Hyderabad: గణేశ్ మండపాలు పెడుతున్నారా…? ఈ రూల్స్ తెలుసుకోండి..
వినాయకి చవితి పండుగ వచ్చేస్తుంది. ఇప్పుడే కుర్రాళ్లు చందాలు వసూలు చేయడం షురూ చేశారు. మండపాలు ఏర్పాటు చేసేందుకు ప్లేసులు సెలెక్ట్ చేశారు. ఈ సారి ఏ విగ్రహం పెడదాం అనే విషయంపై కాలనీవాసుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు.
వినాయక చవితి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఓ ఎమోషన్. ప్రతి వాడలోనూ, ప్రతి వీధిలోనూ విగ్రహాలను ప్రతిష్టించి.. నవరాత్రుళ్లు నిర్వహిస్తారు. తొమ్మిది రోజుల పాటు ఘనంగా పూజలు చేసి.. గణపతిని ఘనంగా గంగమ్మ ఒడికి చేర్చుతారు. ముఖ్యంగా యువత ఈ ఉత్సవాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 7న వినాయక చవితి. ఆ తర్వాత ఎవరు వీలును బట్టి.. వారు 3వ రోజు, 5వ రోజు, 9వ రోజు, 11వ రోజు ఇలా నిమజ్జనాలు చేస్తూ ఉంటారు. అయితే హైదరాబాద్ సిటీలో గణేశ్ మండపాలు ఏర్పాటు చేయాలంటే.. కొన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ప్రమాదాలు జరగకుండా… పోలీసులు కొన్ని కండీషన్స్ పెడతారు. అవి పాటిస్తూ.. భక్తిశ్రద్దల మధ్య.. గణేశ్ నవరాత్రుళ్లు చేసుకోవాల్సి ఉంటుంది.
మండపాల ఏర్పాటుకు రూల్స్ ఇవే
- వివాదాస్పద ప్రదేశాల్లో వినాయకుడి మండపాలు ఏర్పాటు చేసేందుకు అనుమతులు లేవు .
- సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం రాత్రి 10 నుంచి తెల్లారి 6 గంటల వరకు లౌడ్‌స్పీకర్ల బ్యాన్ ఉంటుంది.
- గణేష్ మండపాలు ఏర్పాటు చేసేందుకు ఎంచుకున్న ప్రభుత్వ, ప్రవేటు స్థల యజమానుల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా తీసుకోవాలి.
- మండపాల వద్ద సంబంధిత వాలంటీర్లు బ్యాడ్జీలు ధరించాల్సి ఉంటుంది.
- పందిళ్లలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అగ్నిమాపక పరికరాలు పెట్టుకోవాలి.
- మండపాలకు అవసరమైన విద్యుత్తు ఏర్పాటుకు విద్యుత్తు శాఖ నుంచి పర్మిషన్ తీసుకోవాలి.
- సెల్లార్లు, కాంప్లెక్స్‌ల్లో విగ్రహాల ఊరేగింపులకు పోలీసుల పర్మిషన్ తప్పనిసరి.
- మండపాల ఏర్పాటుకు అనుమతుల కోసం.. సబంధించిన డాక్యుమెంట్స్ జత చేసి ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6వ తేదీ లోపు పోలీసుల వెబ్‌సైట్‌లో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది.
- సంబంధిత పత్రాలు పరిశీలించి.. రివ్యూ చేసి స్థానిక పోలీసులు అనుమతులపై నిర్ణయం తీసుకుంటారు
- ఇక విగ్రహాలు ఊరేగింపు తేదీ, రూట్, సమయం వివరాలను ముందుగానే పోలీసులకు తెలియజేయాలి.
- ఏవైనా సందేహాలుంటే సంబంధిత పోలీస్‌స్టేషన్, లేదా 8712665785 నెంబర్‌ను సంప్రదించాలి.
మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి