Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వానలు.. పొంగిపొర్లుతున్న వాగుులు, వంకలు.. ఇవాళ, రేపు పలుచోట్ల భారీ వర్షాలు..!
Weather Report: తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు కదలికలు చురుగ్గా ఉండటంతో ఇవాళ, రేపు ఏపీ, తెంగాణలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు కదలికలు చురుగ్గా ఉండటంతో ఇవాళ, రేపు ఏపీ, తెంగాణలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న కూడా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిశాయి. మరోవైపు, బంగాళాఖాతంలో ఒడిశా తీరం వద్ద ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడింది. తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య 5.8 కిలోమీటర్ల ఎత్తున గాలులు అస్థిరంగా కదులుతున్నాయని వాతావరణశాఖ తెలిపింది.
బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. తెలంగాణలో చురుగ్గా కదులుతున్న రుతుపవనాలతో వర్షాలు పడుతున్నాయి. అయితే, కుమురంభీం జిల్లా సిర్పూరులో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు, ఉమ్మడి వరంగల్, సిరిసిల్ల జిల్లాల్లో జోరుగా వాన కురుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అర్ధరాత్రి నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కరీమాబాద్, సాకరిశికుంట, ఏకశిలానగర్‌లో భారీ వర్షానికి ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట, సిరిసిల్ల, తంగళ్లపల్లి, వీర్నపల్లి, ఇల్లంతకుంట మండలాల్లో వర్షం కురుస్తోంది. అటు నల్లగొండ జిల్లాలో ఆదివారం రాత్రి కురిసిన వానకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో నిడమనూరు మండలం ముప్పారం వాగు దగ్గర వరద ఉధృతికి తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో సమీపంలోని మూడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
అటు ఏపీలో వానలు దంచుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో శనివారం నుంచి వర్షం తెరపివ్వకుండా కురుస్తూనే ఉంది. ఈదురు గాలులతో కూడిన వర్షం జల్లులుగా పడుతోంది. ఈదురు గాలులతో గుంటూరు జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పంట పొలాల్లో నిలిచిన నీటిని రైతులు బయటకు పంపేందుకు ప్రయత్నాలు చేపట్టారు. కాలువలు సైతం వర్షపు నీటితో నిండుగా ప్రవహిస్తున్నాయి. సత్తెనపల్లిలో భారీ వర్షం కురిసింది. దీంతో వెన్నాదేవి వద్ద బసవమ్మ వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. భారీ వర్షపు నీటి ఉదృతికి రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో సత్తెనపల్లి – పిడుగురాళ్ల రోడ్డు మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. కొండమోడు మీదుగా ట్రాఫిక్ ను నరసరావుపేట వైపు మళ్లించారు పోలీసులు.
Read Also… Most Eligible Bachelor: అఖిల్ సినిమాలో ఆ స్టార్ కపుల్.. స్పెషల్ అట్రాక్షన్ గా ఆ హీరో ఆయన భార్య..