Telangana: సోషల్ మీడియాలో ఓవర్ చేస్తే రంగంలోకి SMASH.. విదేశాల్లో ఉన్నా వదలరు
ఫోన్ ఉండి.. దాంట్లో నెట్ ఉంటే చాలు.. కొందరు పోటుగాళ్లలా ఫీలవుతున్నారు. కనీసం సభ్యత లేకుండా పోస్టులు, కామెంట్లతో నెట్టింట రచ్చ చేస్తున్నారు. వారికి బ్రేకులు వేసేందుకు తెలంగాణ పోలీసులు యాక్షన్‌లోకి దిగారు.
ఇటీవల సోషల్ మీడియాలో సామాన్య జనం నుంచి.. సెలబ్రిటీలు, రాజకీయ నేతలపై ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్న వారి సంఖ్య ఎక్కువ అయింది. దీన్ని కట్టడం చేసే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాంటి వారిని ఉపేక్షించమని స్పష్టం చేశారు. సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఇతరులను రెచ్చగొట్టడంతోపాటు వర్గాల మధ్య విభేదాలు సైతం సృష్టించి అలజడి రేపేందుకు కొన్ని విద్రోహ శక్తులు చేస్తున్న ప్రయత్నాలను ఎప్పటికప్పుడు పోలీసులు పసిగడుతున్నారు.
సోషల్ మీడియా పోస్టులపై నిఘా ఉంచేందుకు ఒక ప్రత్యేక విభాగాన్ని పోలీసులు ఏర్పాటు చేశారు.. సోషల్ మీడియా యాక్షన్స్ స్క్వాడ్ ఆఫ్ హైదరాబాద్ పేరుతో SMASH పేరుతో ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో పదేపదే విద్వేషపూరిత కామెంట్లు చేస్తున్న వారి పట్ల ఈ బృందం నిఘా ఉంచనుంది.. ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా అభ్యంతకర పోస్టులు పెడుతూ విద్వేషాలు రెచ్చగొడుతున్న 20 మందిపై ఈ ఏడాది పోలీసులు కేసులు నమోదు చేశారు. గతంలో ఎన్సీఈఆర్బి డేటా ప్రకారం అన్ని మెట్రో సిటీస్‌తో పోలిస్తే హైదరాబాదులోనే సోషల్ మీడియా ద్వారా విద్వేషాలు రెచ్చగొడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. 2022లో 94 కేసులు పోలీసులు నమోదు చేశారు.
ఇటీవల ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు అనేక రకాలుగా సోషల్ మీడియాలో ఇష్టానుసార రీతిలో కామెంట్లు పెట్టడంతో పాటు వాటిని తమ అనుచర వర్గానితో వైరల్ చేయించడం ఆనవాయితీగా మారింది. ఇకమీదట అలాంటి చర్యలకు పాల్పడితే ఎంత దూరంలో ఉన్నా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్ పెట్రోలింగ్ ద్వారా సోషల్ మీడియా పై నిరంతర నిఘా కొనసాగుతూనే ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కేవలం కేసులకే పరిమితం కాకుండా వాటిపై కఠిన చర్యలకు సైతం పోలీసులు దిగుతున్నారు. సైబర్ పెట్రోలింగ్ ద్వారా నిఘా ఉంచి అభ్యంతర పోస్టులు పెడుతున్న వారి పట్ల పోలీసులు సుమోటాగా కేసులు నమోదులు చేస్తున్నారు.
గతంలో జరిగిన కొన్ని కేసుల్లో పోలీసులు నిందితులను అరెస్టు చేసి విచారించిన క్రమంలో కేవలం క్షణికావేశంలోనే తాము అలా పోస్టులు పెట్టామని పోలీసులకు చెబుతున్నారు. ఇకమీదట అలాంటి వారిని సైతం ఉపేక్షించమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..