Telangana: క్యాన్సర్‌పై న్యాయవాది సమరం.. సమాజంలో చైతన్యం తెస్తున్న జగిత్యాల వాసి..
ప్రపంచానికి ప్లాస్టిక్ పెద్ద సమస్యగా మారింది. ప్లాస్టిక్ వల్ల మనిషి ఎన్నో రోగాల బారని పడుతున్నారు. అందుకే ప్లాస్టిక్ కు నిషేధించడం అత్యవసరం. ఈ క్రమంలో క్యాన్సర్ బారిన పడిన ఓ న్యాయవాది.. తనలాగ ఎవరూ ఇబ్బంది పడకూడదంటూ గ్రామంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పిస్తున్నారు.

సమాజాన్ని పట్టిపీడిస్తున్న క్యాన్సర్ భూతాన్ని దేశం నుండి తరిమివేయాలని ఒక న్యాయవాది క్యాన్సర్‌పై సమర శంఖం పూరించారు. క్యాన్సర్‌కు కారకమైన ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ తన వంతు కృషి చేస్తున్నారు. జగిత్యాల జిల్లా గుల్లపేట గ్రామానికి చెందిన న్యాయవాది నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి క్యాన్సర్ బారిన పడి చికిత్స పొందుతున్నారు. ఈ వ్యాధి వల్ల కలిగే శారీరక, మానసిక వేదనను తన గ్రామస్తులు పడకూడదనే ఉద్దేశంతో ఆయన ప్రజలకు అవగాహన కల్పిస్తూ క్యాన్సర్ భూతంపై సమర శంఖాన్ని పూరించారు.
ప్లాస్టిక్ రహిత గ్రామం కోసం అడుగులు
క్యాన్సర్ వ్యాధికి గల కారణాలు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరిస్తూ, ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ సోకుతుందనే విషయాన్ని ఆయన నొక్కి చెబుతున్నారు. ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించేందుకు, గ్రామంలో ఎలాంటి ఫంక్షన్లు జరిగినా ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు వాడకుండా ఉండేందుకు ముందుగా గ్రామానికి సరిపడా స్టీల్ గ్లాసులు, ప్లేట్లు సమకూర్చారు. గ్రామంలో జరిగే ఎలాంటి సామూహిక కార్యక్రమాలకు అయినా వాటిని ఉచితంగా అందిస్తున్నారు. ఈ ప్రయత్నం ద్వారా ప్రజలలో మార్పు తీసుకురావడానికి ఆయన కృషి చేస్తున్నారు. అంతేకాకుండా గ్రామంలోని పాఠశాల విద్యార్థులకు కూడా ఈ విషయాన్ని వివరిస్తూ, వారి ద్వారా సమాజంలో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఆసుపత్రుల్లో ప్లాస్టిక్ నిషేధానికి విజ్ఞప్తి
జగిత్యాల పట్టణానికి చెందిన వైద్యులతో మాట్లాడి.. ఆసుపత్రుల్లో వీలైనంత వరకు ప్లాస్టిక్‌ను నిషేధించాలని ఆయన కోరారు. దీని కోసం వినతిపత్రాలు కూడా అందజేశారు. సాధారణంగా క్యాన్సర్ బారిన పడినవారు శారీరకంగా, మానసికంగా కృంగిపోయి ఇళ్లకే పరిమితం అవుతారు. కానీ మధుసూదన్ రెడ్డి మాత్రం ఈ వ్యాధితో బాధపడుతూ కూడా తనలాగా మరెవరూ బాధపడకూడదనే లక్ష్యంతో సమాజంలో చైతన్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ధైర్యాన్ని, మానవతా దృక్పథాన్ని పలువురు అభినందిస్తున్నారు. ఈ గొప్ప ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇచ్చి, క్యాన్సర్ భూతాన్ని తరిమికొట్టడానికి తమ వంతు కృషి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..




