Lulu Mall: నీ యవ్వా తగ్గేదేలే.. ‘లులు మాల్’కు తగ్గని జనసందోహం.. పరేషాన్‌లో పోలీసులు..
పండుగ సందర్భంగా కూకట్‌పల్లి 'లులు మాల్' పోలీసులకు మరోసారి తలనొప్పిగా మారింది. ఇప్పటికే ఈ మాల్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా.. జనాల తాకిడి ఏమాత్రం తగ్గడం లేదు. అందులోనూ ప్రతీ వీకెండ్‌లో మాల్‌కొచ్చే వారి సంఖ్య మరింత రెట్టింపు అవుతుంది. సాధారణంగా దసరా సీజన్‌లో అందరూ ఊరు బాట పడుతుంటారు.

పండుగ సందర్భంగా కూకట్‌పల్లి ‘లులు మాల్’ పోలీసులకు మరోసారి తలనొప్పిగా మారింది. ఇప్పటికే ఈ మాల్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా.. జనాల తాకిడి ఏమాత్రం తగ్గడం లేదు. అందులోనూ ప్రతీ వీకెండ్‌లో మాల్‌కొచ్చే వారి సంఖ్య మరింత రెట్టింపు అవుతుంది. సాధారణంగా దసరా సీజన్‌లో అందరూ ఊరు బాట పడుతుంటారు. దీంతో చాలా వరకు ట్రాఫిక్ అంతా ఫ్రీగా కదులుతుంది. పండుగ సీజన్ వచ్చిందంటే చాలు సిటీలో రోడ్లన్నీ చాలా వరకు నిర్మానుష్యంగా కనిపిస్తాయి. కానీ ఈసారి హైదరాబాద్‌లో పరిస్థితి మారింది. దసరా వీకెండ్ సెలవులు ఒకేసారి రావడంతో కూకట్‌పల్లి ‘లులు మాల్’లో జనాల తాకిడి విపరీతంగా పెరిగింది.
సాధారణంగా ఊర్లలో ఉండే జనాలు ఏదైనా సెలవులు వచ్చినప్పుడు తమ బంధువుల ఇంటికి హైదరాబాద్‌కి వస్తుంటారు. ఇక ఈసారి వస్తున్న వారంతా కచ్చితంగా ‘లులు మాల్’ చూడాలనుకుని కూకట్‌పల్లి వెళ్తున్నారు. దీంతో ప్రతిరోజు సాయంత్రం కూకట్‌పల్లి ‘లులు మాల్’ వద్ద భారీగా ట్రాఫిక్ స్తంబిస్తోంది. ‘లులు మాల్’ ప్రారంభమైనప్పటి నుంచి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ఇదో తలనొప్పిగా మారింది. ప్రతిసారి ట్రాఫిక్ డై-వర్షన్ చేపట్టాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ముఖ్యంగా సాయంత్రపు సమయాల్లో ‘లులు మాల్’కి వచ్చేవారి సంఖ్య విపరీతంగా పెరగటంతో పోలీసులు ట్రాఫిక్ స్తంభించకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి వస్తోంది. అందులోనూ దసరా పండుగ కావటంతో ‘లులు మాల్’లో షాపింగ్ చేయాలనుకునే వారి సంఖ్య కూడా పెరిగింది. ఉదయం, సాయంత్రం అనే తేడా లేకుండా నగరవాసులు ‘లులు మాల్’కు క్యూ కడుతున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఎక్కడికక్కడ వాహనాలు బారులుగా నిలిచిపోతున్నాయ్.
ఇప్పటికే ‘లులు మాల్’లో పలువురు సిటిజన్స్ చేసిన రచ్చ ఏ స్థాయిలో వైరల్ అయిందో అందరూ చూశారు. గతంలో ‘లులు మాల్’ ప్రారంభం సందర్భంగా.. మాల్‌ను వీక్షించడానికి వెళ్లిన పలువురు వ్యక్తులు అందులో సేవ్ చేసి ఉన్న ఫుడ్ ఐటమ్స్ అన్నింటిని తినేసి అక్కడే పడేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీంతో ‘లులు మాల్’ గురించి తెలియనివారు కూడా మాల్‌కు ఒకసారైనా వెళ్లాలని అనుకుంటున్నారు. అందులోనూ దసరా సీజన్ కావటంతో మాల్‌లో ఉన్న మల్టీప్లెక్స్‌లలో సినిమాకు సైతం వెళ్లాలనుకునేవారి సంఖ్య ఎక్కువైంది. అటు షాపింగ్.. ఇటు మల్టీప్లెక్స్ రెండు ఉండటంతో.. ఫుల్ ట్రాఫిక్ ఏర్పడింది.
మరోవైపు ‘లులు మాల్’ ఎలాంటి ఆఫర్లు పెట్టి జనాలను ఆకర్షించవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఇప్పటికే మాల్‌కు పెద్ద సంఖ్యలో జనాలు వస్తుండడంతో ఆఫర్లు పెట్టవద్దని చెబుతున్నారు హైదరాబాద్ పోలీస్. అలాగే ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు మాల్ సిబ్బందిని ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవని ‘లులు మాల్’ నిర్వాహకులకు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు సైబరాబాద్ పోలీసులు.
