Hyderabad: ప్రాణాల మీదకు తెస్తున్న చైనా మాంజా.. దారం చుట్టుకుని ఆసుపత్రి పాలైన దంపతులు..!

గాలిపటం మాంజా మిగులుస్తున్న విషాదాలు అన్నీఇన్నీ కావు.. మనుషుల ప్రాణాలను సైతం మాంజా దారం బలి తీసుకుంటోంది. ఇటీవల జరిగిన వేర్వేరు ఘటనల్లో.. చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకు గాయపడ్డారు. మూడ్రోజుల వ్యవధిలోనే ఏడుగురి ప్రాణాల మీదకు వచ్చింది.. గాలి పటాలు ఎగరేసిన తర్వాత అలానే వదిలేస్తుండడంతో రోడ్లపై వెళ్లే వారి మెడలకు చుట్టుకుని ప్రమాదాలు జరుగుతున్నాయి.

Hyderabad: ప్రాణాల మీదకు తెస్తున్న చైనా మాంజా.. దారం చుట్టుకుని ఆసుపత్రి పాలైన దంపతులు..!
China Manja
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 02, 2025 | 10:36 AM

చైనా మాంజా ప్రాణాల మీదికి తెస్తోంది. నిషేధించినా విక్రయాలు కొనసాగుతుండంతో ప్రాణాలు తీసేంత పని చేస్తోంది. తాజాగా.. రంగారెడ్డి జిల్లా నందిగామలో బైక్‌పై వెళ్తున్న దంపతుల మెడకు చైనా మాంజా చుట్టుకోవడంతో తీవ్రగాయాలు కావడం కలకలం రేపుతోంది.

చైనా మాంజాతో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో పలువురి ప్రాణాలు తీసిన చైనా మాంజా.. తాజాగా మరో ఇద్దర్ని ప్రమాదంలో పడేసింది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలోని నందిగామ దగ్గర దంపతులు బైక్‌పై వెళ్తుండగా.. చైనా మాంజా సడెన్‌గా మెడకు చుట్టుకుని భర్త గొంతుకు తీవ్ర గాయమైంది. ఆ మాంజాను తీసేందుకు ప్రయత్నించగా భార్య చేతులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. దాంతో.. ఇరువురిని ఆస్పత్రికి తరలించారు స్థానికులు.

ఇక.. పతంగులు ఎగరేసేందుకు చైనా మాంజా వాడవద్దని.. విక్రయించవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నా.. స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పిస్తున్నా విక్రయాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఫలితంగా సంక్రాంతి సమయంలో చైనా మాంజా కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల పాలవుతున్నారు. అయినా.. మార్కెట్‌లో చైనా మాంజా విక్రయానికి అడ్డుకట్ట పడడంలేదు. పోలీసులు సోదాలు చేసి కేసులు నమోదు చేస్తున్నా.. రహస్యంగా విక్రయాలు కొనసాగిస్తున్నారు కొందరు వ్యాపారులు.

మరో ఘటనలో చైనా మాంజా తెగి ఒకరి మెడకు చుట్టుకోవడంతో ఆసుపత్రి పాలైయ్యాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుర్రాయిగూడెంకు చెందిన ఏరువాక కృష్ణారావు బైక్‌పై వెళ్తుండగా.. రామవరం దగ్గర మెడకు మాంజా దారం తగిలింది. దీంతో అక్కడికక్కడే కిందపడిపోయాడు.. గొంతు తెగిపోయి తీవ్ర గాయమైంది.. దీంతో తీవ్ర రక్తస్రావమైంది. కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

మూడు రోజుల క్రితం జనగామ జిల్లాలో నలుగురు వాహనదారుల ప్రాణాలకు ముప్పుతెచ్చిందీ చైనా మాంజా. జనగామ – సిద్దిపేట ప్రధాన రహదారిపై వెళ్తుండగా.. గాలిపటం తెగి మాంజా మెడకు చుట్టుకుంది. వాహనదారులు గుర్తించి బాధితులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడ్డవారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.

అయితే.. గతంలో చైనా మాంజాను ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు సీక్రెట్‌గా తీసుకొచ్చి విక్రయించగా, కొన్నాళ్ల నుంచి లోకల్‌లోనే తయారు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదిలావుంటే.. ఈ చైనా మాంజాను నైలాన్‌, సింథటిక్‌ దారానికి గాజు, ప్లాస్టిక్‌ పొడి పూసి తయారు చేస్తుంటారు. ఇది సాధారణ దారం కంటే గట్టిగా పదునుగా ఉండడం.. గాలి పటాలు ఎగరేసిన తర్వాత అలానే వదిలేస్తుండడంతో రోడ్లపై వెళ్లే వారి మెడలకు చుట్టుకుని ప్రమాదాలు జరుగుతున్నాయి. దాంతో.. ఇప్పటికైనా చైనా మాంజా బ్యాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు బాధితులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..