Itlu Mee Niyojakavargam: అభివృద్ధి, సంక్షేమం ఓవైపు.. సామజికవర్గం లెక్కలు ఓవైపు.. కరీంనగర్ గడ్డ.. ఎవరికి అడ్డా..
కరీంనగర్ అసెంబ్లీ పరిధిలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇంకా.. ఎన్నికలకు.. 10 నెలల సమయం ఉన్నా.. రాజకీయ వేడి మొదలైంది... మంత్రి గుంగల కమలాకర్. ఆరు నెలల నుంచే... కరీంనగర్ పై దృష్టి పెట్టారు.. ఇప్పటికే ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేశారు. ప్రతి పక్షాలైనా బిజెపి, కాంగ్రెస్ లో ... అభ్యర్థిపైస్పష్టత లేదు.. ఈ రెండు పార్టీలలో పెద్ద పెద్ద నేతలు ఉన్నా.. పోటీ విషయంలో డైలామా ఉంది.
2023ఎన్నికలు దగ్గరపడుతున్నవేళ… కరీంనగర్ అసెంబ్లీబరికి సంబంధించి… ఇప్పుడు ఇలాంటి చర్చే జరుగుతోంది మరి. బీఆర్‌ఎస్‌లో టికెట్ పోటీ లేదు.. కాబట్టి వచ్చే ఎన్నికల్లో… మరోసారి కారుగుర్తుమీద మంత్రి గంగుల కమలాకరే పోటీచేస్తారనే విషయంలో ఆ క్లారిటీ ఉంది. మూడుసార్లు విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టిన గంగుల.. మరోసారి సత్తా చాటేందుకు సై అంటున్నారు. పార్టీలోనూ టిక్కెట్ పోరు లేకపోవడంతో… ఆయనకు ఎదురులేదన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇప్పట్నుంచే గ్రౌండ్ పిపేర్ చేసుకుంటున్నారు. మాజీ మేయర్ రవీందర్ సింగ్‌తో విభేదాలు ఉన్నా… అవేమంత ప్రభావవంతమైని కాకపోవచ్చు. ఎందుకంటే, నియోజకవర్గంలోని కీలక నేతలంతా.. కమలాకర్ వెంటే ఉన్నారు. దీంతో…. తన అనుచరులకు ప్రాధాన్యతనిస్తూ… ఎన్నికల సమరానికి సమాయత్తమవుతున్నారు మంత్రి.
ఇక్కడ గంగులకు గట్టిపోటీ ఇచ్చే ప్రత్యర్థులెవరైనా ఉన్నారంటే అది బీజేపీ నుంచేనన్న అభిప్రాయం ఉంది. అందులోనూ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి సొంత ఇలాఖా ఇది. పైగా, ఈ నియోజకవర్గం నుంచే ఆయన పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దీంతో, సహజంగానే కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో రాజకీయాలపై సర్వత్రా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. 2009 నుంచి కరీంనగర్ ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు గంగుల కమలాకర్. 2009లో టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించిన గంగుల… ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత … బీఆర్ఎస్ తరపున కరీంనగర్‌లో రెండుసార్లు గులాబీ జెండా ఎగరేసిన కమలాకర్, ఇప్పుడు రాష్ట్రమంత్రిగా ఉన్నారు. అయితే, గత రెండు దఫాలూ… బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్, కమలాకర్‌పై పోటీచేసి ఓడారు.
2019లో ఎంపీగా విజయం
2018లో కమలాకర్‌కు బండి సంజయ్ గట్టిపోటీ ఇచ్చినా విజయం మాత్రం దక్కలేదు. అయితే, ఆ తర్వాతే రాజకీయంగా అనూహ్య పరిణామాలు సంభవించాయి. కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్థిగా ఓడిన సంజయ్… ఆ వెంటనే జరిగిన జనరల్‌ఎలక్షన్స్‌లో మాత్రం ఎంపి అభ్యర్థిగా విజయం సాధించారు. ఆ తర్వాత రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ప్రమోషన్ కొట్టేసిన సంజయ్… అధిష్టానం ఆదేశాలతో తెలంగాణలో పార్టీబలోపేతానికి కృషిచేస్తున్నారు. అయితే, సొంత నియోజకవర్గంపై ఆయన పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు. కరీంనగర్ అసెంబ్లీ బరి నుంచి మరోసారి పోటీచేస్తారా? లేదా? అనే విషయంలోనూ క్లారిటీ లేదు. అలాగని ఆయన తర్వాత బీజేపీకి ఇక్కడ గట్టి లీడర్ ఉన్నాడా? అంటే అదీ లేదు. ప్రస్తుతం ఉన్న పొలిటికల్ సిట్యుయేషన్‌కు అనుగుణంగా… బండిసంజయ్ మరోస్థానాన్ని ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అదే నిజమైతే.. సంజయ్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనేది ఆసక్తికరం.
