Kishan Reddy: జాతీయ రహదారులతో మారుతోన్న తెలంగాణ రూపురేఖలు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడి.
జాతీయ రహదారులతో నిర్మాణంతో ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ రూపురేఖలను మారుస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిలో భాగంగా చేపడుతోన్న నిర్మాణాలు, కార్యక్రమాలను మంత్రి వెల్లడించారు. 1947 నుంచి 2014 వరకు తెలంగాణలో జాతీయ..

జాతీయ రహదారులతో నిర్మాణంతో ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ రూపురేఖలను మారుస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిలో భాగంగా చేపడుతోన్న నిర్మాణాలు, కార్యక్రమాలను మంత్రి వెల్లడించారు. 1947 నుంచి 2014 వరకు తెలంగాణలో జాతీయ రహదారుల పొడవు 2,500 కి. మీ. లు కాగా, గడచిన 8 ఏళ్లలోనే 2,500 కి. మీ.ల జాతీయ రహదారులను నిర్మించారన్నారు. దేశ అభివృద్ధిలో రహదారులు కీలకమైన పాత్రను పోషిస్తాయన్న మంత్రి… ఒక చోట నుంచి మరో చోటకు ప్రయాణం చేయాలన్నా, ఉత్పత్తి చేసే వస్తువులు, పండించే పంటలను రవాణా చేయాలన్నా రహదారులు కీలకమని తెలిపారు.
‘ఈ విషయాన్ని చాలా క్షుణ్ణంగా గమనించిన నాటి భారత ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి గారు దేశంలోని నాటి నాలుగు ప్రధాన మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్ కతా, చెన్నై నగరాలను కలుపుతూ స్వర్ణ చతుర్భుజి పేరుతో నిర్మించిన ప్రాజెక్టు, నార్త్-సౌత్, ఈస్ట్-వెస్ట్ కారిడార్‌లను కలుపుతూ శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు, పోరుబందర్ నుంచి సిల్చార్ వరకు నిర్మించిన జాతీయ రహదారుల ప్రాజెక్టులు దేశాన్ని అభివృద్ధి బాటలో పయనించేలా చేశాయని నిస్సందేహంగా చెప్పవచ్చు’ అన్నారు.
‘2004 లో అధికారంలోకి వచ్చిన యూపీఏ ప్రభుత్వం వాయ పేయి గారి ఒరవడిని కొనసాగించడంలో విఫలమైనా 2014 లో నరేంద్రమోదీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం తిరిగి అధికారం చేపట్టిన అనంతరం దేశంలో జాతీయ రహదారుల నిర్మాణం ఊపందుకుంది. దేశంలోని అన్ని జిల్లాల కేంద్రాలను కలుపుతూ, రాష్ట్రాల కేంద్రాలను కలుపుతూ, ఈశాన్య రాష్ట్రాలతో సహా నార్త్ నుంచి సౌత్ వరకు, ఈస్ట్ నుంచి సౌత్ వరకు ఉన్న అన్ని ప్రధాన పట్టణాలను కలుపుతూ మొత్తం దేశాన్ని ఏకం చేస్తూ అత్యంత వేగంగా జాతీయ రహదారులను నిర్మించడం జరుగుతోంద’ని తెలిపారు.
తెలంగాణలో భారీగా నిర్మాణాలు..
జాతీయ రహదారుల ద్వారా తెలంగాణ రూపు రేఖలు మారుతున్నాయని తెలిపిన మంత్రి.. ‘దేశానికి స్వాతంత్ర్యం లభించిన నాటి నుంచి 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్రంలో జాతీయ రహదారుల పొడవు 2,500 కి. మీ. లు ఉండగా, కేవలం 8 సంవత్సరాల కాలంలో వేల కోట్ల రూపాయలను వెచ్చించి, 100 శాతం వృద్ధితో రాష్ట్రంలో జాతీయ రహదారుల పొడవును 5,000 కి. మీ. లకు పెంచాము. రాష్ట్రంలోని ఎన్నో రహదారులను 4 వరుసలుగా, 6 వరుసలుగా విస్తరించి రాష్ట్రంలో రహదారుల సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరిచాయం. దీంతో తెలంగాణ రాష్ట్రంలో సామాజిక అభివృద్ధికి, ఆర్థికాభివృద్ధికి తలుపులు తెరుచుకున్నాయి.
రీజినల్ రింగ్ రోడ్డు కోసం రూ. 20 వేల కోట్లు..
రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం గురించి మాట్లాడిన మంత్రి కిషన్ రెడ్డి.. ‘తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు దిశల నుంచి హైదరాబాద్‌కు చేరుకునే ప్రజలు సులభంగా నగరంలోకి ప్రవేశించటానికి వీలుగా 350 కి.మీ.ల పొడవున నిర్మించనున్న రీజినల్ రింగ్ రోడ్డు నార్త్ భాగాన్ని ఇప్పటికే భారతమాల ప్రాజెక్టులో చేర్చగా, దాదాపు రూ.20,000 కోట్లతో నిర్మించనున్న సౌత్ భాగానికి సంబంధించిన డీపీఆర్ పనులు త్వరలోనే పూర్తి కానున్నాయి. ఇలా వేలాది కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్న జాతీయ రహదారుల ద్వారా తెలంగాణ రూపురేఖలను మార్చి, రాష్ట్ర ప్రజల అభివృద్ధిలో నరేంద్రమోదీ ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోంది’ అని చెప్పుకొచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..