Telangana Lockdown: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలి: డీజీపీ
Telangana Lockdown: కరోనా కట్టడి నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 30వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే..
Telangana Lockdown: కరోనా కట్టడి నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 30వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రంలో లాక్‌డౌన్ మరింత కఠినంగా అమలు చేయాలని పోలీసు అధికారులకు డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలవుతున్న తీరును జిల్లాల వారీగా ప్రతీరోజూ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షిస్తున్నారని తెలియజేశారు. మే 30వ తేదీ అనంతరం తిరిగి లాక్ డౌన్‌ను పొడగించేందుకు వీలులేకుండా ప్రస్తుత లాక్ డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని తెలిపారు.
ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు లాక్ డౌన్ సడలింపు ఉన్నప్పటికీ 8 గంటల తర్వాతే ప్రజలు నిత్యావసరాలకై వస్తున్నందున మార్కెట్లు, దుకాణాల వద్ద పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడటం కనిపిస్తోందని.. దీనిని నివారించేందుకు ఉదయం 6 గంటల నుండే తమ అవసరాలకై వెళ్లే విధంగా ప్రజలను చైతన్యపర్చాలని సూచించారు. అలాగే 10 గంటల తర్వాత కూడా వీధుల్లో పెద్ద ఎత్తున జనసంచారం ఉంటోందని, దీనిని నివారించేందుకై తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఉదయం 9:45 గంటల నుండే పోలీసు కమిషనర్లు, ఎస్.పీ.లు, డీసీపీ, డీఎస్పీ, ఏసీపీ స్థాయి ఉన్నతాధికారులందరూ కచ్చితంగా క్షేత్రస్థాయిలో ఉండి పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.
కరోనా వ్యాప్తికి అవకాశాలు ఉన్న ఫిష్ మార్కెట్లు, వెజిటేబుల్ మార్కెట్లలో జన సామర్థ్యాన్ని తగ్గించేందుకు మార్కెటింగ్, మున్సిపల్, సంబంధిత శాఖల సమన్వయంతో చర్యలు చేపట్టాలని తెలియజేశారు. ఉదయం 10 గంటల అనంతరం అనుమతిలేని వాహనాలు సంచరిస్తే వాటిని వెంటనే తాత్కాలికంగా సీజ్ చేయాలని అన్నారు. కేవలం ప్రధాన రహదారుల్లోనే లాక్ డౌన్ అమలు చేయడమే కాకుండా కాలనీలు, అంతర్గత రహదారుల్లోనూ కఠినంగా అమలు చేయాలని పేర్కొన్నారు.
కాగా, రాష్ట్రంలో పెట్రోల్ బంక్ లను పూర్తిస్థాయిలో తెరిచేందుకు ప్రభుత్వం అనుమతులు జారీచేసిందని, అయితే లాక్ డౌన్ అనంతరం కేవలం అనుమతించిన వాహనాలు, అంబులెన్స్ లు, ఆక్సిజన్ రవాణా లాంటి వాహనాలు మాత్రమే పెట్రోల్ బంకులకు అనుమతించాలని స్పష్టం చేశారు.
Also Read:
ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ టైమింగ్ మారిందా.? ఇందులో నిజమెంత.!
ఈ ఫోటోలో ఎరను వేటాడేందుకు సింహం దాగి ఉంది.. ఎక్కడ ఉందో గుర్తుపట్టండి చూద్దాం.!