2018లో పొన్నంకు మూడో స్థానం.. మళ్లీ సాహసించరా?
కరీంనగర్‌లో కాంగ్రెస్ పరిస్థితి.. బీజేపీకి భిన్నంగా ఏమీ లేదు. 2018ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి మూడోస్థానానికి పరిమితమై ఘోరపరాభవం మూటగట్టుకున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్… మళ్లీ ఆ సాహసం చేయాలనుకోవట్లేదట. ఆయన పార్లమెంటుకు పోటీచేసేందుకే ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. దీంతో, హస్తం పార్టీ తరపున అభ్యర్థి ఎవరనే విషయంలో సందిగ్ధత ఏర్పడింది. కాంగ్రెస్ నుంచి ప్రధానంగా ముగ్గురునేతలు ఈ టిక్కెట్ కోసం పోటీపడుతున్నట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి ఎం సత్యనారాయణరావు మనువడు రోహిత్ రావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ అంజన్ కుమార్… టిక్కెట్‌కోసం ప్రయత్నం చేస్తున్నారు. టికెట్ తమదే అంటూ… ఎవరికివారు ప్రచారం చేసుకుంటున్నారు. అసలే కల్లోలంలో ఉన్న కాంగ్రెస్‌కు.. ఇదో తలనొప్పిగా మారుతుందా? అనే ఆందోళన వ్యక్తం చేస్తోంది క్యాడర్.
ముస్లింలు, మున్నూరు కాపుల ఓట్లే అధికం
ప్రత్యర్థి పార్టీల నుంచి అభ్యర్థుల విషయంలో క్లారిటీ లేకపోవడంతో.. మరింత కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు మంత్రి గంగుల కమలాకర్. బండి సంజయ్, పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్లు బరిలో ఉన్నపుడే గెలిచాను… ఇప్పుడెంత? అనే ధీమాతో ముందుకెళ్తున్నారు. మెజార్టీ మరింత పెరుగుతుందే తప్ప.. తగ్గేదేలేదంటున్నారు. కరీంనగర్‌లో సామాజికపరమైన లెక్కలు కూడా అధికారపార్టీకి అనుకూలమనే చెబుతున్నాయి. కరీంనగర్ అసెంబ్లీ బరిలో మూడు లక్షలకు పైగా ఓట్లుంటే… అందులో ముస్లిం మైనార్టీలు, మున్నూరు కాపుల ఓట్లు ఎక్కువ. గత ఎన్నికల్లో తలపడిన గంగుల కమలాకర్, బండి సంజయ్‌లిద్దరూ మున్నూరు కాపులే. దీంతో, కొన్నిదఫాలుగా గంగులకే ఓటేస్తున్న మున్నూరు కాపు సామాజికవర్గంలో మెజార్టీ శాతం.. బండివైపు తిరిగింది.
అయితే, సహజంగానే బీజేపీని వ్యతిరేకించే ముస్లిం మైనార్టీలు.. ఎక్కువశాతం కాంగ్రెస్‌ను వదిలి బీఆర్‌ఎస్‌వైపు మళ్లారు. అది గంగుల కమలాకర్‌కు కలిసొచ్చింది. గంగుల వర్సెస్ బండి అన్నట్టు సాగిన పోరులో.. గౌడవర్గానికి చెందిన పొన్నం పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే, ఈసారి కూడా కరీంనగర్ ఇలాఖాలో హిందు, ముస్లిం హీట్ ఎక్కువగానే ఉంది కాబట్టి… మరోసారి గంగులకు కలిసొస్తుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అలాగని ఇక్కడ మరో సామాజికవర్గం గట్టిగా లేదనీ చెప్పలేం. ఎస్సీలు 29వేలు, పద్మశాలీలు 22వేలు, ముదిరాజ్ 14వేలు, 9వేలు గీతకార్మికులు, 8వేల క్రిస్టియన్ ఓట్లు ఉన్నాయి.
బండి బరిలో లేకుంటే.. కమలాకర్‌కే మున్నూరు కాపుల ఓట్లు!
