Telangana: వేగంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు.. మరో మూడు రోజులు వానలే వానలు
తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు(Southwest Monsoon) చురుగ్గా కదులుతున్నాయి. క్రమంగా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. రాబోయే రెండు, మూడు రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు నైరుతి విస్తరించే అవకాశం...
తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు(Southwest Monsoon) చురుగ్గా కదులుతున్నాయి. క్రమంగా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. రాబోయే రెండు, మూడు రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు నైరుతి విస్తరించే అవకాశం ఉందని హైదరాబాద్(Hyderabad) వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా, ఏలూరు జిల్లాల వరకు వీటి ప్రభావం కనిపిస్తోందని తెలిపారు. రాయలసీమలోనూ ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. కాగా..బుధవారం ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. నెల్లూరు(Nellore) జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తిలో అధికంగా 63.5 మి.మీ, శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జి మండలం విజయరాంపురంలో 63, పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలంలో 42. మి.మీ వర్షపాతం నమోదైంది. ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడం తో పలువురు ఇబ్బందులు పడ్డారు. అయితే.. భానుడి భగభగల నుంచి ఉపశమనం కలిగింది.
రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. అత్యధిక ఉష్ణోగ్రతలు, వేడి, ఉక్కపోత నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం దొరికింది. అంతేగాక, నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాలతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులు కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి