Heart Attack: హడలెత్తిస్తున్న హార్ట్ ఎటాక్స్.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వెంటనే
ఇటీవలి కాలంలో గుండెపోటుతో మరణిస్తోన్న వారి సంఖ్య పెరుగుతోంది. అప్పటి వరకు ఎంతో చలాకీగా ఉన్న వారు కూడా ఉన్నట్లుండి కుప్పకూలిపోతున్నారు. ముఖ్యంగా యువతలో హార్ట్ ఎటాక్ మరణాలు కలవరపెడుతున్నాయి. తెలంగాణలో ఇటీవల ఇలాంటి ఘటనలు జరిగిన..

ఇటీవలి కాలంలో గుండెపోటుతో మరణిస్తోన్న వారి సంఖ్య పెరుగుతోంది. అప్పటి వరకు ఎంతో చలాకీగా ఉన్న వారు కూడా ఉన్నట్లుండి కుప్పకూలిపోతున్నారు. ముఖ్యంగా యువతలో హార్ట్ ఎటాక్ మరణాలు కలవరపెడుతున్నాయి. తెలంగాణలో ఇటీవల ఇలాంటి ఘటనలు జరిగిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కార్డియోపల్మనరీ రిససిటేషన్ (CPR)లో లక్షమందికి శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది.
ఈ క్రమంలోనే హార్ట్ ఎటాక్ బారిన పడిన వారిని రక్షించేందుకు ఉపయోగించే ఆటోమెటిక్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిలేటర్ (AED) పరికరాలను తెప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. వీటిని పబ్లిక్ ప్లేస్‌లో ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే 1400 పరకారలను ఆర్డర్ ఇచ్చినట్లు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. హార్ట్ ఎటాక్ బారిన పడిన వారికి ఆటోమెటిక్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిలేటర్ (ఏఈడీ) ఎంతగానో ఉపయోగపడతాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలాంటి డీఫీబ్రిలేటర్లును ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖర్జీ ఇతర దేశాల్లో మాదిరిగా హైదరాబాద్‌లోనూ పబ్లిక్ యాక్సెస్ డీఫిబ్రిలేటర్లను ఏర్పాటుచేయాలని ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్‌ను కోరారు. ఈ ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్.. మొదటి విడతలో 1400 డీఫిబ్రిలేటర్లకు ఆర్డర్ ఇచ్చినట్టు ట్వీట్ చేశారు.
ఈ పరికరాలను ప్రజలకు ఎక్కువగా ఉండే బస్టాండ్లు, విమానాశ్రయాలు, మాల్స్, రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేస్తారు. వీటిని ఉపయోగించి హృద్రోగులను ఆసుపత్రికి తీసుకెళ్లే వరకు ప్రాణాలు నిలబెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఈ పరికాల సంఖ్యను మరింత పెంచుతామని కేటీఆర్ తెలిపారు. ఈ పరికరం ఎలా ఉపయోగించాలన్న దానిపై ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..