Telangana BJP: తెలంగాణ కాషాయ పార్టీలో నయా జోష్.. సరికొత్త మైలేజ్ ఇచ్చిన బీజేపీ దీక్ష..!
తెలంగాణ భారతీయ జనతా పార్టీ నేతలంతా ఏకమయ్యారు. ఎంపీ, ఎమ్మెల్యేలు చేపట్టిన రైతు దీక్ష.. కాషాయ పార్టీలో సరికొత్త జోష్ నింపింది. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో రైతుల సమస్యలపై ఇందిరా పార్క్ లో 24 గంటల దీక్ష నిర్వహించారు.
తెలంగాణ భారతీయ జనతా పార్టీ నేతలంతా ఏకమయ్యారు. ఎంపీ, ఎమ్మెల్యేలు చేపట్టిన రైతు దీక్ష.. కాషాయ పార్టీలో సరికొత్త జోష్ నింపింది. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో రైతుల సమస్యలపై ఇందిరా పార్క్ లో 24 గంటల దీక్ష నిర్వహించారు. మహేశ్వర్ రెడ్డికి తోడుగా 24 గంటల పాటు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ దీక్ష చేశారు. మిగతా బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు దీక్షకు మద్దతు పలకగా.. రైతులు, నేతలు పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలుచేయాలంటూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో దీక్ష చేపట్టారు కమలం పార్టీ నేతలు. బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామారావు పటేల్, పాల్వాయి హరీష్ బాబు సహా బీజేపీ రాష్ట్ర నాయకులు ఇక్కడే నిద్రపోయారు. రైతులకు రుణమాఫీ అమలు చేయాలని బీజేపీ ఆందోళన చేపట్టింది. రైతులకు ఇచ్చిన హామీలను అమలుచేయాలని డిమాండ్ చేస్తోంది. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డి జమ్మూ కాశ్మీర్ ఎన్నికల బిజీలో ఉండటంతో దీక్షకు హాజరు కాలేదు. మరో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్.. భవానీ దీక్ష తీసుకోవడంతో రైతు దీక్షకు దూరంగా ఉండిపోయారు. ఎమ్మెల్యేలు రాజసింగ్, పాయల్ శంకర్ ఇతర రాష్ట్రాల పర్యటనలో ఉన్న నేపథ్యంలో రైతు దీక్షకు రాలేదు. కామారెడ్డి లో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డి దీక్షకు దూరంగా ఉన్నారు.
ఓ వైపు బీజేపీ సభ్యత్వ నమోదు సాగుతున్న వేళ రైతు దీక్ష చేపట్టడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. అధికార కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తుంటేనే, కొత్తవారు పార్టీలో సభ్యత్వాలు తీసుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తారని నేతలు భావిస్తున్నారు. ఈ మేరకు రైతు దీక్ష.. పార్టీకి ఉపయోగపడిందనే వాదన పార్టీలో వినిపిస్తోంది. రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాలపై దీక్ష ద్వారా ప్రభుత్వాన్ని కదిలించడంలో సక్సెస్ అయ్యామని చెబుతున్నారు కాషాయ పార్టీ నేతలు.
ఇక రైతు దీక్షలో తెలంగాణ బీజేపీలో కొత్త సమీకరణాలు తెరపైకి వచ్చాయి. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ చాలా యాక్టీవ్‌గా కనిపించారు. ఈ జోడీపై కమలం పార్టీ నేతల్లో ఆసక్తికరమైన చర్చ నెలకొంది. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఓ వైపు కొనసాగుతోంది. వచ్చే నెలలో పార్టీ రాష్ట్ర సారథి ఎన్నిక కూడా ఉండే అవకాశం ఉంది. ఈటల, ఏలేటి జోడిపై సరికొత్త చర్చ నడుస్తోంది. ఇన్నాళ్లు పార్టీ రాష్ట్ర సభ్యత్వ నమోదు ఇంచార్జీగానే అభయ్ పాటిల్ ను పరిగణించిన రాష్ట్ర బీజేపీ నేతలు.. రైతు దీక్షలో తెలంగాణ పార్టీ ఇంచార్జీగా ఆయనకు ఎట్టకేలకు గుర్తింపునిచ్చారు. హైడ్రాతోపాటు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు కోసం క్షేత్ర స్థాయిలో పోరాటాలకు కమలనాథులు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. తెలంగాణ లో కాషాయ పార్టీ లెక్కలు ఏ మేరకు వర్క్ అవుట్ అవుతాయో చూడాలి..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..