Telangana Rains: గుజరాత్‌లో కుండపోత వర్షాలు, వరదలు… తెలంగాణకూ భారీ వర్షసూచన..!
దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇప్పటికే గుజరాత్ రాష్ట్రం వర్షాలు - వరదలతో అతలాకుతలమవగా.. తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు తెలంగాణకు 'యెల్లో' అలర్ట్ జారీ చేసింది. సెప్టెంబర్ 3 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇప్పటికే గుజరాత్ రాష్ట్రం వర్షాలు – వరదలతో అతలాకుతలమవగా.. తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు తెలంగాణకు ‘యెల్లో’ అలర్ట్ జారీ చేసింది. సెప్టెంబర్ 3 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా శుక్రవారం కుంభవృష్టి కురుస్తుందని అంచనా వేసింది. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు కూడా ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాల కారణంగా వరదలు సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయి.
గుజరాత్‌ను వీడని వాన కష్టాలు
భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన గుజరాత్ రాష్ట్రాన్ని వాన కష్టాలు ఇంకా వీడలేదు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాలు నీట ముంపులో ఉండగా, రాష్ట్రానికి వాతావరణ శాఖ ‘ఆరెంజ్’ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, జామ్‌నగర్, పోర్‌బందర్, ద్వారకా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాజ్‌కోట్, జునాగఢ్, మోర్బీ జిల్లాలకు ‘యెల్లో’ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
అరేబియా సముద్రంలో ఏర్పడ్డ అల్పపీడం తీవ్ర వాయుగుండంగా బలపడి కచ్, సౌరాష్ట్ర తీరాలకు భారీ వర్షాలను తీసుకురాగా, ఆ వాయుగుండం మరింత బలపడి తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తుఫానుగా మారితే, దాన్ని ‘ఆస్నా’ (Asna)గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా భుజ్‌కు ఆగ్నేయ దిశలో కేంద్రీకృతమై ఉంది. ఒకవేళ ఇది తుఫానుగా రూపాంతరం చెందితే.. అరుదైన వాతావరణ ఘటనగా నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే అల్పపీడనాలు బలపడి వాయుగుండంగా, ఆపై తుఫాన్లుగా మారేది సముద్రంలోనే. అయితే ప్రస్తుత వాయుగుండం సముద్రానికి, భూమికి మధ్యలో ఉందని, ఈ పరిస్థితుల్లో బలపడడం అరుదుగా జరిగే ప్రక్రియ అని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.
గుజరాత్‌పై పగబట్టినట్టుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం సహాయచర్యలపై దృష్టి సారించింది. ఇప్పటికే NDRF బృందాలతోపాటు ఆర్మీ, నేవీ, కోస్ట్‌గార్డ్ బలగాలను రంగంలోకి దించిన ప్రభుత్వం.. వరద ముంపునకు గురైన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తోంది. అలాగే వరద నీటిలో మునిగిన గ్రామాలు, పట్టణాల్లోని కాలనీలకు ఆహారం, నీరు పంపిణీ చేస్తోంది. Mi-17 హెలీకాప్టర్ల ద్వారా నిత్యావసర వస్తువులు, ఔషధాలు అందజేస్తోంది. గాంధీనగర్‌లోని ‘స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్’ చేరుకున్న గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ రాష్ట్రంలో జరుగుతున్న సహాయ, పునరావాస చర్యలపై సమీక్ష నిర్వహించారు.