Hyderabad: మద్యానికి బానిసై ఉరేసుకొన్న కానిస్టేబుల్‌.. ఎక్కడంటే?

తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల పోలీస్ కానిస్టేబుల్స్ గత రెండు, మూడు నెలలుగా వరుస ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు గల కారణాలు వేర్వేరైనప్పటికీ ఈ వరుస ఆత్మహత్యను ప్రస్తుతం పోలీస్ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో కానిస్టేబుల్ మద్యానికి బానిపై ఇంట్లో ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు..

Hyderabad: మద్యానికి బానిసై ఉరేసుకొన్న కానిస్టేబుల్‌.. ఎక్కడంటే?
Police Constable
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 02, 2025 | 10:56 AM

హైదరాబాద్‌, జనవరి 2: మద్యానికి బానిసైన ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఆస్మాన్‌ఘడ్‌ ఎస్టీ బస్తీలో చోటుచేసుకుంది. గత కొంత కాలంగా కానిస్టేబుల్ మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు తోటి సిబ్బంది తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2014 బ్యాచ్‌కు చెందిన జాతావత్‌ కిరణ్‌ (36) హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో గత కొంత కాలంగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఆస్మాన్‌ఘడ్‌ ఎస్టీ బస్తీలో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. కిరణ్‌కి భార్య, పదేళ్ల లోపు వయసున్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరు నివాసం ఉంటున్న ఇంటిపై పోర్షన్‌లో అతడి సోదరుడు నివాసం ఉంటున్నారు కింది పోర్షన్‌లో కిరణ్‌ కుటుంబ సభ్యులు నివాసముంటున్నారు. కొంత కాలంగా మద్యానికి బానిసైన కిరణ్‌.. నిత్యం భార్యపిల్లలను వేధిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో కిరణ్‌ 4 రోజులు సెలవు తీసుకుని ఇంటికి వెళ్లాడు.

అప్పట్నుంచి ఇంట్లో ఉన్న భార్య పిల్లలను ఇంటి నుంచి బయటికి పంపించి తలుపులు వేసుకొని తాగుతుండేవాడు. బుధవారం నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఇంటి వద్దనే ఉన్న కిరణ్‌ మరోమారు మద్యం సేవించి, భార్య పిల్లలతో గొడవ పడ్డాడు. అనంతరం వారిని బయటికి పంపించి తలుపులు వేసుకున్నాడు. దీంతో రోజు మాదిరిగానే అతడి భార్య, పిల్లలు ఇరుగు, పొరుగు ఇళ్లలో మధ్యాహ్నం 3 గంటల వరకు ఉండి.. భోజనం చేసేందుకని ఇంటికి వచ్చారు. తలుపులు ఎంత కొట్టినా లోపలి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కిటికిలో నుంచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. దీంతో బోరుమన్న అతడి భార్య, సోదరుడికి ఫోన్‌చేసి హుటాహుటీన కిరణ్‌ను యశోద ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్లు నిర్ధారించారు.

మలక్‌పేట ఇన్‌స్పెక్టర్ పి నరేష్ మాట్లాడుతూ.. కానిస్టేబుల్ ఇంటికి వెళ్లి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి పోస్ట్‌మార్టం కోసం తరలించాం. భారతీయ న్యాయ సనాహిత (బిఎన్‌ఎస్) సెక్షన్ 108 కింద సూసైడ్ కేసు నమోదు చేశాం. మృతుడు గత కొంతకాలంగా డిప్రెషన్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. కానిస్టేబుల్ మనోవేదనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని అన్నారు. కాగా గత రెండు నెలలుగా తెలంగాణలోని పలు రాష్ట్రాల్లో పలువురు కానిస్టేబుళ్లు వరుస ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.