Samatha Kumbh 2024: భగవద్ రామానుజ, 108 దివ్యదేశాల ద్వితీయ బ్రహ్మోత్సవాలు.. గరుడసేవల వివరాలు
మధ్యాహ్నం వేదికపై పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారుల నృత్యాలు భక్తులను అలరించాయి. సమతాకుంభ్ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈక్వాలిటీ కప్ పేరుతో నిర్వహించిన క్రికెట్ టోర్నీలో గెలుపొందిన జట్ల సభ్యులకు త్రిదండి చినజీయర్ స్వామివారు మంగళాశాసనాలు అందించారు. విన్నర్, రన్నరప్‌గా నిలిచిన జట్లకు స్వయంగా బహుమతులు అందజేశారు..
హైదరాబాద్ శివారు ముచ్చింతల్ (Muchintal)లోని శ్రీరామనగరంలో సమతాకుంభ్-2024 భగవద్ రామానుజ, 108 దివ్యదేశాల ద్వితీయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఐదో రోజు శనివారం ఉదయం త్రిదండి చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో అర్చకస్వాములు, ఋత్వికులు, వేద విద్యార్థులు కలిసి ధాన్యం చేశారు. స్వామివారు అష్టాక్షరీ లఘుజప విధానాన్ని అనుగ్రహించారు. ధాన్యం తర్వాత ఆరాధన, సేవాకాలం, శాత్తుముఱై పూర్తి చేసుకుని, వేద విన్నపాలతో యాగ కార్యక్రమం జరిపించారు. త్రిదండి చినజీయర్ స్వామివారు భక్తులందరికీ స్వయంగా తీర్థాన్ని అనుగ్రహించారు. రెండు, మూడు గంటలైనా సరే ఎంతో ఓపికగా చినజీయర్ స్వామివారు భక్తులందరికీ తీర్థాన్ని ఇచ్చారు. నిత్యపూర్ణాహుతి కార్యక్రమం తర్వాత బలిహరణ, వేదవిన్నపాలు పూర్తికాగానే వేదికపై 18 దివ్యదేశాధీశులకు తిరుమంజన సేవ జరిపించారు.
మధ్యాహ్నం వేదికపై పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారుల నృత్యాలు భక్తులను అలరించాయి. సమతాకుంభ్ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈక్వాలిటీ కప్ పేరుతో నిర్వహించిన క్రికెట్ టోర్నీలో గెలుపొందిన జట్ల సభ్యులకు త్రిదండి చినజీయర్ స్వామివారు మంగళాశాసనాలు అందించారు. విన్నర్, రన్నరప్‌గా నిలిచిన జట్లకు స్వయంగా బహుమతులు అందజేశారు. ఈరోజు విశేష కార్యక్రమాల్లో భాగంగా గ్లోబల్ రామాయణ క్విజ్ కాంటెస్ట్‌ను నిర్వహించారు. చినజీయర్ స్వామివారితో పాటు పలువురు స్వాములు భక్తులను రామాయణంపై ప్రశ్నలు అడిగారు.
సాయంత్రం త్రిదండి చినజీయర్ స్వామితో పాటు భక్తులంతా సామూహికంగా విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. ఆ తర్వాత రామయణ క్విజ్‌లో ఫైనల్ చేరిన వారికి బజర్ రౌండ్ నిర్వహించి విజేతలకు స్వామివారు బహుమతులు అందించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు, సామాజిక వేత్త సోనూసూద్ సతీమణి సమతామూర్తిని దర్శించుకున్నారు, 108 దివ్యదేశాలను సందర్శించారు. ఆ తర్వాత వేదికపై ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సాకేత రామచంద్రప్రభువుకు గజవాహన సేవ, సాకేతవల్లీ అమ్మవారికి హంసవాహన సేవ జరిపించారు. ఈ సేవల తర్వాత 18 దివ్యదేశాధీశులకు 18 గరుడ సేవలు వైభవంగా జరిగాయి.
