Dr. Dasari Prasada Rao: వైద్య రంగంలో అత్యుత్తమ సేవలకు గాను జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్న డాక్టర్ దాసరి ప్రసాదరావు
కోయంబత్తూరులో నిర్వహించిన హార్ట్ సర్జన్స్ ఆఫ్ ఇండియా 69వ వార్షిక సదస్సులో ఈ అవార్డు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ప్రముఖ గుండె శస్త్ర చికిత్సా నిపుణులు, నిమ్స్ మాజీ డైరెక్టర్ పద్మశ్రీ డాక్టర్ దాసరి ప్రసాదరావు ప్రతిష్టాత్మక జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు. గుండె, ఊపిరితిత్తులు, కాలేయం వ్యాధుల శస్త్ర చికిత్సలో అత్యుత్తమ సేవలకు గాను ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కార్డియో వాస్కులార్ సర్జన్స్ ఈ అవార్డును అందించింది. కార్డియో వాస్కులర్ థొరాసిస్ సర్జరీలో డాక్టర్ ప్రసాదరావు అందించిన అత్యుత్తమ సేవలకు గాను జీవన సాఫల్య పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ మేరకు కోయంబత్తూరులో నిర్వహించిన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సర్జన్స్ (హార్ట్ సర్జన్స్ ఆఫ్ ఇండియా) 69వ వార్షిక సదస్సులో ఈ అవార్డు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశ వ్యాప్తంగా ఉన్న వెయ్యి మందికి పైగా హార్ట్ సర్జన్ల మధ్య డాక్టర్ ప్రసాద రావుకు అవార్డును ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ జైల్ సింగ్ మెహర్వాల్, అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ సి.ఎస్.హైర్‌మత్ ఇతర ప్రముఖులు పాల్గొని డాక్టర్ ప్రసాదరావు సేవలను అభినందించారు.
ఈ సందర్భంగా డాక్టర్ ప్రసాదరావు మాట్లాడుతూ దేశంలో కుల, వర్గ, మత, ప్రాంతాలకు అతీతంగా పేద ప్రజలకు అధునాతన వైద్యం అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. ప్రైవేట్ రంగంలో అయినా, ప్రభుత్వ రంగమైనా లేదా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతోనైనా హృద్రోగ బాధితులకు నాణ్యమైన వైద్య సేవలందించేందుకు అధునాతన వైద్య, ఆరోగ్య సంస్థలను నెలకొల్పాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు. వైద్య నిపుణులలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి, ప్రజల్లో హృద్రోగం పట్ల అవగాహన పెంపొందించడానికి వైద్య విద్య, పరిశోధన శాస్త్రీయ ప్రచార వ్యవస్థను పటిష్టం చేయాలని డాక్టర్ ప్రసాద్ రావు అన్నారు.
డాక్టర్ ప్రసాద రావు కరోనరీ బైపాస్ సర్జరీ, హార్ట్ వాల్వ్ సర్జరీ, ఇతర గుండె ఆపరేషన్‌ల్లో సక్సెస్ ఫుల్ వైద్యుడిగా, పలువురి ప్రాణదాతగా అందరి మన్ననలు అందుకున్నారు. డైరెక్టర్‌గా హైదరాబాద్ నిమ్స్‌లో అధునాతన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. యాక్సిడెంట్ ఎమర్జెన్సీ హాస్పిటల్, స్పెషాలిటీ హాస్పిటల్, స్టెమ్ సెల్, బోన్ మ్యారో ట్రీట్‌మెంట్ వంటి అత్యాధునిక వైద్య సౌకర్యాలు నిమ్స్‌లో కల్పించారు. బీబీనగర్ చెరువు గట్టున నిమ్స్ యూనివర్సిటీ కోసం 200 వందల ఎకరాల స్థలం సేకరించడంలో క్రియాశీలక పాత్రను పోషించారు.




భూదాన్ భూములతో సహా, ప్రభుత్వ భూములను ఆక్రమించిన భూకబ్జాదారుల చెర నుంచి ఆ భూమిని విముక్తి చేసి.. రెవెన్యూ, పోలీసు అధికారుల సహకారంతో నిమ్స్ యూనివర్సిటీ భవనాలు కట్టించారు. అనంతరం కేంద్రం ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ను అభివృద్ధి చేసింది. కేర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, మెడిసిటీ హాస్పిటల్ వ్యవస్థాపక డైరెక్టర్ గా వైద్య సౌకర్యాల విస్తరణకు దోహదం చేశారు. వైద్య రంగంలో ప్రసాద్ రావు చేసిన సేవలకు గాను అనేక అవార్డులతో పాటు 2001లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌లో ఆయన ప్రస్తుతం ప్రధాన గుండె శస్త్ర చికిత్సకుడిగా సేవలందిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..