ఇంజనీరింగ్ అద్భుతం కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ‘డిస్కవరీ ఛానెల్’లో ప్రత్యేక డాక్యుమెంటరీ.. వివరాలివే.!

ఆధునిక సాంకేతికతతో, అత్యంత భారీతనంగా నిర్మించిన తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై అంతర్జాతీయ ఛానెల్ ‘డిస్కవరీ' ప్రత్యేక...

  • Publish Date - 12:33 pm, Tue, 22 June 21
ఇంజనీరింగ్ అద్భుతం కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై 'డిస్కవరీ ఛానెల్'లో ప్రత్యేక డాక్యుమెంటరీ.. వివరాలివే.!
Kaleshwaram Project

ఆధునిక సాంకేతికతతో, అత్యంత భారీతనంగా నిర్మించిన తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై అంతర్జాతీయ ఛానెల్ ‘డిస్కవరీ’ ప్రత్యేక డాక్యుమెంటరీని ప్రసారం చేయనుంది. ‘లిఫ్టింగ్ ఎ రివర్’ పేరుతో రూపొందించిన ఈ ప్రోగ్రామ్ ఈ నెల 25వ తేదీ రాత్రి 8 గంటలకు ప్రసారం కానుంది. దాదాపు మూడేళ్ల పాటు చిత్రీకరించిన ఈ డాక్యుమెంటరీలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం మొదలు.. పూర్తయ్యే వరకు చోటు చేసుకున్న వివిధ ప్రధాన ఘట్టాలను, నిర్మాణ పనులు, దశలు వంటివి చూపించనున్నారు.

ఈ డాక్యుమెంటరీని అవార్డు విన్నింగ్ ఫిల్మ్‌మేకర్ కొండపల్లి రాజేంద్ర శ్రీవాత్స నిర్మించారు. హైదరాబాద్‌కు చెందిన ఈయన పలు రచనల ద్వారా అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. ఆయన తీసిన సినిమాలు ఆసియా టెలివిజన్ అవార్డు, సింగపూర్ (2010, 2012,), ఇండియన్ టెలీ అవార్డ్స్ (2012, 2016), ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డు (2018)లు అందుకున్నాయి.

ముఖ్యమంత్రి కేసీఆర్ కలగన్న జల తెలంగాణను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నెరవేర్చే లక్ష్యంతో స్వయంగా ఆయన ఆహోరాత్రులు శ్రమించి రీడిజైన్ చేసి సరికొత్త రూపుని ప్రాజెక్టుకు ఇచ్చారు. సీఎం కేసీఆర్ మానసపుత్రికగా గుర్తింపు పొంది.. తెలంగాణలోని భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద నిర్మించిన ఈ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు/కేఎల్ఐపి భారతదేశంలోనే కాక.. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టును ప్రాణహిత, గోదావరి నదుల సంగమం వద్ద నిర్మించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఇంజనీరింగ్ సంస్థ మేఘా ఇంజనీరింగ్& ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఓ భాగం అయింది.

2017లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని కేవలం మూడేళ్లలోనే పూర్తి చేసిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ సరికొత్త రికార్డుని నెలకొల్పింది. కాగా, ఇంతటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కాబట్టే.. 2017 నుంచి ప్రాజెక్టు పూర్తయ్యే వరకు అన్ని ఘట్టాలను వీడియో చిత్రీకరించారు. అందుకే ఈ ప్రాజెక్ట్‌ను ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్పవచ్చు.

కాళేశ్వరం ప్రాజెక్టులో, మేఘా ఇంజనీరింగ్ సంస్థ 15 భారీ పంపింగ్ స్టేషన్లను నిర్మించింది. తక్కువ వ్యవధిలో అన్ని యూనిట్లకు మొత్తంగా అంతర్జాతీయ ప్రామాణిక నాణ్యత కలిగిన 104 పంపింగ్ యంత్రాలను ఇన్‌స్టాల్ చేసింది. 5159 మెగావాట్ల పంపింగ్ సామర్థ్యాన్ని కలిగి ఈ ప్రాజెక్ట్‌లో MEIL 4439 మెగావాట్ల పంపింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది, ఇది ప్రపంచంలోనే ఓ అద్భుతం. ఈ ప్రాజెక్ట్ అంతటి ప్రాముఖ్యత సంతరించుకున్నది కాబట్టే డిస్కవరీ ఛానెల్‌ ప్రసారం చేసేందుకు సిద్దమైంది. కాగా, జూన్ 25వ తేదీ రాత్రి 8 గంటలకు ఇంగ్లీష్ సహా 6 భారతీయ భాషలలో ప్రపంచవ్యాప్తంగా ప్రసారం కానుంది.