Rotavac 5d: ప్రాణాంతక డయేరియా వ్యాధి నుంచి పిల్లలకు మరింత రక్షణ.. రోటావాక్-5డి వ్యాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆమోదం

కరోనా మహమ్మారిని తరిమేస్తుందు చేస్తున్న ప్రయత్నాల్లో మరో ముందడుగు పడింది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన రోటావాక్-5డి వ్యాక్సిన్​కు ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆమోదం తెలిపింది.

Rotavac 5d: ప్రాణాంతక డయేరియా వ్యాధి నుంచి పిల్లలకు మరింత రక్షణ.. రోటావాక్-5డి వ్యాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆమోదం
Who On Bharat Biotech Rotavac 5d
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 03, 2021 | 9:03 AM

Bharat Biotech Rotavac 5d: కరోనా మహమ్మారిని తరిమేస్తుందు చేస్తున్న ప్రయత్నాల్లో మరో ముందడుగు పడింది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన రోటావాక్-5డి వ్యాక్సిన్​కు ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆమోదం తెలిపింది. పిల్లల్లో రోటా వైరస్ నుంచి రక్షణకు ఇప్పటికే రోటావాక్ వ్యాక్సిన్​ను అభివృద్ధి చేసిన సంస్థ.. వ్యాక్సిన్​ను మరింత అభివృద్ధి చేసి రోటావాక్ 5డిగా తయారుచేసింది. బఫర్ సొల్యూషన్ అవసరం లేకుండా నిల్వ చేయడం, 0.5 మి.లీ డోసేజ్​లో టీకాను తీసుకురావటం ఈ నూతన రోటావాక్-5డి ప్రత్యేకత.

ముఖ్యంగా పిల్లల్లో వ్యాపించే రోటా వైరస్ నుంచి ఈ వ్యాక్సిన్ మరింత రక్షణ కల్పించటమే కాక.. నిల్వ, సరఫరాకు తక్కువ ఖర్చు అవుతుందని భారత్ బయోటెక్ తెలిపింది. డబ్ల్యూహెచ్​ఓ ప్రీక్వాలిఫికేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ సరఫరా మరింత వేగవంతం అవుతుందని భారత్‌ బయోటెక్‌ ఆశాభావం వ్యక్తం చేసింది.

ఇదిలావుంటే, ఐదేళ్లలోపు వయసున్న చిన్న పిల్లల్లో ప్రాణాంతక డయేరియా వ్యాధికి రోటా వైరస్ కారణమవుతోంది. ఈ వైరస్‌తో ప్రపంచవ్యాప్తంగా ఏటా 2 లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. దాదాపు 20 లక్షల మంది పిల్లలు ఆసుపత్రి పాలవుతున్నారు. రోటా వైరస్ కారణంగా సంక్రమించే వ్యాధులకు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ఫస్ట్ జనరేషన్ రోటావాక్ వ్యాక్సిన్ అడ్డుకట్ట వేసింది. ఇప్పటివరకు 250 మిలియన్ డోసుల రోటావాక్ టీకాలను ప్రపంచవ్యాప్తంగా భారత్ బయోటెక్ సరఫరా చేసింది.

రోటావాక్ వ్యాక్సిన్​కు 2018 జనవరిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1986-1988 కాలంలో దిల్లీలోని ఎయిమ్స్​లో మొదటగా వైరస్ సోకిన పిల్లల నుంచి ఈ రోటా వైరస్​ను గుర్తించి వేరుచేశారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఈ వైరస్ నుంచి పిల్లలను రక్షించే సోషల్ ఇన్నోవేషన్ ప్రాజెక్టుకు భారత్ బయోటెక్ అంకురార్పణ చేసింది. 2013లో ఈ వ్యాక్సిన్​కు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్‌ను పూర్తి చేసింది. ఇందుకు సంబంధించిన డేటా.. ప్రఖ్యాత లాన్సెట్ జర్నల్​లో ప్రచురితమైంది.

రోటావాక్-5డి వ్యాక్సిన్ తక్కువ ధరలో, తక్కువ పరిమాణంలో అందుబాటులో ఉంటుందని భారత్ బయోటెక్ వెల్లడించింది. ఐదు చుక్కల 0.5 ఎంఎల్​ డోసేజ్​తో నోటి ద్వారా ఇచ్చే ఈ మోనోవాలెంట్ టీకాను నాలుగు వారాల తేడాతో మూడు డోసుల్లో చిన్నారులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఎనిమిది నెలలలోపు వయసున్న పిల్లలకు మాత్రమే ఈ వ్యాక్సిన్ ఇవ్వాలి. ఈ వ్యాక్సిన్ నిల్వ, సరఫరాకు తక్కువ మొత్తంలో వనురులు అవసరమవుతాయి. తద్వారా ఎక్కువ ప్రాంతాలకు, ప్రజలకు వేగంగా చేరువ కానుందని భారత్ బయోటెక్ తెలిపింది. ఈ వ్యాక్సిన్ల అభివృద్ధి.. భారత్ బయోటెక్ 30 ఏళ్ల కృషి అని భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్లా అన్నారు. నిర్లక్ష్యానికి గురైన లక్షల మందిలో.. ప్రాణాంతకమయ్యే వ్యాధులను అరికట్టేందుకు భారత్ బయోటెక్ పరిశోధనలు కొనసాగిస్తుందని ఆమె పేర్కొన్నారు.

Read Also…  నాసా మిషనంత ఖర్చుతో తెరకెక్కుతోన్న ప్రభాస్ సినిమా..!కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్..:Prabhas movie Video.