సిగాచిలో పేలుడుకు కారణమేంటి..? NDMA అధ్యయనం.. ఇంకా లభించని 8 మంది ఆచూకీ..
సిగాచి పేలుడు ఘటనపై ఓ వైపు రెస్క్యూ ఆపరేషన్... మరో వైపు NDMA ఎంక్వైరీ కొనసాగుతోంది. భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ విషాదంలో మరణించిన వారి సంఖ్య 44కు చేరింది. రోజులు గడుస్తున్నా 8మంది ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళనలు ఎక్కువయ్యాయి.

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమను నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ బృందం పరిశీలించింది. సుమారు నాలుగు గంటల పాటు NDMA అధికారులు పరిశ్రమలో విచారణ జరిపారు.పేలుడులో కూలిన భవనం, దెబ్బతిన్న పరికరాలు పరిశీలించారు. సేఫ్టీకి సంబంధించి ఫ్యాక్టరీలో పాటిస్తున్న ప్రమాణాల గురించి కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడే సమావేశం నిర్వహించి నిర్వహణ లోపాలపై సిగాచీ యాజమాన్యంపై ఎన్‌డీఎంఏ ప్రశ్నలు సంధించింది. ఈ అధ్యయనంలో గుర్తించిన అంశాలపై నివేదిక రెడీ చేసి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు ఇవ్వనుంది.
మరోవైపు పాశమైలారంలోని ఈ ఘటనలో మరో 8 మంది కార్మికుల ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. వారి కోసం అగ్నిమాపక, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, పోలీసు బృందాలు శిథిలాల కింద గాలింపు చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. గల్లంతైన తమ వారి కోసం బాధితుల కుటుంబాలు సహాయ కేంద్రం దగ్గర ఆందోళనతో ఎదురుచూస్తున్నాయి. ఐలాలోని హెల్ప్ డెస్క్ దగ్గర అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ బాధితుల కుటుంబాలతో మాట్లాడారు.
సిగాచి పరిశ్రమలో పేలుడు దుర్ఘటన జరిగి 9 రోజులవున్నా.. తమ వారి ఆచూకీ ఇంకా దొరకడం లేదని గల్లంతైన కార్మికుల కుటుంబీకులు గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో బాధితులను పరామర్శించి.. ఆఖరి వ్యక్తి జాడ తెలిసే వరకు సహాయక చర్యలు కొనసాగుతాయని ఆడిషినల్ కలెక్టర్ చంద్రశేఖర్ హామీ ఇచ్చారు.
భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ విషాదంలో మరణించిన వారి సంఖ్య 44కు చేరింది. సంగారెడ్డిలోని ధ్రువ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అఖలేశ్వర్, బీరంగూడ సమీపంలోని పనీషియా మెరిడియన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆరిఫ్ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పేలుడు తర్వాత ఆసుపత్రుల్లో చేరిన వారిలో గత వారం రోజుల్లో ఇప్పటివరకు 8 మంది మరణించారు. ప్రస్తుతం మరో 16 మంది కార్మికులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