18 దివ్యదేశాధీశులకు ఈరోజు జరిగిన గరుడసేవల వివరాలు:
1.నత్తం
- పెరుమాళ్-విజయాసన పెరుమాళ్
- అమ్మవారు- వరగుణమంగై నాచ్చియార్, భూదేవి
2.పెరుంకుళం
- పెరుమాళ్-వేగండవాణన్
- అమ్మవారు- కుళందదవల్లీ తాయార్
3.తిరుక్కురుంగుడి
- పెరుమాళ్-వైష్ణవ నమ్బి స్వామి
- అమ్మవారు- కురుంగుడివల్లి, భూదేవి
4.తిరుక్కోళూర్
- పెరుమాళ్-వైత్తమానిధి పెరుమాళ్
- అమ్మవారు-కుముదవల్లి, కోళూర్‌వల్లి, పల్లవనాయకి, భూదేవి
5.కాంచీపురం
- పెరుమాళ్-వరదరాజస్వామి
- అమ్మవారు-పెరుందేవి తాయార్, భూదేవి
6.తిరువణ్ పరిశారం
- పెరుమాళ్-శ్రీవాసవక్ష పెరుమాళ్
- అమ్మవారు- కమలవల్లీ తాయార్, భూదేవి
7.తిరుక్కాట్కరై
- పెరుమాళ్-కాట్కరై అప్పన్, వామనుడు
- అమ్మవారు- పెరుంశెల్వ నాయకి, భూదేవి
8.తిరుమూళక్కళం
- పెరుమాళ్-శ్రీసూక్తినాథుడు, సిద్ధినాథ, అప్పన్
- అమ్మవారు- మధురవేణి, భూదేవి
9.పులియూర్
- పెరుమాళ్-ఆశ్చర్యోపకారక పెరుమాళ్, మాయప్పిరాన్
- అమ్మవారు- కనకలతా, భూదేవి
10. శెంగనూర్
- పెరుమాళ్-దేవదేవ పెరుమాళ్, ఇమైయవరప్పన్
- అమ్మవారు- శెంకమలవల్లి, భూదేవి
11.తిరునావాయ్
- పెరుమాళ్-సుందరదేవ స్వామి, నావాయ్ ముకుందన్
- అమ్మవారు- మలర్‌మంగై తాయార్, భూదేవి
12.తిరువల్లవాళ
- పెరుమాళ్-కోలప్పిరాన్, సుందర ఉపకారక స్వామి
- అమ్మవారు- వాత్సల్యనాయకి, భూదేవి
13.తిరువణ్‌వండూర్
- పెరుమాళ్-పాంబణైయప్పన్, కమలనాథ్ పెరుమాళ్
- అమ్మవారు- కమలవల్లి, భూదేవి
14.తిరుమోగూర్
- పెరుమాళ్-కాలమేఘ పెరుమాళ్
- అమ్మవారు- మోహనవల్లి, మేఘవల్లి, తిరుమోగూర్ వల్లి
15.విత్తువక్కోడు
- పెరుమాళ్-అభయప్రదస్వామి, అభయప్రదన్
- అమ్మవారు- విత్తువక్కోడు వల్లీ తాయార్, పద్మాసనివల్లీ తాయార్
16.తిరుక్కడిత్తానం
- పెరుమాళ్-అద్భుత నారాయణ పెరుమాళ్
- అమ్మవారు-కల్పకవల్లీ తాయార్
17.తిరువారన్‌విళై
- పెరుమాళ్-ఉపకారక వామన స్వామి, తిరుక్కురళప్పన్
- అమ్మవారు-పద్మాసనవల్లీ తాయార్, భూదేవి
18.తిరువహీంద్రపురం
- పెరుమాళ్-దేవనాథ పెరుమాళ్
- అమ్మవారు-హేమాంబుజవల్లి, వైకుంఠవల్లి, భూదేవి
18 గరుడ వాహనాలను యాగశాలకు తీసుకొచ్చి పూర్ణాహుతి జరిపించారు. అనంతరం శాత్తుముఱై, తీర్థ, ప్రసాద గోష్ఠి పూర్తయ్యాక గరుడ వాహనాలను తిరిగి ఆలయాలకు చేర్చారు.