Hyderabad: పోస్టల్ ఏజెంట్‌ని అంటూ పరిచయం చేసుకున్నాడు.. 85 లక్షల రూపాయలు కాజేశాడు..

Hyderabad: నగరంలో మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులను లక్ష్యంగా చేసుకుని అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని..

Hyderabad: పోస్టల్ ఏజెంట్‌ని అంటూ పరిచయం చేసుకున్నాడు.. 85 లక్షల రూపాయలు కాజేశాడు..
Fraud
Follow us

|

Updated on: Aug 03, 2021 | 9:01 AM

Hyderabad: నగరంలో మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులను లక్ష్యంగా చేసుకుని అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని బాగ్ అంబర్‌పేట్‌లో ఘరానా మోసం వెలుగు చూసింది. పోస్టల్ ఏజెంట్ పేరుతో వృద్ధ దంపతులను టార్గెట్ చేసి లక్షల రూపాయలు కాజేశాడు. చివరికి జరిగిన మోసాన్ని గుర్తించిన ఆ అమాయక దంపతులు.. పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..

హైదరాబాద్ బాగ్ అంబర్ పేటకు చెందిన రమేష్ – వరలక్ష్మి దంపతులు రిటైర్డ్ ఉద్యోగులు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. ఉన్నత చదువులు చదివించి విదేశాలకు పంపించారు. అక్కడే సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే వీరు తమ కొడుకు, మనవళ్ల పేరుతో చిన్న మొత్తాల పథకాల పేరుమీద డిపాజిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీరికి ఫణిభూషణ్ అనే వ్యక్తి కలిశాడు. తనను తాను ఓ పోస్టాఫిస్ ఏజెంట్ గా పరిచయం చేసుకున్నాడు. మొదట్లో నమ్మకంగా మాట్లాడడంతో గుడ్డిగా నమ్మారు. ఆ తర్వాత పథకాల పేరు చెప్పి డబ్బులు వసూలు చేసుకెళ్లేవాడు. అనుమానం రాకుండా పాస్ బుక్‌లో అమౌంట్ ఎంట్రీ చేసేవాడు. వాయిదా వచ్చిన ప్రతీసారి అమౌంట్ ఇంటికెళ్లి తీసుకోవడం.. పాస్ బుక్‌లో ఎంట్రీ అయిందంటూ చెప్పడం అలవాటుగా మార్చుకున్నాడు. ఈ తతంగం.. 2000 సంవత్సరం నుంచి జరుగుతుంది.

అయితే, కరోనా కారణంగా ఈ దంపతులకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. అలాగే ఓ ఇంటి నిర్మాణం చేపట్టడంతో చేతిలో ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. దాంతో చిన్న మొత్తాల పేరుతో జమ చేసిన మొత్తాన్ని తీసుకోవాలని భావించారు. ఇదే విషయాన్ని ఫణిభూషణ్ ను పిలిపించి అడిగారు. పైగా స్కీమ్ లకు సంబంధించి గడువు కూడా పూర్తి కావడంతో పెద్ద అమౌంట్ వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ ఫణి భూషణ్ ఇవాళ, రేపు అంటూ కబుర్లు చెప్పాడు. అనుమానం వచ్చిన వరలక్ష్మి దంపతులు నేరుగా కాచిగూడ పోస్టాఫిస్ వెళ్లి ఆరా తీశారు. పాస్ బుక్ వ్యవహారం మొత్తం ఫేక్ అని తేల్చారు. పోస్టాఫిస్ అధికారులు చెప్పిన మ్యాటర్ తో వృద్ధ దంపతులు అవాక్కయ్యారు.

పైసా పైసా కూడబెట్టి జమ చేసుకుంటే ఫణిభూషణ్ మొత్తం కాజేశాడని తెలుసుకుని లబోదిబోమన్నారు. వెంటనే విషయాన్ని కాచిగూడ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే 10లక్షల రూపాయలకు మించి చీటింగ్ వ్యవహారం కావడంతో కేసును సీసీఎస్ కు బదిలీ చేశారు. ఇది జరిగి మూడు నెలలైనా బాధితులకు న్యాయం జరగలేదు. పీఎస్ చుట్టూ తిరుగుతుంటే కరోనా అని చెబుతూ వచ్చారు పోలీసులు. ప్రస్తుతం ఫణిభూషణ్ హైదరాబాద్ నుంచి మకాం మార్చినట్టు తెలుస్తోంది. పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఫణి భూషన్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

ఫణిభూషణ్ పక్కా ప్లాన్డ్ గా ఈ మొత్తాన్ని కాజేసినట్టు స్పష్టమవుతోంది. తానేం చేసినా ఎవరూ ప్రశ్నించరని.. ఒకవేళ అడిగినా ఏదో ఒకటి చెప్పొచ్చని భావించాడు. తాను అనుకున్నది అనుకున్నట్టు చేశాడు. పైగా వాళ్ల నిర్లక్ష్యాన్ని క్యాష్ చేసుకుని రూ. 85 లక్షలు దండుకున్నాడు. చీటింగ్ వ్యవహారం తెలిశాక అడ్రస్ మార్చేశాడు ఫణి భూషణ్. ఇప్పుడు ఖాకీలకు చిక్కకుండా ఎక్కడో అడ్డా వేశాడు. పోలీసుల దర్యాప్తు ఆలస్యం అవుతుండడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫణి భూషణ్ ఇంకా చాలామందిని ఇలాగే మోసం చేసినట్టు తెలుస్తోంది. అతన్ని అరెస్ట్ చేసి తమకు న్యాయంచేయాలని వేడుకుంటున్నారు వరలక్ష్మి దంపతులు.

Also read:

Men in Blue: సెమీ ఫైనల్‌లో ఓడిన భారత్ మెన్ హాకీ టీమ్.. ఇంకా ఒలింపిక్స్‌లో పతకం పొందే ఛాన్స్

Tokyo Olympics 2020 Live: సెమి ఫైనల్ లో బెల్జియం చేతిలో 5-2 గోల్స్ తేడాతో భారత్ ఓటమి..

స్టార్ తాబేళ్ల అక్రమ రవాణా పై పోలీస్ ఉక్కుపాదం..తాబేలు ఉంటె అదృష్టం..వైరల్ వీడియో:Star Tortoises Video.