళికను ప్రకటించింది. గ్రీన్‌ ఫీల్డ్‌ ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేసేందుకు వికారాబాద్‌, మెదక్‌, నల్లగొండ జిల్లాలను ఎంపిక చేసింది. ఒక్కో క్లస్టర్‌లో మూడు నుంచి నాలుగు ఫార్మా విలేజ్‌లు ఉంటాయి. దీనికి సంబంధించిన భూ సేకరణ ప్రక్రియకు సీఎం నియోజకవర్గం కొడంగల్‌ నుంచి తొలి అడుగులు పడ్డాయి. వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం లగచర్ల, హకీంపేట, పోలేపల్లి గ్రామాల్లో 1,373 ఎకరాల్లో ఫార్మా క్లస్టర్‌ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించారు. దీని ద్వారా ఈ ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని రేవంత్ సర్కార్ భావిస్తోంది. అయితే ప్రభుత్వ ప్రతిపాదనను ఇక్కడి రైతులు వ్యతిరేకిస్తున్నారు. పలుసార్లు అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు, ఆందోళనలు సైతం నిర్వహించారు.

రైతులు, ప్రజల ఆందోళనకు బీఆర్ఎస్ మద్దతు

అయితే ఫార్మా విలేజ్ ప్రతిపాదనలను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. ఫార్మా సిటీ కోసం రంగారెడ్డి జిల్లాలో 14 వేల ఎకరాలు సేకరించారని.. దాన్ని వదిలేసి ఇక్కడి ఎందుకు రైతుల నుంచి భూములు లాక్కుంటున్నారని ఆరోపిస్తోంది. ఈ విషయంలో సీఎం రేవంత్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తోంది.

ప్రజల అభీష్టం మేరకు నడుచుకోవాలంటున్న బీజేపీ

రైతుల్లో ఈ రకమైన ఆందోళన ఉన్నప్పుడు నియోజకవర్గ ప్రతినిధిగా పంతానికి, ప్రతిష్టకు పోకుండా ఆలోచనని విరమించుకోని ప్రజలు అభీష్టం మేరకు నడుచుకోవాలని స్థానిక ఎంపీ, బీజేపీ నేత డీకే అరుణ అన్నారు. ఫార్మా కంపెనీ కోసం భూములు ఇస్తే తమ భవిష్యత్తు కోల్పోతామనే ఆందోళనలో రైతులు, స్థానికులు ఉన్నారని తెలిపారు.

ఇలా సీఎం రేవంత్ సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో ఏర్పాటు చేయాలనుకుంటున్న ఫార్మా విలేజ్‌పై ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతుండటం.. వారికి విపక్షాల నుంచి కూడా మద్దతు లభిస్తుండటంతో.. ఈ అంశంలో ప్రభుత్వం ఏ విధంగా ముందుకు సాగుతుందనే అంశం ఆసక్తికరంగా మారింది.

వీడియో చూడండి..

హైదరాబాద్‌ రేంజ్ ఐజీ సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు..

ఈ తరుణంలో లగచర్ల ఘటన ప్రీప్లాన్డ్‌! కలెక్టర్‌పై దాడి ఉద్దేశపూర్వకమేనంటూ హైదరాబాద్‌ రేంజ్ ఐజీ సత్యనారాయణ తేల్చి చెబుతుండటం సంచలనంగా మారింది.. లగచర్లలో చొరబడ్డ అసాంఘిక శక్తుల కారణంగానే ఘటన జరిగిందని.. కలెక్టర్ వెళ్లడానికి ముందే కారప్పొడి, రాళ్లు సిద్ధం చేశారు. ముందే గుర్తించిన పోలీసులు, వద్దని వారించినా కలెక్టర్‌ వినలేదని.. సామరస్యంగా ప్రజాభిప్రాయం సేకరించే లక్ష్యంతో కలెక్టర్ ప్రతీక్‌జైన్ అక్కడకు వెళ్లారన్నారు. కలెక్టర్‌ను కొద్దిదూరం నుంచి ఫాలో అయిన పోలీసులు.. ఉద్రిక్తత గమనించి పోలీసులు వెళ్లేసరికే ఊహించనిరీతిలో దాడి జరిగిందన్నారు. ఘటన వెనుక ఎంతపెద్ద శక్తి ఉన్నా వదిలేదే లేదని ఐజీ సత్యనారాయణ స్పష్టంచేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..