ఏదేమైనా, ఈ సారి కరినగరంలో త్రిముఖ పోరులా కనిపిస్తున్నా… మెయిన్ ఫైట్ మాత్రం బీజేపీ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ బండి సంజయ్ బరిలో లేకుంటే.. మున్నూరు కాపు ఓట్లన్నీ గంపగుత్తగా మరోసారి కమలాకర్‌కు పడే అవకాశం ఉంది. ఎస్సీలు, ముస్లింలు, క్రిస్టియన్లు.. మెజార్టీ శాతం ఆయనవైపే మొగ్గుచూపే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, ఈ త్రిముఖ పోరుతో… తమకంటే తమకే లాభమంటూ.. లెక్కలేసుకుంటున్నాయి ప్రధాన పార్టీలు. మరోసారి మైనార్టీ వర్గం ఓట్లపై గంపెడాశతో ఉన్న గంగుల… నాలుగోసారి కూడా విజయం వరిస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
గంగుల హయాంలో అభివృద్ధి వేగం పెరిగిందంటున్న అధికారపక్షం
రాజకీయాలు,పార్టీల బలాబలాల ముచ్చట పక్కనపెడితే.. కరీంనగర్‌లో అభివృద్ది సంగతేంటన్నది ప్రస్తుతం లోకల్‌గా జనంలో నడుస్తున్న చర్చ. 2018 తరువాత… మరీ ముఖ్యంగా మంత్రయ్యాక… నియోజకవర్గానికి నిధులు తీసుకురావడంలో గంగుల కమలాకర్ స్పీడు పెంచారన్నది అధికారపక్షం మాట. మెయిన్ రోడ్లు, ఇంటర్నల్ రోడ్లు అభివృద్ధి చేశామంటోంది. స్మార్ట్ సిటి స్కీమ్‌కు ఎంపిక కావడంతో ఆ పనులూ వేగంగా జరుగుతున్నాయంటోంది.
కేంద్రం నిధులే తప్ప.. రాష్ట్రనిధులు లేవంటున్న బీజేపీ
కేంద్రం నుంచి వస్తున్న నిధులతోనే కరీంనగర్ అభివృద్ధి చెందుతోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు తీసుకరావడంలో, గంగుల ఫెయిల్ అయ్యారని విమర్శిస్తున్నారు. లోతట్టు ప్రాంతాలకు ముంపు సమస్య… విలీన ప్రాంతాల్లో జరగని అభివృద్ధి… వంటి అంశాల్ని విమర్శనాస్త్రాలుగా చేసుకుని స్థానిక ఎమ్మెల్యేపై విరుచుకుపడుతున్నారు. అధికార పార్టీ నేతలు ప్రాతినిధ్యం వహించే ఏరియాలోనే అభివృద్ధిపనులు జరుగుతున్నాయనీ… విపక్షనేతల ఏరియాల్లో అస్సలు పట్టించుకోవడంలేదనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి.
అయితే గతంలో పోలిస్తే… కరీంనగర్ అభివృద్ధి వేగవంతమైందనే వారూ లేకపోలేదు. రోడ్లతో పాటు మౌలిక వసతుల విషయంలో మెరుగుదల కనిపిస్తోందంటున్నారు.
స్మార్ట్‌సిటీ పనుల్లో అవకతవకలు జరిగాయంటున్న బీజేపీ
కరీంనగర్లో స్మార్ట్ సిటి పనుల్లో అవకతకవలు జరిగాయనీ… పనుల్లో అస్సలు నాణ్యత లేదనీ ప్రతిపక్షనేతలు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం.. ఇప్పటికీ పూర్తి కాలేదనీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కరీంనగర్‌ను అభివృద్ధిపథంలో అగ్రభాగాన నిలిపానంటున్న గంగుల
అభివృద్ధి విషయంలో అమాత్యుడు, లోకల్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వెర్షన్ మాత్రం వేరేలా ఉంది. కరీంనగర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథాన తీసుకెళ్తున్నాననీ చెబుతున్నారు. తెలంగాణ రాకముందు.. వచ్చాక అనే తేడాను గమనించాలంటున్నారు. అభివృద్ధి, సంక్షేమం ఓవైపు… సామజికవర్గం లెక్కలు ఓవైపు. మరి, వచ్చే ఎన్నికల నాటికి కరీంనగర్ గడ్డ.. ఎవరికి అడ్డాగా మారుతుందనేది చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం