Telangana: డబుల్ బెడ్ రూమ్ వెరిఫికేషన్ కోసం అంటూ వచ్చిన అధికారులు.. తీరా చూస్తే..!
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. డబ్బు కోసం సొంత వారిని సైతం నిండా దోచేస్తున్నారు. తాజాగా ఈజీమనీకి అలవాటు పడిన ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి సమీప బంధువునే దోచుకున్నారు. ఓ వృద్దురాలిని డబుల్ బెడ్ రూం వెరిఫికేషన్ అధికారులం అంటూ నమ్మించి, ఆమెను కత్తులతో బెదిరించి ఒంటి మీద నగలు లాక్కెళ్ళారు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. డబ్బు కోసం సొంత వారిని సైతం నిండా దోచేస్తున్నారు. తాజాగా ఈజీమనీకి అలవాటు పడిన ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి సమీప బంధువునే దోచుకున్నారు. ఓ వృద్దురాలిని డబుల్ బెడ్ రూం వెరిఫికేషన్ అధికారులం అంటూ నమ్మించి, ఆమెను కత్తులతో బెదిరించి ఒంటి మీద నగలు లాక్కెళ్ళారు. కేసు నమోదు చేసిన పోలీసులు, సాంకేతిక ఆధారలతో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను మల్కాజిగిరి డిసిపి పద్మజ వెల్లడించారు. ఉప్పల్ పరిధిలోని హనుమసాయి నగర్ కు చెందిన రమాదేవి (62) అనే వృద్దురాలు నివాసముంటోంది. ఫిబ్రవరి 19వ తేదీన సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఒక యువకుడు వచ్చి తలుపు తట్టాడు. తాము డబుల్ బెడ్ రూమ్ వెరిఫికేషన్ అధికారులమని నమ్మబలికాడు. మీకు డబుల్ బెడ్ రూమ్ సాంక్షన్ అయ్యిందని, పేపర్లు ఇవ్వడానికి అధికారులు వచ్చారని మాయమాటలు చెప్పాడు. ఇదంతా నిజమని నమ్మిన రమాదేవిని కారులో ఎక్కించుకుని ఉప్పల్ భగాయత్ కు తీసుకువెళ్లారు.
హైదరాబాద్ నగర శివారు ప్రాంతానికి వృద్దురాలిని తీసుకెళ్లిన దుండగులు, కత్తులతో బెదిరించి ఆమె మెడలోని మూడున్నర తులాల బంగారు నగలు దోచుకుని పారిపోయారు. దీంతో ఆమె స్థానికులతో కలిసి ఉప్పల్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారలతో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలి విచారణ జరపడంతో అసలు విషయం బయటపడింది. కాగా వృద్దురాలికి సమీప బంధువైన సాత్విక్ అనే యువకుడు అనిల్ , సాయికుమార్ అనే మరో ఇద్దరు యువకులతో కలిసి నగల కోసం ఈ డ్రామా ఆడినట్లు డీసీపీ పద్మజ తెలిపారు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం కారుని రెంట్‌కు తీసుకుని వారితో దోపిడి చేసినట్లు డీసీపీ తెలిపారు.
బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీ టీవీ ఫుటేజీ, కారు నంబర్ ఆధారంగా దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసినట్ల డీసీపీ వెల్లడించారు. వారి నుండి 14 లక్షల రూపాయల విలువ చేసే మూడున్నర తులాల బంగారు నగలు, రెండు సెల్ ఫోన్లు, ఒక కారు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్ కు తరలించినట్లు డీసీపీ పద్మజ తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…