Telangana: మామూలు స్కెచ్ కాదు.. సీఎం ఫండ్‌కే ఎసరు పెట్టారు.. 28 ఆసుపత్రుల బాగోతం ఇదే..

తెలంగాణలో పలు హాస్పిటల్స్ నకిలీ బిల్లులు సృష్టించి సీఎం రిలీఫ్ ఫండ్‌ను కాజేసేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా తెలంగాణ సీఐడీ పోలీసులు మొత్తం 28 హాస్పిటల్స్ పై కేసులు నమోదు చేశారు.

Telangana: మామూలు స్కెచ్ కాదు.. సీఎం ఫండ్‌కే ఎసరు పెట్టారు.. 28 ఆసుపత్రుల బాగోతం ఇదే..
Scam
Follow us
Vijay Saatha

| Edited By: Shaik Madar Saheb

Updated on: Sep 02, 2024 | 6:55 PM

తెలంగాణలో పలు హాస్పిటల్స్ నకిలీ బిల్లులు సృష్టించి సీఎం రిలీఫ్ ఫండ్‌ను కాజేసేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా తెలంగాణ సీఐడీ పోలీసులు మొత్తం 28 హాస్పిటల్స్ పై కేసులు నమోదు చేశారు. గత కొన్ని నెలలుగా తప్పుడు బిల్లులు సృష్టించి, ఫోటో ఎడిటింగ్ ద్వారా నకిలీ బిల్లులు తయారుచేసి సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు కాజేసేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన తెలంగాణ సీఐడీ అధికారులు ఈ వ్యవహారంలో ఇద్దరిని అరెస్టు చేశారు. నల్గొండ జిల్లాకు చెందిన ఒక ఆర్ఎంపీ డాక్టర్ తో పాటు ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో సూపర్వైజర్ గా పని చేస్తున్న సైదిరెడ్డి అనే వ్యక్తిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. నవీన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో సూపర్వైజర్ గా పని చేస్తున్న సైదిరెడ్డి, ఆర్ఎంపీ డాక్టర్ గిరి ఇద్దరు కలిసి తప్పుడు బిల్లులు సృష్టించారు. తమకు తెలిసిన ఎడిటింగ్ ద్వారా కంప్యూటర్‌లో బిల్లులు తయారుచేసి వాటి ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ కాజేయాలని ప్రయత్నించారు.

కంప్యూటర్ల ద్వారా ఎడిటింగ్ చేయడంతో పాటు వివిధ హాస్పిటల్స్ కి చెందిన డాక్టర్ల రబ్బర్ స్టాంపులను తయారు చేశారు. హాస్పిటల్ స్టాంపులను సైతం తయారు చేయించి ఒక ఫేక్ లేటర్ హెడ్‌ను క్రియేట్ చేశారు. నల్గొండ జిల్లాకు చెందిన అమ్మ హాస్పిటల్ తో పాటు నవీన హాస్పిటల్స్ పేరుతో మొత్తం 19 నకిలీ అప్లికేషన్లను సీఎంఆర్ఎఫ్ కు పంపించినట్లు సిఐడి దర్యాప్తులో బయటపడింది. ఇప్పటివరకు సిఐడి అధికారులు మొత్తం 28 హాస్పిటల్స్ పై ఆరు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాదులో ముఖ్యంగా రాచకొండ ప్రాంతంలో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ పేరుతో లక్షల రూపాయల విలువచేసే నకిలీ బిల్లులను సిఎంఆర్ఎఫ్ కు పంపించారు. వీటి ద్వారా జరగని చికిత్సను జరిగినట్లు చూపించడంతోపాటు పలువురు పేషంట్ల బిల్స్ ను ఫేక్ చేసి ఎడిటింగ్ చేసి మార్చేస్తున్నారు. ఈ తరహాలో మిగతా హాస్పిటల్స్ పైన కూడా చర్యలు తీసుకునేందుకు సిఐడి అధికారులు సిద్ధమయ్యారు. నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ లో ఉన్న పలు హాస్పిటల్ లో పనిచేసే వ్యక్తులు ఈ తరహా ఫ్రాడ్ కి పాల్పడినట్టు సిఐడి అధికారులు గుర్తించారు.

ప్రస్తుతం నల్గొండ నుంచి వచ్చిన ఫేక్ బిల్స్ ను పరిశీలించిన సిఐడి అధికారులు ఇద్దరినీ అరెస్టు చేశారు. మిగతా హాస్పిటల్ కి సంబంధించిన బిల్స్ ని సైతం తయారుచేసిన విధానంపై సిఐడి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక ఖమ్మంలోనే దాదాపు పదికి పైగా హాస్పిటల్స్ నకిలీ బిల్లులు సృష్టించినట్లు అధికారుల దర్యాప్తులో బయటపడింది. మొత్తంగా దీనిపై విచారణను వేగవంతం చేసిన సీఐడీ.. ఆగస్టు 23న మొత్తం 28 హాస్పిటల్స్ పైన కేసులు నమోదు చేసింది. త్వరలోనే దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు.