తెలంగాణ రచ్చలేపుతున్న ‘పథకాల’ పాలిటిక్స్.. హామీలపై అధికార, ప్రతిపక్షం మధ్య వార్..

ఎంత రచ్చ జరిగితే అంత పబ్లిసిటీ. పాజిటివా.. నెగటివా.. అనేది తరువాత సంగతి. ముందైతే చర్చ జరగాలి. నెగటివ్‌ ప్రచారం జరిగితే పాజిటివ్‌గా మార్చుకోవచ్చు. పాజిటివ్‌గా చర్చ జరిగితే దూసుకెళ్లొచ్చు. ఆరు గ్యారెంటీలపై తమ స్ట్రాటజీ బాగానే వర్కౌట్‌ అవుతోందని కాంగ్రెస్‌ నమ్ముతుంటే.. ఆ వ్యూహాన్ని దెబ్బతీసేలా స్పెషల్‌ స్ట్రాటజీతో వెళ్తోంది బీఆర్ఎస్. ముఖ్యంగా మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు..

తెలంగాణ రచ్చలేపుతున్న 'పథకాల' పాలిటిక్స్..  హామీలపై అధికార, ప్రతిపక్షం మధ్య వార్..
Bjp - Congress - BRS
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 20, 2023 | 9:08 PM

హైదరాబాద్, సెప్టెంబర్ 20:  ఎంత రచ్చ జరిగితే అంత పబ్లిసిటీ. పాజిటివా.. నెగటివా.. అనేది తరువాత సంగతి. ముందైతే చర్చ జరగాలి. నెగటివ్‌ ప్రచారం జరిగితే పాజిటివ్‌గా మార్చుకోవచ్చు. పాజిటివ్‌గా చర్చ జరిగితే దూసుకెళ్లొచ్చు. ఆరు గ్యారెంటీలపై తమ స్ట్రాటజీ బాగానే వర్కౌట్‌ అవుతోందని కాంగ్రెస్‌ నమ్ముతుంటే.. ఆ వ్యూహాన్ని దెబ్బతీసేలా స్పెషల్‌ స్ట్రాటజీతో వెళ్తోంది బీఆర్ఎస్. ముఖ్యంగా మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు.. ఎక్కడికి వెళ్లినా ఆరు గ్యారెంటీలపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. కేటీఆర్ అయితే ఆరు గ్యారెంటీలపై పంచ్‌లు వేస్తున్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే కరెంట్ కష్టాలు, తాగునీటి కష్టాలు, రైతులకు ఎరువుల కష్టాలతో పాటు రైతుబంధు, దళితబంధు వంటి పథకాలకు ఇక పుల్‌స్టాపేనంటూ చెబుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏడాదికో సీఎం మారడం పక్కా గ్యారెంటీ అంటూ తన స్టైల్‌లో విరుచుకుపడ్డారు.

ఆరు గ్యారెంటీలు, ఆరు నెలలకో ముఖ్యమంత్రి అంటూ కొత్త నినాదాన్ని క్రియేట్ చేశారు మంత్రి హరీష్‌రావు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు నెలలు కర్ఫ్యూ, పరిశ్రమలకు ఆరు నెలలు హాలిడే, రైతులకు ఆరు గంటల కరెంట్‌ అంటూ సెటైర్లు వేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే బెంగళూరును రెండో రాజధానిగా మార్చి.. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీకి వయా బెంగళూరుకు వెళ్తారని కామెంట్ చేశారు. బీఆర్ఎస్‌ అమలు చేస్తున్న పథకాలు ప్రజలను ఆర్థికంగా నిలబెట్టేవిగా ఉంటే.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ప్రజలను బానిసలుగా మార్చేవిగా ఉన్నాయన్న కామెంట్లు బీఆర్‌ఎస్ నుంచి బలంగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అమలవ్వాలంటే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ సరిపోదనేది బీఆర్ఎస్ వాదన. కాంగ్రెస్ ప్రకటించిన ఒక్కో హామీకి ఎంతెంత బడ్జెట్ అవుతుందో లెక్కలు చెబుతున్నారు. 4వేల పెన్షన్ ఇవ్వడానికి 39 వేల కోట్లు, ఇంటికి 5 లక్షల స్కీం కోసం 55 వేల కోట్లు, దళితబంధు, మూడు కార్పొరేషన్ల కోసం 45 వేల కోట్లు, ఎస్టీల కోసం 28 వేల కోట్లు, తండాలకు ప్రత్యేక నిధుల కోసం 1250 కోట్లు, రైతు భరోసా, కౌలు రైతులు, కూలీల కోసం 69 వేల కోట్లు, మహిళా సంక్షేమం కోసం 39 వేల కోట్లు, ఉద్యోగ కల్పన, వారి వేతనాల కోసం 6 వేల కోట్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ కోసం 7500 కోట్లు అవుతాయని తేల్చారు. ప్రస్తుతం తెలంగాణ బడ్జెట్ 2 లక్షల 77వేల కోట్లు. ఆరు గ్యారెంటీలకు కావాల్సింది 2 లక్షల 90వేల కోట్లు అని లెక్కలేసి మరీ చెబుతున్నారు. మరి ఆరు హామీలకే బడ్జెట్‌ సరిపోకపోతే.. ఇక పాలన ఎలా సాగుతుందనేది అధికార పార్టీ ప్రశ్న.

కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారెంటీలు ఇచ్చి వాటిని అమలు చేయలేక చతికిలబడిందని బీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ కూడా చెబుతోంది. అయితే, ఎవరెన్ని విమర్శలు చేసినా.. ఇచ్చిన హామీలకు కట్టుబడి వంద రోజుల్లో అమలు చేసి చూపిస్తామంటోంది కాంగ్రెస్ పార్టీ. కర్నాటకలో హామీలను అమలు చేయలేదంటున్న వాళ్లు.. ఒక్కసారి ఆ రాష్ట్రానికి వస్తే పథకాలు నడుస్తున్నాయో లేదో చూపిస్తామని సవాల్‌ చేస్తున్నారు. పైగా ఆరు గ్యారెంటీలను రాష్ట్ర బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకునే ఇచ్చామని బలంగా చెబుతున్నారు. దేశంలోనే ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణకు.. ఆరు గ్యారెంటీలను అమలు చేయడం పెద్ద కష్టమేం కాదంటోంది కాంగ్రెస్. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయని హామీలను తెలంగాణలోనే ఎందుకు ప్రస్తావిస్తున్నారన్న దానికి కూడా కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్. ఇంటింటికి ప్రణాళికలు మారుతున్నట్టే.. రాష్ట్రాల అవసరాలను బట్టి తేడాలు ఉంటాయని కాంగ్రెస్ సమాధానం ఇస్తోంది. నిజానికి కర్నాటక, తెలంగాణకు ఇచ్చిన గ్యారెంటీలలో మహిళలకు ఆర్థిక సాయం, బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కామన్‌గా ఉన్నవే. రైతులకు పెట్టుబడి సాయం, పెన్షన్‌ పెంపు మాత్రం తెలంగాణ పరిస్థితులకు తగ్గుట్టుగా డిజైన్ చేశారు. ఇదే విషయాన్ని మున్ముందు మరింత బలంగా చెప్పేందుకు ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్.

ఒకప్పుడు మితిమీరిన అప్పులు చేయకూడదన్న స్పృహ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండేవి. అందుకే, హామీల అమలులో కాంప్రమైజ్ అయ్యేవారు. కాని, దేశంలో ఇప్పుడా పరిస్థితి లేదు. ఎంత అప్పు చేసైనా సరే.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే అనుకుంటున్నాయి పార్టీలు. తమిళనాడు, కర్నాటక, పంజాబ్, ఏపీ రాష్ట్రాలే తెలంగాణ కాంగ్రెస్‌కు ఉదాహరణగా కనిపిస్తున్నాయి. టీడీపీ కూడా అప్పు చేస్తే తప్పేముందన్న ఆలోచనతోనే భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో హామీలు ఇచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతోంది. తెలంగాణకు వచ్చే ఆదాయం, ఏటా ఉండే అప్పుల పరిమితిని చూసే ఆరు గ్యారెంటీలు ఇచ్చారని చెబుతున్నారు. పైగా కర్నాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం నిధుల కోసం కష్టపడుతున్నా సరే.. హామీలను అమలు చేస్తోంది. అయినా సరే.. ఇన్ని హామీలు అమలు చేయడం సాధ్యమేనా అని ప్రశ్నిస్తున్న వారికి కాంగ్రెస్‌ ఒక్కటే సమాధానం చెబుతోంది. పథకాలు అమలు చేయడం సాధ్యం కాదని విమర్శించిన రాష్ట్రాల్లో.. కిందామీదా పడైనా సరే ప్రామిస్‌ను నెరవేరుస్తున్నాయి. దాన్నే పర్ఫెక్ట్‌ ప్లాన్‌తో అమలు చేస్తామంటోంది కాంగ్రెస్. ఇప్పటికైతే.. దేనికి ఎంత ఖర్చవుతుందనే లెక్కలు చెప్పకపోయినా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని లెక్కగట్టిన తరువాతే హామీలు ఇచ్చామని చెబుతోంది. అధికారం కోసం రెండుసార్లు ప్రయత్నించి విఫలమైన కాంగ్రెస్‌.. ఈసారి చావోరేవో తేల్చుకోవాలనుకుంటోంది. అందులో భాగంగానే ఈ ఆరు గ్యారెంటీలు అని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. అలాగే, మూడోసారి అధికారం నిలబెట్టుకోవడం కోసం కూడా బీఆర్‌ఎస్ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇప్పటికైతే ఉన్న పథకాలనే మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..