AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్ టు విజయనగరం.. ఉగ్ర కుట్రతో ఉలిక్కిపడిన తెలుగు రాష్ట్రాలు.. దర్యాప్తు ముమ్మరం

ఉగ్ర కుట్రతో హైదరాబాద్‌ ఉలిక్కిపడింది. తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్‌ పోలీసులు, NIA అధికారుల చాకచక్యంతో భాగ్యనగరానికి ముప్పు తప్పింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో స్లీపర్ సెల్స్‌ యాక్టివ్‌ అయ్యాయి. విజయనగరంలో పేలుడు పదార్థాలను కొనుగోలు చేసి హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర చేసిన ఉగ్రవాదుల ఆటకట్టించారు పోలీసులు.

హైదరాబాద్ టు విజయనగరం.. ఉగ్ర కుట్రతో ఉలిక్కిపడిన తెలుగు రాష్ట్రాలు.. దర్యాప్తు ముమ్మరం
Hyderabad Bomb Plot Foiled
Shaik Madar Saheb
|

Updated on: May 19, 2025 | 10:43 AM

Share

పహల్గామ్‌ దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని ఉగ్రవాదుల డెన్‌లను భారత సైనికులను నేలమట్టం చేశారు. ఈ ఆపరేషన్‌లో 100మంది ఉగ్రవాదులు హతమయ్యారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో స్లీపర్ సెల్స్‌ యాక్టివ్‌ అయ్యాయి. సౌదీ అరేబియా ఐసిస్‌ నెట్ వర్క్‌ నుంచి ఆదేశాలు అందుకున్న సిరాజ్, సమీర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా పేలుళ్లకు కుట్రపన్నారు. విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్, హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ సమీర్‌ కలిసి నగరంలో భారీ పేలుళ్లకు ఫ్లాన్ చేశారు. ఇందు కోసం సిరాజ్ విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేశారు. ఉగ్రవాదుల పన్నాగాన్ని పసిగిట్టిన తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఉగ్రవాదుల నుంచి పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నిరోజులుగా రెక్కీ నిర్వహిస్తున్నారు. బ్లాస్ట్‌కు ఫండింగ్ చేసిందెవరు? ఎక్కడెక్కడ పేలుళ్లకు ప్లాన్ చేశారన్న విషయాలపై ఆరా తీస్తున్నారు.

హైదరాబాద్‌లో భారీ పేలుళ్లకు కుట్రపన్నిన కేసులో విచారణ వేగవంతమైంది. విజయనగరానికి చెందిన సిరాజ్‌తోపాటు, హైదరాబాద్‌లో అరెస్టు చేసిన సమీర్‌ కస్టడీ కోసం కోర్టులో ఇవాళ పిటిషన్‌ వేస్తున్నారు. ఇద్దరినీ కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు బయటకు వస్తాయంటున్నారు పోలీసులు.. ఇద్దరి వెనకున్న సూత్రధారులు ఎవరన్న కోణంలో ఫోకస్‌ చేస్తున్నారు. మరికొందరి పాత్రపై ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్‌లో పేలుళ్ల కోసం ముడి పదార్థాలకు.. నిధులు ఎవరు సమకూర్చారన్న అనే అంశంపైనా దృష్టిపెట్టి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

కాగా.. హైదరాబాద్‌లో గతంలోనూ దిల్ సుఖ్‌నగర్, గోకుల్‌ చాట్ పేలుళ్లు జరిగాయి. ఇప్పుడు సిరాజ్‌, సమీర్ పేలుళ్లకు కుట్ర పన్నారు. దీంతో ఉగ్ర కుట్రను పోలీసులు తీవ్రంగా పరిగణించారు. పేలుళ్ల కుట్రలో ఇంకెంతమంది ఉన్నారన్న కోణంలో పోలీసులు, NIA అధికారులు దర్యాప్తు చేస్తోన్నారు.

తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం చాలా పటిష్టంగా, అలర్ట్‌గా ఉందన్నారు పోలీసులు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎలాంటి దుష్ప్రచారాలను నమ్మవద్దన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు పోలీసులు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..