Hyderabad: ప్రాణం తీసిన ట్రాఫిక్ చలాన్లు.. కట్టలేనన్నా పోలీసులు వదలలేదంటూ ఆత్మహత్య చేసుకున్న హమాలి కార్మికుడు..
ఇష్టంగా కొనుకున్న బైక్‌పై ఉన్న పెండింగ్ చలాన్లు కట్టలేక ఎల్లయ్య అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన..
అప్పు చేసి మరీ ఎంతో ఇష్టంగా కొనుకున్న బైక్‌పై ఉన్న పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు కట్టలేక ఎల్లయ్య అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్లే.. నల్లగొండ జిల్లా నుంచి జీవనాధారం వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చిన ఎల్లయ్య(52).. హమాలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. సైదాబాద్‌లోని ఐఎస్ సదన్ డివిజన్ నీలం రాజశేఖర్‌రెడ్డి నగర్ కాలనీలో భార్య, పిల్లలతో కలిసి నివాసం ఉంటున్న ఎల్లయ్య అప్పు తీసుకుని ఓ బైక్ కొనుక్కున్నాడు. గత కొంతకాలంగా ఆ బైక్‌పై తిరుగుతున్నాడు. అయితే ఈ క్రమంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించందుకు తన బైక్‌పై అనేక చలాన్లు పడ్డాయి. అయినా మల్లయ్య వాటిని చెల్లించకుండా బైక్ నడుపుతూనే ఉన్నాడు. ఇటీవల ఎల్లయ్య బైక్‌పై వెళుతుండగా పోలీసులు ఆపారు. బైక్‌పై ఉన్న ఛలాన్లను చెక్ చేశారు. చాలా చలాన్లు పెండింగ్‌లో ఉండటంతో మీర్‌పేట్ ట్రాఫిక్ పోలీసులు బైక్‌ను సీజ్ చేశారు.
దీంతో ఎల్లయ్య ‘అప్పుచేసి బండి కొనుగోలు చేశానని, చలాన్లు కట్టలేను’ అంటూ ట్రాఫిక్ పోలీసులను వేడుకుని ప్రాధేయపడ్డాడు. అప్పటికే చలాన్లు ఎక్కువగా ఉండటంతో పోలీసులు బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అప్పు చేసి మరీ ఇష్టంగా కొనుకున్న బైక్‌ను పోలీసులు సీజ్ చేయడంతో ఎల్లయ్య తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఆ క్రమంలో ఇంటికి వెళ్లగానే సుసైడ్ లెటర్ రాసి, విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఓవైసీ ఆస్పత్రికి తరలించినా.. అప్పటికే ప్రాణం పోవడంతో ప్రయోజనం లేకపోయింది. దీనిపై కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించగా.. వారు ఎల్లయ్య ఇంటికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంట్లో సూసైడ్ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ‘మీర్‌పేట్ ట్రాఫిక్ ఎస్ఐ గణేష్ వేధింపులే తన ఆత్మహత్యకు కారణమ’ని ఎల్లయ్య అందులో తెలిపాడు.
ఇంకా ‘రూ.10 వేలు కడితే బండి ఇస్తానని ఎస్ఐ గణేష్ అన్నాడని, కూలీ పనులు చేసుకునే తాను అంత కట్టలేనని చెప్పినా వినిపించుకోలేద’ని లెటర్‌లో ఎల్లయ్య పేర్కొన్నాడు. ‘నా చావుకు గణేష్‌నే కారణమని, అతడిపై చర్యలు తీసుకోవాల’ని కోరాడు. సూసైడ్ లేఖ ఆధారంగా గణేష్‌పై సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. చావుకు కారణమైన అధికారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎల్లయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.
Traffic Challans have become a death penalty for people in Telangana.
Unable to pay Challan of ₹10,000, a person Yellaiah ended his life in Hyderabad.
BRS Govt & traffic police need to have humane approach instead of recklessly slapping fines on common man. pic.twitter.com/lncDDqG3UN
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) March 8, 2023
కాగా, చలాన్లు చెల్లించలేక ఓ సామాన్యుడు ఆత్మహత్య చేసుకోవడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ట్రాఫిక్ చలాన్లు డెత్ పెనాల్టీగా మారాయని.. పదివేల చలాన్లు చెల్లించలేక ఎల్లయ్య అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. సామాన్యుడి పై ప్రతాపం చూపించే బదులు బిఆర్ఎస్ ప్రభుత్వం, ట్రాఫిక్ పోలీసులు మానవత్వంగా వ్యవహరించాలని ట్వీట్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..