Agnipath: అగ్నిపథ్ కు కాంగ్రెస్ హయాంలోనే బీజం పడింది.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి షాకింగ్ కామెంట్
త్రివిధ దళాల్లో సైనిక నియామకం కోసం తీసుకువచ్చిన అగ్నిపథ్(Agnipath) పథకం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి ఉద్ఘాటించారు. అగ్నిపథ్ ద్వారా మంచే జరుగుతుందన్న కేంద్రమంత్రి.. కాంగ్రెస్ హయాంలోనే...
త్రివిధ దళాల్లో సైనిక నియామకం కోసం తీసుకువచ్చిన అగ్నిపథ్(Agnipath) పథకం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి ఉద్ఘాటించారు. అగ్నిపథ్ ద్వారా మంచే జరుగుతుందన్న కేంద్రమంత్రి.. కాంగ్రెస్ హయాంలోనే 1999లో అగ్నిపథ్ కు బీజం పడిందని వెల్లడించారు. అగ్నివీర్ లో ఒకసారి పని చేస్తే ఆత్మ విశ్వాసం ఏర్పడుతుందని కిషన్ రెడ్డి(Union Minister kishan Reddy) చెప్పారు. సైన్యంలో పనిచేయాలన్న ఆశతో చాలా మంది యువత ఉన్నారని.. వారందరూ అగ్నిపథ్ లో చేరొచ్చని వెల్లడించారు. సర్వీస్ నుంచి వచ్చాక అగ్నివీరులకు అనేక విద్య , ఉద్యోగాల్లో అవకాశాలు ఉంటాయని వివరించారు. ప్రతి ఒక్కరు అగ్నిపథ్ పథకానికి సహకరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. దీనిపై అనవసరంగా రాజకీయం చేయొద్దని పిలుపునిచ్చారు. మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. రేపు ఉదయం 5.30గంలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో యోగా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
మైసూర్ లో ప్రధాని నరేంద్ర మోదీ, కోయంబత్తూరులో కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ యోగా దినోత్సవంలో పాల్గొంటారు. హైదరాబాద్ లో అత్యంత వైభవంగా యోగా దినోత్సవం నిర్వహిస్తున్నాం. ఆరోగ్యం కోసం యోగా చేయాలి. 30శాతం ఆదాయాన్ని ప్రజలు వైద్యం కోసం ఖర్చు చేస్తున్నారు. యోగాను ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి. పాఠశాలలో యోగాను తప్పనిసరి చేయాలి.
– కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి
మరోవైపు.. అగ్నిపథ్ పధకాన్ని విరమించుకోవాలని దేశవ్యాప్తంగా నిరసనలు తారస్థాయికి చేరుకోగా కేంద్ర ప్రభుత్వం మాత్రం అగ్నిపథ్ పధకం విషయంలో వెనక్కి తగ్గేలా కనిపించట్లేదు. అగ్నిపథ్‌లో భాగంగా ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అగ్నివీర్ టెక్నికల్‌కు 10వ తరగతి ఉత్తీర్ణత. అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్‌కు 8వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి. అలాగే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 17.5 నుంచి 23 సంవత్సరాలు ఉండాలి. ఇదిలా ఉండగా.. రేపు నేవీ అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదలవుతుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి