Hyderabad: మొండెం లేని తల దొరికిన కేసును చేధించిన పోలీసులు.. ఆమె ఓ నర్సు.. చంపింది ఎవరంటే..?
మలక్‌పేట మూసీ సమీపంలో మొండెంలేని తల దొరికిన కేసును పోలీసులు చేధించారు. మృతురాలు ఓనర్సు అని.. ఆమెను డబ్బు విషయంలో నిందితుడు చంద్రమౌళి హత్య చేసినట్లు తేల్చారు. ఇంట్లోనే అనురాధను నిందితుడు హత్య చేసినట్లు తెలిపారు.

ఆరు రోజుల క్రితం మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగలగూడలో నల్లటి ప్లాస్టిక్ కవరులో మొండెం లేని తలను గుర్తించారు పోలీసులు. కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. మృతురాలి సోదరి, బావ గుర్తించడంతో ఆ డెడ్ బాడీ.. కేర్ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేసే ఎర్రం అనురాధదిగా నిర్ధారించారు. అనురాధ వడ్డీ వ్యాపారం నిర్వహించేవారనీ.. ఆ డబ్బు విషయంలో తలెత్తిన గొడవల వల్లే హత్యకు గురైనట్లు ఆమె కుటుంబసభ్యులు కూడా చెబుతున్నారు. సీసీ టీవీ ఫుటేజీ ద్వారా అక్కడ తలను పడేసిన హంతకుడు చంద్రమౌళిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లోనే అనురాధను హత్య చేశాడు నిందితుడు చంద్రమౌళి. డెడ్‌బాడీని చికెన్ కొట్టే కత్తితో ముక్కలు ముక్కలు చేశాడు. తల మూసీ నదిలో పడేసి.. మిగిలిన శరీర భాగాలను బకెట్లో కుక్కి ఫ్రిజ్‌లో దాచి పెట్టాడు.
చైతన్యపురిలోని చంద్రమౌళి ఇంట్లో దాచిపెట్టిన మృతురాలి శరీర భాగాలను పోలీసులు, క్లూస్ టీమ్ స్వాధీనం చేసుకుని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. నిందితుణ్ని ఇంటికి తీసుకొచ్చి సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేశారు పోలీసులు. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. చంద్రమౌళి ఇంట్లోనే అనురాధ రెంట్‌కు ఉంటున్నట్లు తెలిసింది. ఆన్‌లైన్ ట్రేడింగ్‌తో అప్పుల పాలైన ఇంటి ఓనర్ చంద్రమౌళి.. అనురాధ దగ్గర రూ. 18లక్షలు అప్పు తీసుకున్నాడు. డబ్బులు తిరిగి అడగడంతోనే అనురాధను హత్య చేశాడు. ఆమె బ్రతికే ఉన్నట్లు నమ్మించదానికి మృతురాలి సెల్‌ఫోన్‌ను చంద్రమోహన్ వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. ఇంట్లో దుర్వాసన రాకుండా కర్పూరం ఇతర రసాయనాలు వినియోగించాడని వెల్లడించారు. హత్య చేసిన తర్వాత శరీర భాగాలను మాయం చేసేందుకు పలు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు చూశాడని వివరించారు. పక్కా ప్లాన్ ప్రకారమే అనురాధను హత్యచేసి.. మృతదేహాన్ని మాయం చేసే ప్రయత్నం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం
