Maha Shivaratri: కోటప్పకొండలో మొదలైన శివరాత్రి సందడి.. ప్రభ ట్రాక్టర్‌ని స్వయంగా కొండకు చేర్చిన ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి
కోటప్ప కొండ తిరునాళ్లకు సర్వం సిద్ధమైంది. భారీ బందోస్త్ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ చెప్పారు. మరోవైపు ప్రభ ట్రాక్టర్ ను డ్రైవ్ చేస్తూ కోటప్ప కొండకు వెళ్లారు ఎమ్మెల్యే గోపిరెడ్డి.
పల్నాడు జిల్లా కోటప్పకొండలో మహా శివరాత్రి సందడి మొదలైంది. తిరునాళ్లకు ఒక్కరోజు సమయం మాత్రమే ఉండడంతో విద్యుత్ ప్రభలు కోటప్ప కొండకు ఘనంగా బయలుదేరాయి. నరసరావుపేట మండలం గురవాయిపాలెంలో హారహరో కోటయ్య, చేదుకో కోటయ్య అంటూ కొండకు బయలుదేరాయి ఎలక్ట్రిక్ ప్రభలు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ప్రభ ట్రాక్టర్ ని స్వయంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డ్రైవ్ చేస్తూ కోటప్పకొండ కొండకు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభను జాగ్రత్తగా తాళ్లతో పట్టుకొని తీసుకెళ్లారు. మార్గ మధ్యలో నియోజకవర్గ ప్రజలను పలుకరిస్తూ ప్రభ ట్రాక్టర్ ను డ్రైవ్ చేస్తున్నారు ఎమ్మెల్యే గోపిరెడ్డి.
మహాశివరాత్రి సందర్బంగా కోటప్పకొండ తిరునాళ్ళకు 2500 మంది సిబ్బంది, 20 మంది డిఎస్పీలు, 50 మంది సిఐలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఎస్పీ రవిశంకర్ రెడ్డి. తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఎలాంటి ట్రాఫిక్కి అంతరాయం కలుగకుండా కొత్త రూట్లు ఏర్పాటు చేశామన్నారు. వినుకొండ, నరసరావుపేట నుండి కొండకు వెళ్లే ఆర్టీసీ బస్సులు పెట్లూరివారి పాలెం మీదుగా.. అలాగే కొండనుండి వినుకొండ వెళ్లే బస్సులు పమిడిమర్రు, జేఎన్టీయూ మీదుగా వెళ్లాలని సూచించారు. అలాగే ప్రభలపై అశ్లీలతకు, రాజకీయంగా రెచ్చగొట్టే ప్రసంగాలకు తావులేదని చెప్పారు.
కొండ పరిసరప్రాంతాల్లో మద్యం, మత్తు పదార్థాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పార్కింగ్ కు సంబంధించి యాప్ ను క్రియేట్ చేశామన్నారు. యాప్ పార్కింగ్ విషయంలో ఉపయోగపడుతుందన్నారు. కాలినడకన కొండ మీదకు వెళ్లే వారు మెట్ల మార్గాన వెళ్లాలని.. ప్రభల నిర్వాహకులు భక్తులకు సహకరించి తిరునాళను సక్సెస్ చేయాలని కోరారు ఎస్పీ రవిశంకర్ రెడ్డి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..